గల్లాలు ఓపెన్.. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు..!
ఈ క్రమంలోనే తాజాగా గత 20 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అంతర్గత చర్చ.. `గల్లాలు ఓపెన్` అనే విషయంపైనే!!
By: Tupaki Desk | 17 Nov 2024 1:30 AM GMTపైకి కనిపించేది మంచీ.. కనిపించనది చెడు అని అనుకునే రోజులు లేవు. ఇప్పుడు ఎక్కడ ఏం జరిగినా.. వెంటనే సోషల్ మీడియాలో బాహ్య ప్రపంచానికి చేరిపోతోంది. ఈ విషయంలో ఎలాంటి అంశంపైనైనా రాజీ పడలేకపోతున్న ప్రజలు కనిపిస్తున్నారు. దీంతో ఎక్కడ ఏమూల ఏం జరిగినా.. ఇప్పుడు క్షణాల్లో తెలిసిపోతోంది. ఈ క్రమంలోనే తాజాగా గత 20 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అంతర్గత చర్చ.. `గల్లాలు ఓపెన్` అనే విషయంపైనే!!
ఆశ్చర్యం ఏమీలేదు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు.. అనంతపురం నుంచి విజయనగరం వరకు.. రాష్ట్ర వ్యాప్తంగా పనులు కావాలంటే పైసలు కొట్టాల్సిందే అన్న మాటే వినిపిస్తోంది. ఈ విషయం సోషల్ మీడియాలో సాధారణ ప్రజల నుంచే ఎక్కువగా వినిపిస్తుండడం గమనార్హం. తహసీల్దార్ కార్యాలయం నుంచి క్షేత్రస్థాయిలో ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాల వరకు.. కమీషన్ల పర్వం ఎలాంటి సంకోచం లేకుండా సాగిపోతోంది.
``అవును. ఇవ్వాలి. మా ఒక్కరికే కాదు`` అనే మాట సంబంధిత ప్రభుత్వ వర్గాల నుంచి వినిపిస్తున్న వైనం కనిపిస్తోంది. ఈ విషయంలో తన మన అనే తేడా కూడా లేకుండాపోయింది. స్టాంపు పేపర్ నుంచి ఇతర పనుల వరకు.. స్థానిక ఎమ్మెల్యేల చేతి వాటం పెరిగిపోయిందని అనుకూల మీడియాల్లోనూ వస్తున్న వార్తలు ప్రభుత్వానికి బ్యాడ్ నేమ్ మోస్తున్నాయి. దీనిపై చంద్రబాబు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కానీ స్పందించకపోవచ్చు. కానీ, అంతర్గత చర్చల్లో వారు కూడా ఈ విషయంపై చర్చిస్తున్నారు.
విజయవాడ, గుంటూరు, అనంతపురంలో చాలా మంది ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యేలు గల్లాలు ఓపెన్ చేసేశా రు. నాకెంత? నాకేంటి? అనే మాట వినిపిస్తోంది. ప్రతి పనికీ రేటు కట్టేస్తున్నారు. వసూలు చేసేందుకు కార్పొరేటర్లకు సర్వాధికారాలు అప్పగిస్తున్నారు. అంతేకాదు.. అధికారులు కూడా ఒకప్పుడు భయపడే పరిస్థితి నుంచి ఇప్పుడు ఓపెన్‌గానే డిమాండ్ చేస్తున్నారు.
దీనిని ఎవరైనా ప్రశ్నిస్తే.. ``తమ ఒక్కరికే కాదని.. పైవాళ్లకు కూడా ఇవ్వాలని`` తెగేసి చెబుతున్నారు. నిజానికి సర్కారు ఏర్పడి ఐదు మాసాలే అయింది. ఇంతలోనే ఇలా వసూళ్ల పర్వం ప్రారంభించే సరికి.. ప్రజల్లో ఈ వ్యవహారం విస్తృతంగా చర్చకు వస్తుండడం గమనార్హం. మరి దీనిని చంద్ర బాబు, పవన్ కల్యాణ్‌లు కట్టడి చేస్తారో.. చూస్తూ కూర్చుంటారో చూడాలి.