కూటమి ప్రభుత్వం.. శాఖల్లో 'చిత్రాలు' చంద్రబాబుకు తెలిస్తే ...!
ఇప్పుడు కూడా అదే పరిస్థితి వచ్చే ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి.. చంద్రబాబు ఇప్పటికైనా శాఖలను ప్రక్షాళన చేయడమో.. లేక అవినీతిపై యుద్ధం ప్రకటించడమో చేయాలి.
By: Tupaki Desk | 1 Jan 2025 1:30 AM GMTకూటమి సర్కారులోని మంత్రుల్లో చాలా మంది తమ 'దారి'ని తాము ఎంచుకున్నారు. ''ఏంటయ్యా.. మాట్లాడుతావు. మీకేం తెలుసు..? జనాల్లోకి వెళ్తే ఎంత ఖర్చు పెట్టాల్సి వస్తోందనుకుంటున్నావు. ఇవన్నీ చూసీ చూడనట్టే పోవాలి'' -ఇదీ.. ఓ మంత్రివర్యులు తన పేషీలో ఓ మీడియా ప్రతినిధితో వ్యాఖ్యానించిన తీరు. ఇది ఒకటి రెండు శాఖల్లో బయటపడినా.. మరికొన్ని శాఖల్లో మాత్రం అంతర్గతంగానే ఉంది. మొత్తం శాఖల్లో కీలకమైన వాటిలో ఈ తరహా పరిస్థితి ఉండడం విస్మయాన్ని కలిగిస్తోంది.
నిజానికి అనుకూల మీడియాకు ఇవన్నీ పట్టవు అనుకుంటాం. కానీ, అనుకూల మీడియాలో కూడా.. ప్రచు రించేంత స్థాయిలో శాఖలు.. చిత్రమైన పరిణామాల దిశగా అడుగులు వేస్తున్నాయి. అదేమంటే.. గతంలో చేయలేదా.. గతంలో కొండలు మింగేయలేదా? అని ఎదురు ప్రశ్నిస్తున్న అధికారులు ఎక్కిడికక్కడ దర్శనమిస్తున్నారు. అంటే.. గతంలో వైసీపీ నేతలు దోచుకున్నారు.. ఇప్పుడు మమ్మల్ని ఎందుకు ప్రశ్నిస్తున్నారన్న ధోరణి కూడా పెరుగుతోంది.
వాస్తవానికి.. గతంలో వైసీపీ ప్రభుత్వం అవినీతిపై చెప్పి మరీ కొరడా ఝళిపించింది. క్షేత్రస్థాయిలో అధి కారులు ఒక్కటై.. వైసీపీకి వ్యతిరేకంగా మారడానికే అవినీతి లేకపోవడం ప్రధాన కారణం. వలంటీర్ వ్యవస్థ కారణంగా.. ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకు రావడం మానేశారు. వలంటీర్లతోనే పనులు చేయించుకున్నారు. దీంతో అధికారుల చేతులు తడిపిన వారు లేరు. ఇది వారికి కంటగింపుగా మారింది. కానీ, ఇప్పుడు వలంటీర్ వ్యవస్థను తీసేయడం.. ఏచిన్న పని అయినా.. అధికారుల చుట్టూ తిరగాల్సిరావడంతో చివరకు చేతులు తడపక తప్పడం లేదు.
ఎవరిది నేరం..
ఈ మొత్తం పరిణామాలను గమనిస్తే.. ఇప్పుడిప్పుడే.. పొగలు వస్తున్న అవినీతి వ్యవహారం.. గతంలో చంద్రబాబును చుట్టుముట్టిన విషయాన్ని గుర్తు చేస్తోంది. ''ఔను.. కొందరు నాయకులు తప్పులు చేశారు'' అని 2019లో చంద్రబాబు ఒప్పుకొని వంగి వంగి దణ్ణాలు పేట్టాల్సి వచ్చింది. అంటే..తాను తప్పు చేయకపోయినా.. తన పార్టీ నేతల తప్పులు కాయాల్సివచ్చింది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి వచ్చే ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి.. చంద్రబాబు ఇప్పటికైనా శాఖలను ప్రక్షాళన చేయడమో.. లేక అవినీతిపై యుద్ధం ప్రకటించడమో చేయాలి. లేకపోతే.. మరోసారి దణ్ణాలు పెట్టే పరిస్థితి రాక తప్పదని పరిశీలకులు హెచ్చరిస్తున్నారు.