ఏపీని మించిన ఒడిశా.. నవీన్ అనారోగ్యమే బీజేపీ ఆయువుపట్టు!!
ఇక, నాలుగు అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల్లో రెండు రాష్ట్రాల్లో ఆదివారం కౌంటింగ్ జరిగిపోయింది.
By: Tupaki Desk | 3 Jun 2024 1:30 AM GMTమరికొన్ని గంటల్లోనే దేశంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. వచ్చే ఐదేళ్లపాటు దేశాన్ని పాలించేదెవరు? ప్రతిపక్షంలో కూర్చునేదెవరు అనే విషయంలో ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రస్ఫుటం కానుంది. ఎవరు ఎవరికిఓటే శారు.. ఎవరిని అందలం ఎక్కించారు? అనేవిషయాలు తేటతెల్లం కానున్నాయి. ఇక, నాలుగు అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల్లో రెండు రాష్ట్రాల్లో ఆదివారం కౌంటింగ్ జరిగిపోయింది. కీలకమైన ఏపీ, ఒడిశా రాష్ట్రాల్లో మంగళవారం కౌంటింగ్ జరగనుంది. ఏపీలో ఎంత వేడి ఉందో అందరికీ తెలిసిందే.
అదేవిధంగా ఒడిశాలో దీనికి మించిన వేడి ఉందనే విషయం చాలా మంది తెలుగు వారికి తెలియదు. సీఎం నవీన్ పట్నాయక్ అనారోగ్యం కేంద్రంగా సాగిన ప్రచారం.. అక్కడ ఓటర్లను ఎటు మలుపు తిప్పుతుందనేది ఆసక్తిగా మారింది. ఎన్నడూ లేని విధంగా ఈ సారి బీజేపీ అక్కడ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని ఎనిమిది ఎగ్జిట్ పోల్స్ చెప్పడం గమనార్హం. ఆది నుంచి బీజేపీ నవీన్ ను టార్గెట్ చేసింది. పైకి మిత్రపక్షమే అయినా.. అంతర్గతంగా మాత్రం బీజేపీ ఎన్నికల సమయంలో నవీన్ పట్నాయక్ పార్టీ బిజు జనతాదళ్‌ను ఓడించేందుకు రెడీ అయింది.
ఈ క్రమంలోనే ఆయన అనారోగ్యాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రతి సభలోనూ ప్రస్తావించారు. ``నవీన్ బాబు పని అయిపోయింది. ఆయన అనారోగ్యంతో అల్లాడుతున్నారు. పాలించే శక్తి లేదు. ఉన్నది బీజేపీ మాత్రమే `` అంటూ.. మోడీ చేసిన వ్యాఖ్యలకు నవీన్ బలమైన కౌంటర్లు ఇవ్వలేక పోయారు. దీంతో ఒడిశాలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. నిజానికి ఒడిశాలో గత 25 సంవత్సరాలుగా నవీన్ పట్నాయక్ ప్రభుత్వమే ఉంది. అయితే.. ఆయనను టార్గెట్ చేసేందుకు అవినీతి లేదు. బంధు ప్రీతి అంతకన్నా లేదు. ఎందుకంటే ఆయన బ్యాచ్‌లర్. పైగా.. రూపాయి జీతం తీసుకునే సీఎంగా గుర్తింపు పొందారు.
అధికారులకు కూడా.. తక్కువ జీతాలే. సలహాదారులు కూడా తక్కువే. కేవలం శాఖకు ఒకరు. మొత్తం 8 శాఖలు. ఎనిమిది మందే సలహాదారులు. వారికి ఇచ్చే జీతం కూడా.. నెలకు రూ.30 వేలు. దీంతో ఒడిశాలో బీజేపీ టార్గెట్ కేవలం నవీన్ అనారోగ్యం మాత్రమే. దీనికి ఉన్న ఒకే ఒక్క చిన్న కారణం పట్టుకుని బీజేపీ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. ఓ ప్రచార సభలో సీఎం నవీన్ కుడిచేసి వణికిపోయింది. ఇది మీడియాలోనూ వచ్చింది. అలా ఎందుకు జరిగిందో వైద్యులు కూడా చెప్పలేదు. దీంతో ఈ విషయాన్ని బీజేపీ యాగీ చేసింది. ఇదే ఇప్పుడు అక్కడ ఎన్నికలను టర్న్ తిప్పనుంది.
ఇక, పూరి జగన్నాధుడి రత్న భండాగారం.. తాళాలు కనిపించకపోవడాన్ని కూడా.. బీజేపీ పెద్ద ఎత్తున టార్గెట్ చేసింది. తాము అధికారంలోకి రాగానే నవీన్ బాబు అనారోగ్యం వెనుక ఉన్న రీజన్ సహా తాళాలు వెతికి తెస్తామని మోడీ ఇక్కడి ప్రజలకు హామీ ఇచ్చారు. ఇంతకుమించి.. వెనుక బడిన రాష్ట్రంగా ఉన్న ఒడిశాను ఆదుకునేందుకు ఆయన చేసిన ప్రయత్నం లేదు. దీంతో ఒడిశాలో ఏం జరుగుతుందోననే టెన్షన్ మరింత పెరిగింది.