Begin typing your search above and press return to search.

కొండ సురేఖకు కోర్టు షాక్.. కీలక ఆదేశాలు

దాదాపు 20 నిమిషాల పాటు కేటీఆర్ నాంపల్లి కోర్టులో స్టేట్‌మెంట్ ఇచ్చారు.

By:  Tupaki Desk   |   25 Oct 2024 6:53 AM GMT
కొండ సురేఖకు కోర్టు షాక్.. కీలక ఆదేశాలు
X

కొద్ది రోజుల క్రితం మాజీమంత్రి కేటీఆర్ మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు, తన ఫ్యామిలీ పరువు, ప్రతిష్టలకు భంగం కలిగింది అంటూ కేటీఆర్ నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. సురేఖపై పరువునష్టం దావా వేశారు. రూ.100 కోట్లకు ఆయన పురువు నష్టం దావా వేశారు. అయితే.. ఇటీవలే కేటీఆర్ స్టేట్‌మెంట్‌ను కోర్టు రికార్డు చేసింది. దాదాపు 20 నిమిషాల పాటు కేటీఆర్ నాంపల్లి కోర్టులో స్టేట్‌మెంట్ ఇచ్చారు. కేటీఆర్‌తోపాటు బీఆర్ఎస్ నేతలు జగదీష్ రెడ్డి, సత్యవతి రాథోడ్, బాల్క సుమన్, దాసోజు శ్రవణ్ కోర్టుకు వచ్చి తమ వాంగ్మూలం ఇచ్చారు.

తాను సుదీర్ఘకాలం పాటు ప్రజా క్షేత్రంలో ఉన్నానని, మంత్రిగా, ఎమ్మెల్యేగా ఉన్నానని.. బాధ్యత హోదాలో మంత్రి తనపై నిరాధార ఆరోపణలు చేశారని కేటీఆర్ పేర్కొన్నారు. ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరారు. డ్రగ్స్‌కు అడిక్ట్ అయ్యానని, పైగా రేవ్ పార్టీలు నిర్వహిస్తానని తీవ్ర ఆరోపణలు చేశారని కేటీఆర్ కోర్టుల దృష్టికి తీసుకెళ్లారు. సాటి మహిళ అని కూడా చూడకుండా ఓ నటిపై కూడా అసభ్యకర కామెంట్లు చేశారని వివరించారు. రాజకీయంగా ఎదుర్కోకుండా తనపై వ్యక్తిగతంగా ఆరోపణలు చేశారని వెల్లడించారు.

దీనిపై విచారణ చేపట్టిన నాంపల్లి హైకోర్టు ఈ రోజు మంత్రి కొండా సురేఖకు మొట్టికాయలు వేసింది. మంత్రి చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయని మండిపడింది. బాధ్యతల గల మంత్రి పదవిలో ఉండి ఇలాంటి కామెంట్స్ చేయడం ఆశ్చర్యం కలిగించిందని పేర్కొంది. భవిష్యత్తులో ఇలాంటి అడ్డగోలు వ్యాఖ్యలు చేయవద్దని హెచ్చరించింది. అత్యంత జుగుప్సాకరంగా ఉన్న వ్యాఖ్యలను వెంటనే మీడియా, సోషల్ మీడియా, వెబ్‌సైట్లు, అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల నుంచి తొలగించాలని ఆదేశించింది. యూట్యూబ్, ఫేస్‌బుక్, గూగుల్ సంస్థలు కూడా ఈ వ్యాఖ్యలను తొలగించాలని సూచించింది. అలాగే.. కొండా సురేఖ వ్యా్ఖ్యలను ప్రసారం చేసిన చానల్స్, ప్రచురించిన మీడియా సంస్థలకు కూడా ఆదేశాలిచ్చింది. సురేఖ వ్యాఖ్యలు సమాజంలో చెడు ప్రభావాన్ని చూపే ప్రమాదం ఉందని కోర్టు అభిప్రాయపడింది.

మరోవైపు.. పరువు నష్టం కేసుకు సంబంధించి కేసులో కోర్టు ఈ స్థాయిలో ఓ మంత్రిపై మండిపడడం ఇదే తొలిసారి. గతంలోనే సురేఖ కేటీఆర్‌పై ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. ఆ సందర్భంగా ఎన్నికల సంఘం ఆమె వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించింది. అయినప్పటికీ ఆమెలో మార్పు రావడం లేదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా కొండా సురేఖ తన నోటిని అదుపులో పెట్టుకుంటారా..? లేదా అన్నది చర్చ నడుస్తోంది. అయితే.. తాజాగా కేటీఆర్‌కు అనుకూలంగా కోర్టు తీర్పు రావడంతో బీఆర్ఎస్‌లో సంతోషం కనిపించింది. ముఖ్యంగా కేటీఆర్‌కు ఈ తీర్పు మరింత బలాన్ని చేకూర్చినట్లయింది. మరికొద్ది రోజుల్లో బండి సంజయ్ పైనా ఆయన లీగల్ వెళ్లే అవకాశం ఉండడంతో ఆ కేసుపై ఇప్పుడు అంతటా చర్చ కొనసాగుతున్నది.