ఏపీలో ఎమ్మెల్యేలు కాదు..కార్పొరేటర్లే సర్వస్వం.. ఏం జరుగుతోంది..!
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో టీడీపీకి కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు దక్కకపోయినా.. కార్పొరేటర్లు అయితే దక్కారు.
By: Tupaki Desk | 28 Nov 2024 1:30 PM GMTరాష్ట్రంలోని పలు జిల్లాల్లో టీడీపీకి కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు దక్కకపోయినా.. కార్పొరేటర్లు అయితే దక్కారు. 2021లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ పోటీకి దూరంగా జరిగింది. దీనికి కారణం అప్ప ట్లో వైసీపీ సర్కారు నిర్బంధాలు, నామినేషన్లు కూడా వేయనివ్వని పరిస్థితి నెలకొంది. అయితే.. కొన్నిజిల్లాల్లో మాత్రం టీడీపీ తరఫున నాయకులు స్వతంత్రంగానే పోటీ చేశారు. గెలిచారు కూడా. సంఖ్య బలం తక్కువగానే ఉన్నా.. పార్టీ తరఫున వారు విజయం దక్కించుకున్నారు.
అయితే.. నిన్న మొన్నటి వరకు కార్పొరేటర్ల పరిస్థితి ఎలా ఉన్నా.. ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. టీడీపీ కార్పొరేటర్లు.. తమ రూపం మార్చుకున్నారన్నది పెద్ద ఎత్తున వస్తున్న విమర్శ. కొన్ని కొన్ని జిల్లాల్లో ఎమ్మెల్యేలకు వీరు రైట్‌హ్యాండ్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. ఇది తప్పుకాదు.మళ్లీ వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేల మద్దతు అవసరం కాబట్టి వారు ఎమ్మెల్యేలకు దన్నుగా వ్యవహరించడాన్ని తప్పు పట్టలేం. కానీ, ఇక్కడే ఎమ్మెల్యేలకు వారు చేస్తున్న `సేవలు` వివాదం అవుతున్నాయి.
ఇసుక, మద్యం వ్యవహారాల్లో ఎమ్మెల్యేలు ఇప్పుడు నేరుగా జోక్యం చేసుకోకుండా.. తమకు అనుంగులుగా ఉన్న కొందరు కార్పొరేటర్లను రంగంలోకి దింపుతున్నారు. విజయవాడ, విశాఖపట్న, గుంటూరు తదితర నగరాల్లో ఏం జరగాలన్నా..కార్పొరేట్లను కలుసుకునే విధానం తెచ్చారు. ఎమ్మెల్యేలకు కార్యాలయాలు ఉంటాయి. కానీ, అక్కడకార్పొరేటర్లు తిష్ట వేస్తున్నారు. ఎవరైనా పనులపై వెళ్తే.. వెంటనే వారితో చర్చించి.. బేరాలు కుదుర్చుకుంటున్నారన్న విమర్శలు వస్తున్నాయి.
కేవలం విమర్శలేకాదు.. టీడీపీ నిర్వహిస్తున్న ప్రజాదర్బార్‌కు కూడా.. ఈ ఫిర్యాదులే ఎక్కువగా వస్తున్నా యి. కార్పొరేటర్ల దూకుడును కట్టడి చేయాలని చూస్తే.. తెరవెనుక ఎమ్మెల్యేలు ఉన్నారన్న వాదన బలంగా వినిపిస్తోంది. విజయవాడలోని మూడు నియోజకవర్గాల్లో రెండు చోట్ల ఇదే పరిస్థితి నెలకొంది. గుంటూరులో ఏకంగా.. ఎమ్మెల్యేకు సమాంతరంగా కార్పొరేటర్లు వ్యవహారాలను నడిపిస్తున్నారు. ఈ పరిణామాలతో పార్టీకి మరో బ్యాడ్ నేమ్ ఖాయమని అంటున్నారు పరిశీలకులు.