Begin typing your search above and press return to search.

స్థాయీ ఎన్నికల్లో కూటమి విజేత వైసీపీకి భారీ షాక్

టెక్నికల్ గా చూస్తే మొత్తం 58 మంది కార్పోరేటర్లు మద్దతు వైసీపీకి ఉంది.

By:  Tupaki Desk   |   7 Aug 2024 6:24 PM GMT
స్థాయీ ఎన్నికల్లో కూటమి విజేత  వైసీపీకి భారీ షాక్
X

మహా విశాఖ నగర పాలక సంస్థ స్థాయీ సంఘం ఎన్నికల్లో టీడీపీ కూటమి హవా చాటుకుంది. పదికి పది స్థానాలను కూటమి అభ్యర్ధులు గెలుచుకుని విజయ ఢంకా మోగించారు. దీంతో వైసీపీకి భారీ షాక్ తగిలింది. మేయర్ వైసీపీకి చెందిన వారు. టెక్నికల్ గా చూస్తే మొత్తం 58 మంది కార్పోరేటర్లు మద్దతు వైసీపీకి ఉంది.

అయినా కూడా ఒక్క స్థానాన్ని కూడా వైసీపీ గెలుచుకోలేక చతికిలపడింది. మరో వైపు చూస్తే కూటమి అభ్యర్థులలో కొందరికి అరవైకి పైగా ఓట్లు వచ్చాయి అంటే వైసీపీ బలం పూర్తిగా అటు వైపు టర్న్ అయినట్లుగా చెబుతున్నారు. వైసీపీకి చెందిన కార్పోరేటర్లు అంతా ఎక్కువ మంది కూటమికి జై కొట్టారు అని అర్ధం అవుతోంది.

మొత్తం 97 మంది జీవీఎంసీలో కార్పోరేటర్లు ఉన్నారు. ఇందులో టీడీపీకి 29 మంది కార్పోరేటర్లు ఉంటే బీజేపీకి ఒకరు, జనసేనకు ముగ్గురు, నలుగురు ఇండిపెండెంట్లు ఉంటే ఉభయ వామపక్షాలకు చెరో కార్పోరేటర్ ఉన్నారు. ఈ నేపథ్యంలో జరిగిన స్థాయీ సంఘం ఎన్నికల్లో తొంబై మంది కార్పోరేటర్లు మాత్రమే తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు.

సీపీఎం కార్పోరాటర్ ఓటింగ్ కి దూరంగా ఉన్నారు. ఇక వైసీపీకి నికరంగా 40 మంది కార్పోరేటర్లు ఉన్నారు అని అనుకున్నారు. జగన్ ఆ మధ్య మీటింగ్ పెడితే అక్కడకు వెళ్ళిన వారు నలభై మందిగా లెక్క తేలింది. కానీ కూటమి అభ్యర్ధులలో కొందరికి అరవై ఓట్లు పైన రావడం చూస్తే జీవీఎంసీలో వైసీపీ బలం సగానికి సగం పడిపోయినట్లుగా అర్ధం అవుతోంది.

అంటే వైసీపీకి 30 మంది కార్పోరేటర్ల దాకానే నికరంగా మద్దతు ఉందని అంటున్నారు. ఇందులో పది మంది స్థాయీ సంఘం ఎన్నికల్లో అభ్యర్ధులుగా పోటీలో ఉంటే వారితో పాటు మరో ఇరవై మంది మాత్రమే వైసీపీకి అండగా నిలిచారు అన్న మాట. జీవీఎంసీలో అధికారంలో ఉంటూ మేయర్ పదవిని అందుకుని మూడు సార్లు స్థాయీ సంఘం పదవులను ఏకగ్రీవంగా గెలిపించుకుని ఎదురులేదని నిరూపించుకున్న వైసీపీకి టీడీపీ గట్టి షాక్ ఇచ్చేసింది అని అంటున్నారు.

ఈ దెబ్బతో మేయర్ పదవి కూడా హుళక్కే అని అంటున్నారు. మరో వైపు చూస్తే టీడీపీ కూటమి తమ కార్పోరేటర్లను ప్రలోభాలకు గురి చేసింది అని వైసీపీ నేతలు చెబుతున్నారు. అదే విధంగా కొందరు కార్పోరేటర్లు పెన్సిల్ తో గీత పెట్టి బ్యాలెట్ పేపర్ మీద ఓటు వేశారు అని అవన్నీ పదహారు దాకా చెల్లని ఓట్లు ఉన్నాయని అయినా వాటిని కలిపి నిబంధనలను పక్కన పెట్టారని, దీని మీద న్యాయ స్థానాన్ని ఆశ్రయిస్తామని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఎవరేమి చెప్పినా విజయం మాత్రం కూటమికే దక్కింది. సో విశాఖ వైసీపీ మరో సారి వెరీ వీక్ అని తెలిసిపోయింది.