అవినీతిని ఛీదరించే కాలమేనా ఇది?
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అవినీతిపై ఆరోపణలు, ప్రత్యారోపణలతో నేతలు మాటల తూటాలు పేల్చుతుంటారు.
By: Tupaki Desk | 13 Jan 2025 10:30 PM GMTఎన్నికలు ఎప్పుడు వచ్చినా అవినీతిపై ఆరోపణలు, ప్రత్యారోపణలతో నేతలు మాటల తూటాలు పేల్చుతుంటారు. ప్రత్యర్థి అక్రమాలు, అవినీతిపై పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంటారు. ఎన్నికలు అవ్వగానే ఆ ఆరోపణలు ఆధారంగా రిజల్ట్ వచ్చిందని చెబుతుంటారు. కానీ, వాస్తవానికి ప్రజలు అవినీతి ఆరోపణలపై ఎలా స్పందిస్తున్నారు? నేతలు చెప్పే మాటలను ప్రజలు విశ్వసిస్తున్నారా? లేదా? అన్నది మాత్రం ఎన్నికల తర్వాత సమీక్షించరు. అందుకే కొన్నిసార్లు ఎంతటి తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఉన్నా, ఆ నేతలు ప్రజల ఆదరణ పొంది చట్టసభల్లో అడుగుపెడుతున్నారు. పెద్ద నేతలైతే తమపార్టీలను గెలిపించుకుని ముఖ్యమంత్రులు అవుతున్నారు.
ఢిల్లీ ఎన్నికల వేళ మద్యం కుంభకోణంపై కాగ్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఖజానాకు రూ.2 వేల కోట్ల నష్టం వాటిల్లిందని ఆరోపణలు గుప్పిస్తూ నివేదిక ఇవ్వడం సంచలనంగా మారింది. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కాంలో మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, మాజీ మంత్రి సిసోడియాతో సహా ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన కీలక నేతలు అరెస్టు అయ్యారు. జైలుకు వెళ్లి వచ్చారు. ఓ విధంగా ఈ లిక్కర్ స్కామే ప్రధాన ప్రచారాస్త్రంగా ఎన్నికలు జరుగుతున్నాయి. ఏ నేరం చేయలేదని, అన్యాయంగా తనను అరెస్టు చేసి జైలుకు పంపారని మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సానుభూతి పొందే ప్రయత్నం చేస్తుండగా, అవినీతిపై పోరాటమంటూ రాజకీయాల్లోకి వచ్చిన కేజ్రీవాల్ తీవ్ర అవినీతిపరుడని చిత్రీకరించేలా ప్రతిపక్ష బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యమంత్రి అధికారిక నివాసం అద్దాల మేడ కోసం ప్రజాధనం దుర్వినియోగం చేశారని బీజేపీ దుమ్మెత్తిపోస్తోంది. దీనిపై ప్రజల్లో ఆదరణ లభించడం లేదనుకుందో? ఇంకా తీవ్రమైన ఆరోపణలు చేయాలనుకుందో కానీ, ఇప్పుడు మరోసారి లిక్కర్ స్కాంను తెరపైకి తెచ్చింది.
కాగ్ నివేదికతో ఎన్నికల్లో అవినీతిపై మరోమారు చర్చ జరుగుతోంది. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతిపరులు అంటూ విపక్షానికి చెందిన పలువురు నేతలను జైలుకు పంపింది. అయితే కొన్నిసార్లు బీజేపీ వ్యూహం పనిచేయగా, దేశవ్యాప్తంగా చూస్తే అవినీతి ఆరోపణలను ప్రజలు పెద్దగా పట్టించుకోవడం లేదనే విషయం ఎన్నికల ఫలితాల ద్వారా తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం జరిగిన ఝార్ఖండ్ ఎన్నికల్లో సీఎం హేమంత్ సొరేన్ పార్టీ ఘన విజయం సాధించింది. ఆ ఎన్నికల్లో సొరేన్ అవినీతిపరుడంటూ బీజేపీ తీవ్ర ఆరోపణలు చేసింది. అంతేకాకుండా ఎన్నికలకు కొన్ని నెలల ముందు సొరేనును జైలుకు పంపింది. ముఖ్యమంత్రి హోదాలో ఉండగా సొరైన్ అరెస్టు కావడం జేఎంఎంకి కలిసొచ్చిందని విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో ప్రజావ్యతిరేకత పోయి ఆయనపై సానుభూతి వెల్లువెత్తి ఓట్ల వర్షం కురిసిందని విశ్లేషిస్తున్నారు.
ఇక ఏపీలో ప్రధాన పార్టీలకు నాయకత్వం వహిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ ముఖ్యమంత్రి జగన్ ఇద్దరూ అవినీతి ఆరోపణల్లో జైలుకు వెళ్లివచ్చిన వారే. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబుపై అవినీతి చేశారంటూ అరెస్టు చేయించడమే ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమికి కారణమనే విశ్లేషణలు ఉన్నాయి. ఇక అంతకుముందు జరిగిన ఎన్నికల్లో సైతం జగన్ రికార్డు స్థాయి మెజార్టీ సాధించడానికి ప్రధాన కారణం ఆయన అరెస్టు వ్యవహారమనే విశ్లేషణలు ఉన్నాయి. ఇలా ఏపీలోనే కాదు తమిళనాడు, కర్ణాటక, కేరళతోపాటు అనేక రాష్ట్రాల్లో అవినీతి కేసుల్లో ఇరుక్కున్న నేతలు ఎన్నికల్లో విజయం సాధించి మళ్లీ అధికారంలోకి వచ్చారు.
ఈ పరిస్థితుల్లో ఢిల్లీలో అవినీతి ఆరోపణలు ఎన్నికల ప్రచారాస్త్రం కావడం ఆసక్తికరంగా మారింది. గత నాలుగేళ్లుగా ఢిల్లీ లిక్కర్ స్కాంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. తెలంగాణలో బీఆర్ఎస్ ఓడిపోవడానికి ఈ కుంభకోణంలో ఆ పార్టీ నేత కవిత పాత్ర ఉందనే ప్రచారం ఒకటి ఉంది. అయితే ఈ అంశం ఢిల్లీ ఎన్నికల్లో ప్రభావం చూపుతుందా? లేదా? అనేదే ఇప్పుడు చర్చకు తావిస్తోంది. నాలుగేళ్లుగా ప్రజల్లో చర్చ జరుగుతున్న కుంభకోణం బీజేపీకి కలిసివస్తుందా? వరుసగా రెండు ఎన్నికల్లో గెలిచిన ఆప్ పార్టీపై సానుభూతి కురిపిస్తుందా? అన్నది చూడాల్సివుంది. ఏదిఏమైనా ఢిల్లీ ఎన్నికలపై అవినీతి ఆరోపణలు ప్రభావం ఎంతవరకు పనిచేస్తుందని తెలుసుకోవాలంటే ఫిబ్రవరి 8వరకు వేచిచూడాల్సిందే..