Begin typing your search above and press return to search.

చైనాలో సరికొత్త కుంభకోణం... దేశాన్ని కుదిపేస్తోంది!

అవును... చైనాను ఇప్పుడు వంటనూనెల కుంభకోణం కుదిపేస్తుందని తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   11 July 2024 3:30 PM GMT
చైనాలో సరికొత్త కుంభకోణం... దేశాన్ని  కుదిపేస్తోంది!
X

చైనాలో 2008లో ఆహార కల్తీ కుంభకోణం దేశాన్ని కుదిపేసింది. ఇందులో భాగంగా... నాడు మెలామైన్ అనే కెమికల్ ను పాల పౌడర్ లో కలిపి విక్రయించడంతో సుమారు మూడు లక్షల మంది చిన్నారులు అనారోగ్యం పాలవ్వగా.. ఆరుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో తాజాగా వంటనూనే కుంభకోణం తెరపైకి వచ్చింది. ఈ కుంభకోణం ఇప్పుడు చైనాను కుదిపేస్తుంది.

అవును... చైనాను ఇప్పుడు వంటనూనెల కుంభకోణం కుదిపేస్తుందని తెలుస్తోంది. ఇందులో భాగంగా... అత్యంత ప్రమాదకరమైన కెమికల్స్ ను రవాణాచేసిన కంటైనర్లను ఏమాత్రం శుభ్రపరచకుండానే.. తిరిగి అదే కంటైనర్లలో వంటనూనెలు నింపి తరలించినట్లు ఆరోపణలు వెళ్లివెత్తుతున్నాయి. ఈ విషయం నెట్టింట గుప్పుమనడంతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి.

ఈ మేరకు బీజింగ్ న్యూస్ తాజాగా ఒక కథనం ప్రచురించింది. ఇందులో భాగంగా... చైనాలో వంటనూనెను ఇలా ప్రమాదకరమైన కంటైనర్లలో తరలించడం అనేది ఆ పరిశ్రమలో అత్యంత సహజమని, అది బహిరంగ రహస్యమని వెల్లడించింది. దీంతోపాటు ఇంధన రవాణాకు ఉపయోగించే ట్యాంకర్లను సిరప్ లు తరలించేందుకు కూడా వాడినట్లు గుర్తించారని వెల్లడించింది!

ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ విషయం చైనాలో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ కు చేరింది. ఇందులో భాగంగా చైనా సోషల్ నెట్ వర్క్ ఫ్లాట్ ఫాం విబోలో ఈ కుంభకోణం కథనాన్ని మిలియన్ల మంది చూశారని తెలుస్తోంది. ఇదే సమయంలో.. ఈ వ్యవహారంలో చైనా ప్రభుత్వరంగ కంపెనీల పేర్లు కూడా వినిపిస్తుండటం ఇప్పుడు మరింత హాట్ టాపిక్ గా మారింది.