Begin typing your search above and press return to search.

పొదుపుకు కుటుంబాలు దూరం...దేశానికి అప్పుల భారం

పొదుపు భారత్ సంస్కృతిలో భాగంగా ఉంటూ వస్తోంది. ఈ రోజుతో కాదు రేపటి కూడా అన్న ఆర్థిక నీతి సగటు భారతీయుడిలో నరనరాల జీర్ణించుకుని పోయిన విషయం.

By:  Tupaki Desk   |   22 Sep 2023 1:30 AM GMT
పొదుపుకు కుటుంబాలు దూరం...దేశానికి అప్పుల భారం
X

పొదుపు భారత్ సంస్కృతిలో భాగంగా ఉంటూ వస్తోంది. ఈ రోజుతో కాదు రేపటి కూడా అన్న ఆర్థిక నీతి సగటు భారతీయుడిలో నరనరాల జీర్ణించుకుని పోయిన విషయం. అందుకే 2008 ప్రాంతంలో వచ్చిన ఆర్ధిక సంక్షోభం ప్రపంచాన్ని గడగడ వణికించినా భారత్ మాత్రం నిబ్బరంగా లేచి నిలబడింది.

సామాన్యుడి పోపుల డబ్బాలో భారత దేశం ఆర్ధిక వ్యవస్థ సురక్షితంగా ఉందని అప్పట్లో ఆర్ధిక నిపుణులు వ్యాఖ్యలు కూడా చేశారు. ఇదంతా దాదాపుగా చూస్తే దశాబ్దన్నర కాలం క్రితం మాట. మరి ఇంతలోనే ఇంత మార్పా అని అదే ఆర్థిక వేత్తలు ఆశ్చర్యపోయే పరిస్థితి ఉంది.

వర్తమానంలో చూసుకుంటే భారతీయ కుటుంబాలు పొదుపునకు దూరంగా ఉన్నాయని ఒక కఠిన వాస్తవం వెలుగులోకి వచ్చింది. దీన్ని బయటపెట్టింది భార్తీయ స్టేట్ బ్యాంక్ నివేదిక. ఈ నివేదిక ప్రకారం చూసుకుంటే 2022-2023 ఆర్థిక సంవత్సరంలో భారత దేశంలోని కుటుంబాలలో 55 శాతం మేర సేవింగ్స్ దారుణంగా తగ్గిపోయాయని ఎస్బీఐ నివేదిక వెల్లడించింది.

ఇంత పెద్ద ఎత్తున సేవింగ్స్ పడిపోవడం అంటే భారత ఆర్ధిక వ్యవస్థకు దెబ్బ అని అంటున్నారు. అదే సమయంలో అప్పులు 15.6 లక్షల్ కోట్లకు పెరిగిందట. ఇక ఈ రెండేళ్లలోనే అప్పులు 8.2 లక్షల కోట్లు ఒక్కసారిగా పెరిగాయని ఎస్బీఐ నివేదిక తేటతెల్లం చేస్తోంది. ఇందులో 7.1 లక్షల కోట్ల రూపాయలు బ్యాంక్ రుణాలే ఉన్నాయని అంటున్నరు.

ఇలా పెరిగిన అప్పులతో దేశ ఆర్ధిక వ్యవస్థ మీద తీవ్ర ప్రభావం ఉంటుందని ఆర్ధిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది దేశానికి మంచిది కాదని అంటున్నారు. అయితే దేశానికి ఆర్ధిక మంత్రిగా ఉన్న నిర్మలా సీతారామన్ అయితే దీన్ని కొట్టి పారేస్తున్నారు.

దేశంలో అసలు ఆర్ధిక సంక్షోభం అన్నది లేనే లేదని అంటున్నారు. ప్రజలు బ్యాంకులలో పొదుపు చేయడం లేదు అంటే వారు ఇతర పెట్టుబడులలో ఆ సొమ్ముని పెడుతున్నారని అలా వేరే రూపంలో ఆస్తులు పెరిగి దేశ ఆర్ధిక వ్యవస్థ భద్రంగా ఉందని ఆమె చెబుతున్నారు. ఏది ఏమైనా పొదుపు అన్నది భారతీయ రక్తంలో ఉంది. విచ్చలవిడితనం పాశ్చాత్య కల్చర్.

మరి క్షణభంగురం జీవితం ఈ రోజుతోనే అన్నీ అంతా అంటూ ఒక రకమైన విచిత్రమైన పోకడలతో పోయే పాశ్చాత్య కల్చర్ దేశంలో కూడా మెల్లగా పాకుతోంది అన్న ప్రచారం ఉంది. అదే కనుక నిజం అయితే మాత్రం పొదుపుకు ఒక సెలవు చీటి ఇచ్చేస్తే మాత్రం భారతీయ కుటుంబాల్లో పోపుల పెట్టెలు ఖాళీ అవుతాయి. అపుడు దేశం కూడా ఆర్ధిక సవాళ్ళను ఎన్నో ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాల్సిందే అన్నది తల పండిన ఆర్థిక నిపుణుల హెచ్చరిక.