Begin typing your search above and press return to search.

తెలుగు రాష్ట్రాల్లో తొలి అధిక్యాలు ఎవరి ఖాతాలో?

రెండు తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. ఏపీలో ఎంపీ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి.

By:  Tupaki Desk   |   4 Jun 2024 3:54 AM GMT
తెలుగు రాష్ట్రాల్లో తొలి అధిక్యాలు ఎవరి ఖాతాలో?
X

అనుకున్న రోజు రానే వచ్చింది. ఉదయం 8 గంటలకు మొదలైన ఓట్ల లెక్కింపునకు సంబంధించి మొదటి అరగంట పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు జరుగుతుందన్న విషయం తెలిసిందే. తుది ఫలితం ఏదైనా ఆరంభంలో అధిక్యం ఎవరు నమోదు చేస్తారన్నది ఆసక్తికరం. ఎందుకంటే.. ఈ ఆరంభం అంతకంతకూ పెరగటమే కానీ తగ్గటం ఉండదు. చాలా తక్కువ సందర్భాల్లోనే ఇలాంటి పరిస్థితి నెలకొని ఉంటుంది. ఓట్ల లెక్కింపు మొదలై అరగంటకే అధిక్యతలకు సంబంధించిన ఫలితం కొంచెం వెలువడింది.

రెండు తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. ఏపీలో ఎంపీ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. తెలంగాణలో ఒక అసెంబ్లీ ఉప ఎన్నికతో పాటు.. లోక్ సభలకు ఎన్నికలు జరిగాయి. ఉదయం ఓట్ల లెక్కింపు మొదలైన తర్వాత వెల్లడైన అధిక్యతల విషయానికి వస్తే.. ఏపీలో 175 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ 2 చోట్ల అధిక్యతలో ఉంది. మిగిలిన స్థానాలకు సంబంధించిన అధిక్యతలు వెల్లడి కావాల్సి ఉంది. అధికార వైసీపీ ఇప్పటివరకు అధిక్యతలను నమోదు చేయలేదు. మొదటి అరగంట వరకు టీడీపీ రెండు అసెంబ్లీ స్థానాల్లో.. ఒక ఎంపీ స్థానంలో అధిక్యతలో ఉంది. కౌంటింగ్ మొదలైన 45 నిమిషాలకు అంటే 8.45 గంటల వేళకు.. టీడీపీ 4 అసెంబ్లీస్థానాల్లో.. రెండు పార్లమెంట్ స్థానాల్లో అధిక్యతలో ఉండగా.. మిగిలిన పార్టీలేవీ అధిక్యత ఖాతాను ఓపెన్ చేయలేదు.

అదే సమయంలో తెలంగాణ విషయానికి వస్తే రెండు స్థానాల్లో బీజేపీ.. కాంగ్రెస్.. మజ్లిస్ పార్టీలు ఒక్కొక్క స్థానంలో అధిక్యతలో ఉన్నట్లుగా తేలింది. ఇక.. జాతీయ స్థాయిలో చూస్తే.. బీజేపీ కూటమి 122 స్థానాల్లో అధిక్యతలో ఉంటే.. కాంగ్రెస్ 65 స్థానాల్లో ఇతరులు 28 ఎంపీ స్థానాల్లో అధిక్యతలో ఉన్నట్లుగా తేలింది. మొత్తంగా చూస్తే.. అధిక్యతలో బోణీ ఎవరిదన్నది చూస్తే.. ఏపీలో టీడీపీ.. తెలంగాణలో బీజేపీ.. జాతీయస్థాయిలో కూడా బీజేపీనే ఉంది. అయితే.. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమంటే.. జాతీయస్థాయిలో బీజేపీ కూటమికి వచ్చిన అధిక్య స్థానాలకు సగం వరకు కాంగ్రెస్ కూటమికి రావటం గమనార్హం.

Live Updates

  • 4 Jun 2024 4:50 AM GMT

    కౌంటింగ్ కేంద్రంనుంచి వెళ్లిపోయిన కొడాలి నాని, వంశీ!

    ఏపీలో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ రసవత్తరంగా జరుగుతుంది. ప్రస్తుతం వస్తున్న ఫలితాలు ఏపీలో వార్ వన్ సైడ్ అన్నట్లుగానే పరిస్థితి ఉంది. ఈ సమయంలో పోలింగ్ కేంద్రాల వద్ద ఉన్న పలువురు వైసీపీ నేతలు.. అక్కడ నుంచి తిరిగి వెళ్లిపోవడం ఆసక్తికరంగా మారింది.

    ఇందులో భాగంగా ఇప్పటికే రాజమండ్రిలో మార్గాని భరత్, గుడివాడలో కొడాలి నాని, గన్నవరంలో వల్లభనేని వంశీ లు కౌంటింగ్ కేంద్రాల నుంచి వెనుదిరిగి వెళ్లిపోయారని తెలుస్తుంది.