Begin typing your search above and press return to search.

కోర‌లు చాచిన క‌రోనా.. 24 గంట‌ల్లో పిట్ట‌ల్లా రాలిపోయారు!

తాజాగా గ‌డిచిన 24 గంట‌ల్లో ఏకంగా 12 మందిని క‌రోనా పొట్ట‌న పెట్టుకుంది. వాస్త‌వానికి ప్ర‌స్తుతం ఉన్న క‌రోనాపై పెద్ద‌గా ప్ర‌చారం లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

By:  Tupaki Desk   |   5 Jan 2024 3:22 PM GMT
కోర‌లు చాచిన క‌రోనా.. 24 గంట‌ల్లో పిట్ట‌ల్లా రాలిపోయారు!
X

దేశంలో మ‌రోసారి క‌రోనా చాప‌కింద నీరులా విస్త‌రిస్తోంది. తొలి వేవ్‌.. రెండో వేవ్‌ల విష‌యంలో దేశ‌వ్యాప్తంగా ప్ర‌భుత్వాలు అలెర్ట య్యాయి. కానీ, ఈ ద‌ఫా మూడో వేవ్‌లో మాత్రం క‌రోనా చాలా సైలెంట్‌గా త‌న ప‌నితాను చేసుకుంటూ పోతోంది. గత కొన్నాళ్లుగా కేర‌ళ, మ‌హారాష్ట్ర‌, ఢిల్లీ, తెలంగాణ రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నాయి. తాజాగా గ‌డిచిన 24 గంట‌ల్లో ఏకంగా 12 మందిని క‌రోనా పొట్ట‌న పెట్టుకుంది. వాస్త‌వానికి ప్ర‌స్తుతం ఉన్న క‌రోనాపై పెద్ద‌గా ప్ర‌చారం లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. జేఎన్‌1గా పిలిచే తాజా రూపాంత‌రం చెందిన క‌రోనా వైర‌స్‌పై ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం కూడా లేద‌ని వైద్యులు చెబుతున్నారు.

కానీ, దేశంలో న‌మోద‌వుతున్న కేసులు, పెరుగుతున్న మ‌ర‌ణాలు గ‌మ‌నిస్తే.. జేఎన్ 1 ర‌కం కూడా డేంజ‌రేన‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ చెప్పిన వివ‌రాల ప్ర‌కారం.. కొత్తగా 761 క‌రోనా కేసులు నమోద‌య్యాయి. అయితే.. గ‌డిచిన 24 గంట‌ల్లో మాత్రం మ‌ర‌ణాల సంఖ్య పెరిగింది. కేరళలో 5, కర్ణాటకలో 4, మహారాష్ట్రలో 2, ఉత్తర్‌ప్రదేశ్‌లో ఒకరు చొప్పున క‌రోనా కార‌ణంగా తుదిశ్వాస విడిచిన‌ట్టు కేంద్ర ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. ఇక‌, యాక్టివ్‌ కేసుల సంఖ్య మాత్రం స్వ‌ల్పంగా త‌గ్గింది. 24 గంట‌ల ముందు 4,423గా ఉన్న యాక్టివ్ కేసులు 4,334కి తగ్గాయి.

కేరళలో 1,249 క్రియాశీల కేసులు ఉండగా.. కర్ణాటకలో 1,240, మహారాష్ట్రలో 914, తమిళనాడులో 190, ఛత్తీస్‌గఢ్‌, ఆంధ్రప్రదేశ్‌లో 128 చొప్పున ఉన్నాయి. కొత్త వేరియంట్‌ జేఎన్‌.1 కేసుల సంఖ్య పెరుగుతోంది. గురువారం నాటికి 12 రాష్ట్రాల్లో జేఎన్ 1 కేసులు 619 నమోద‌య్యాయి. ఒక్క కర్ణాటకలోనే అత్యధికంగా 119 కేసులు నమోదు కాగా.. కేరళలో 148; మహారాష్ట్రలో 110; గోవా 47; గుజరాత్‌ 36; ఆంధ్రప్రదేశ్‌ 30; తమిళనాడు 26; దిల్లీ 15; రాజస్థాన్‌ 4; తెలంగాణ 2; ఒడిశా, హరియాణాలలో ఒక్కొక్కటి చొప్పున జేఎన్‌1 కేసులు న‌మోద‌య్యాయి.

చ‌లికి-క‌రోనాకు సంబంధం

దేశంలో పెరుగుతున్న చ‌లితీవ్ర‌త‌కు క‌రోనా కేసులు పెరుగుతుండ‌డానికి మ‌ధ్య సంబంధాలు ఉన్నాయ‌ని వైద్యులు చెబుతున్నారు. చలితీవ్రత పెరగడంతో కొవిడ్‌ కేసుల సంఖ్య అనూహ్యంగా పెరిగిందని అంటున్నారు. గ‌డిచిన‌ 24 గంటల వ్యవధిలోనే 12 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదిలావుంటే, తాజా ప‌రిణామాల‌పై ఆయా రాష్ట్రాల‌ను కేంద్రం అలెర్ట్ చేసింది. ఎలాంటి ప‌రిస్థితి ఎదురైనా త‌ట్టుకునేలా సంసిద్ధంగా ఉండాల‌ని సూచించింది.