Begin typing your search above and press return to search.

ఆన్‌ లైన్‌ లో ఆర్డర్ పెట్టారు... ఓపెన్ చేస్తే ఓ.ఎం.జీ!

ఇది బాధ్యతా రాహిత్యమా.. లేక, ప్లాన్డా అనే చర్చ తెరపైకి వచ్చింది!

By:  Tupaki Desk   |   19 Jun 2024 11:31 AM GMT
ఆన్‌  లైన్‌  లో ఆర్డర్  పెట్టారు... ఓపెన్  చేస్తే ఓ.ఎం.జీ!
X

నరుడు ఒకటి తలిస్తే దైవం ఒకటి తలచిందన్నట్లుగా... ఇటీవల కాలంలో ఆన్ లైన్ లో ఒకటి ఆర్డర్ పెడితే మరొకటి డెలివరీ అవుతున్న సంఘటనలు ఎన్నో తెరపైకి వస్తున్నాయి. అయితే తాజాగా బెంగళూరులో తెరపైకి వచ్చిన ఒక ఘటన మాత్రం పీక్స్ అనే కామెంట్లకు కారణమవుతుంది. ఇది బాధ్యతా రాహిత్యమా.. లేక, ప్లాన్డా అనే చర్చ తెరపైకి వచ్చింది!

అప్పుడప్పుడూ ఆన్ లైన్ లో ఫుడ్ డెలివరీ చేసినప్పుడు వెజ్ బిర్యానీ ఆర్డర్ చేస్తే చికెన్ బిర్యానీ వస్తుంటుంది.. ఇలాంటి విషయాలు అప్పుడప్పుడూ వైరల్ అవుతుంటాయి! ఫోన్ బదులు సబ్బు బిల్ల, ఇటుకలు పంపిన దాఖలాలు కూడా తెరపైకి వచ్చాయి. అయితే తాజాగా ఏకంగా బ్రతికున్న పాను డెలివరీ అవ్వడం వైరల్ గా మారింది.

అవును... తాజాగా బెంగళూరులోని సర్జాపూర్‌ కు చెందిన దంపతులు ఐటీ జాబ్స్ చేస్తున్నారు. ఖాళీగా ఉన్నప్పుడు ఇంట్లో టైమ్ పాస్ కోసం వీడియో గేమ్‌ ఆడుకునే ఎక్స్‌ బాక్స్‌ ను అమెజాన్‌ కంపెనీ యాప్‌ లో ఆర్డర్‌ చేశారు. అనూహ్యంగా చెప్పిన టైంకే పార్శిల్ వచ్చింది! అయితే... పార్శిల్ ఓపెన్ చేసేందుకు ప్రయత్నించాక మాత్రం వారిని భయబ్రాంతులకు గురి చేస్తూ పార్శిల్‌ లో నుంచి బుస్ బుస్ సౌండ్ వినిపించాయి.

కట్ చేస్తే... ఆ పార్శిల్ లో ఓ పాము బుసలు కొడుతూ బయటకు వచ్చింది. అయితే... అదృష్టవశాత్తూ ప్యాకేజ్ టేప్‌ కు అది అంటుకుపోవడంతో.. ఆ పాము పూర్తిగా బయటకు రాలేదు. దీంతో పెను ప్రమాదమే తప్పింది. దీంతో... తమకు ఎదురైన భయానక అనుభవాన్ని ఆ దంపతులు వీడియో తీసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. దీంతో ఆ వీడియో నెట్టింట వైరల్‌ గా మారింది.

అయితే ఈ విషయంపై ఆన్ లైన్ వేదికగా స్పందించిన అమెజాన్ ఇండియా కంపెనీ ఓ ట్వీట్ చేసింది. ఇందులో భాగంగా... అమెజాన్ ఆర్డర్‌ తో మీకు కలిగిన అసౌకర్యానికి క్షమించాలని కోరింది. దీనిపై త్వరలోనే పూర్తి స్థాయి వివరణ ఇస్తామని వెల్లడించింది. వారు చెల్లించిన మొత్తాన్ని రిటన్ చేసింది.