నోరు జారిన కేసులో నటికి బిగ్ రిలీఫ్!
తమిళనాడులోని తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్టై, రిమాండ్ లో ఉన్న నటి కస్తూరి కి ఊరట లభించింది.
By: Tupaki Desk | 21 Nov 2024 6:20 AM GMTఈ నెల 4న తమిళ బ్రహ్మణ సమ్మేళనం నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నటి కస్తూరి.. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. సుమారు 300 ఏళ్ల కిందట రాజుల కాలంలో అంతఃపురంలో మహిళలకు సేవ చేయడానికి వచ్చిన వారే తెలుగు వాళ్లు అంటూ మాట్లాడిన సంగతి తెలిసిందే!
దీంతో.. ఈ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగడం.. ఆమెపై అఖిల భారత తెలుగు సమ్మేళనం తరుపున ఎగ్మూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదవ్వడం తెలిసిందే. దీంతో ఆమె పరారీలో ఉన్నారంటూ కథనాలొచ్చాయి. ఈ సమయంలో ఆమె హైదరాబాద్ లో ప్రత్యక్షమవ్వడంతో చెన్నైకు తీసుకెళ్లిన పోలీసులు కోర్టులో హాజరుపరిచారు.
దీంతో ఆమెకు న్యాయస్థానం 14 రోజుల కస్టడీ విధించింది. దీంతో.. ఆమె ప్రస్తుతంపుళల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ కస్టడీ నవంబర్ 29 వరకూ కొనసాగనుంది. అయితే ఈలోపు ఆమెకు బిగ్ రిలీఫ్ దొరికింది. దీంతో.. ఆమె విడుదల కానున్నారు.
అవును... తమిళనాడులోని తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్టై, రిమాండ్ లో ఉన్న నటి కస్తూరి కి ఊరట లభించింది. ప్రస్తుతం పుళల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆమెకు ఎగ్మూర్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆమె ముందస్తు బెయిల్ ను మద్రాసు హైకోర్టు తిరస్కరించడంతో ఆమెను శనివారం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఎగ్మూర్ కోర్టులో కస్తూరి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై న్యాయమూర్తి దయాళన్ విచారణ చేపట్టారు. తాను సింగిల్ మదర్ అని.. తనకు స్పెషల్లీ ఏబుల్డ్ చైల్డ్ ఉందని.. ఆమెను తానే చుసుకోవాల్సి ఉందని కోర్టుకు విన్నవించారు కస్తూరి. దీంతో... ఆమెకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు.