Begin typing your search above and press return to search.

బాండ్ పేపర్ పై అగ్రిమెంట్... ఈ కపుల్ వాలంటైన్స్ డే నిర్ణయం వైరల్!

వాలంటైన్స్ డే సందర్భంగా జంటలు.. ఒకరిఒకరు బహుమతులు ఇచ్చి పుచ్చుకోవడం అత్యంత సహజమైన విషయమనే సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   15 Feb 2025 11:27 AM GMT
బాండ్ పేపర్ పై అగ్రిమెంట్... ఈ కపుల్ వాలంటైన్స్ డే నిర్ణయం వైరల్!
X

వాలంటైన్స్ డే సందర్భంగా జంటలు.. ఒకరిఒకరు బహుమతులు ఇచ్చి పుచ్చుకోవడం అత్యంత సహజమైన విషయమనే సంగతి తెలిసిందే. కాకపోతే ఎప్పుడూ ఇన్ కమింగ్ ఒకవైపునుంచే ఉంటుందనే ఫిర్యాదులు చాలా మంది నుంచి వినిపిస్తుంటాయని అంటారు. ఆ సంగతి అలా ఉంటే.. తాజాగా ఓ జంట ప్రేమికుల దినోత్సవం రోజున రొటీన్ కి భిన్నంగా బాండ్ పేపర్ పై ఓ అగ్రిమెంట్ చేసుకున్నారు.

అవును... పశ్చిమ బెంగాల్ కు చెందిన శుభమ్ - అనయ దంపతులు పెళ్లైన రెండేళ్ల తర్వాత ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఓ ఒప్పందం రాసుకున్నారు. సామరస్యాన్ని కొనసాగించడానికో, వారి సంబంధాన్ని మరింత మెరుగుపరుచుకోవడానికో గానీ.. రూ.500 విలువైన నాన్ జ్యుడీషియల్ స్టాంప్ పేపర్ పై అగ్రిమెంట్ రాసుకుని ఇరువురు సంతకాలు చేసుకున్నారు.

ఇందులో భాగంగా... శుభమ్.. అనన్యను ‘మై క్యూటీ కాయిన్’, ‘మై క్రిప్టోపీ’ వంటి అర్థిక సంబంధిత ముద్దు పేర్లతో పిలవడం మానేయాలని ఒక కండిషన్ లో పేర్కొన్నారు. ఇదే సమయంలో.. శుభమ్ రాత్రి 9 గంటల తర్వాత ట్రేడింగ్ యాప్ లను ఉపయోగించడం, కాయిన్ సెర్చ్ కోసం యూట్యూబ్ వీడియోలు చూడటం మానేయాలనేది అనన్య కండిషన్స్ గా ఉన్నాయి.

ఇదే సమయంలో... శుభమ్ చేసిన అల్లరి గురించి అమ్మకు ఫిర్యాదు చేయకపోవడం.. మాట మాట పెరిగిన సమయంలో తన మాజీ గురించి ప్రస్థావించకుండా ఉండటంతో పాటు స్విగ్గీ / జొమాటా నుంచి అర్ధరాత్రి ఫుడ్ ఆర్డర్ చేయడం, ఖరీదైన బ్యూటీ ప్రాడక్ట్స్ ని ఆర్డర్ చేయకుండా ఉండటం వంటివి పరిమితం చేసుకోవాలనేది ఆమెకు ఉన్న కండిషన్స్ గా ఉన్నాయి.

ఈ నేపథ్యంలో ఎవరైనా ఈ అగ్రిమెంట్ పాటించకపోతే.. అది రద్దు చేయబడుతుంది. ఇదే సమయంలో.. నియమాలు అతిక్రమించిన వారు భాగస్వామి బట్టలు ఉతకడం, బాత్రూమ్ శుభ్రం చేయడం, కిరాణా సామానులు తీసుకురావడం వంటివాటితో పాటు మూడు నెలల పాటు ఇంటి పనులలో సహాయం చేయాల్సి ఉంటుందని ఈ ఒప్పందం పేర్కొంది.

ఈ సమయంలో.. ఈ ఒప్పందానికి సంబంధించిన బాండ్ పేపర్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై నెటిజన్లు ఫన్నీ రియాక్షన్లు ఇస్తున్నారు. ఇందులో భాగంగా... ఇది చాలా అద్భుతంగా ఉందని ఒకరంటే.. వివాహ బంధం ఇంత కఠినమైనదా అని ఇంకొకరు స్పందించారు.