Begin typing your search above and press return to search.

అటు నాగార్జున, ఇటు కేటీఆర్... కొండా సురేఖకు కోర్టు నోటీసులు!

ఈ వ్యవహారంపై అటు సినిమా ఇండస్ట్రీ నుంచి, ఇటు పలువురు రాజకీయ ప్రముఖుల నుంచి కొండా సురేఖపై విమర్శల వర్షం కురిసింది.

By:  Tupaki Desk   |   10 Oct 2024 9:48 AM GMT
అటు నాగార్జున, ఇటు కేటీఆర్... కొండా సురేఖకు కోర్టు నోటీసులు!
X

అక్కినేని నాగచైతన్య, సమంత విడిపోవడానికి మాజీ మంత్రి కేటీఆర్ కారణమంటూ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఎంతటి దుమారం రేపాయనేది తెలిసిన విషయమే. ఈ వ్యవహారంపై అటు సినిమా ఇండస్ట్రీ నుంచి, ఇటు పలువురు రాజకీయ ప్రముఖుల నుంచి కొండా సురేఖపై విమర్శల వర్షం కురిసింది. ఈ సమయంలో.. వ్యవహారం నాంపల్లి స్పెషల్ మెజిస్ట్రేట్ ముందుకు చేరింది.

అవును... నాగచైతన్య-సమంత విడాకుల వ్యవహారంపై మంత్రి కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై సినీ నటుడు నాగార్జున నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో గురువారం ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. మంత్రి కొండా సురేఖకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈనెల 23కు వాయిదా వేసింది.

మరోవైపు నాంపల్లి ప్రత్యేక కోర్టులో మంత్రి కొండా సురేఖపై బీఆరెస్స్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరువు నష్టం పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ తరుపు న్యాయవాది మంత్రి కొండా సురేఖపై పిటిషన్ దాఖలు చేశారు. తన ప్రతిష్టను దెబ్బతీసేలా కొండా సురేఖ వ్యాఖ్యానించారని తన పిటిషన్ లో కేటీఆర్ పేర్కొన్నారు.

కాగా... రాష్ట్రమంత్రి కొండా సురేఖ తనపట్ల చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ తీవ్రంగా ఖండించిన సంగతి తెలిసిందే. తనకు ఏమాత్రం సంబంధం లేని ఫోన్ ట్యాపింగ్ పైనా ఆమె అసత్యాలు మాట్లాడారని ఆయన మండిపడ్డారు. ఇదే క్రమంలో నాగచైతన్య-సమంత విడిపోవడానికి కూడా తానే కారణమంటూ చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ సీరియస్ గా తీసుకున్నారు.

ఈ నేపథ్యంలోనే ఉద్దేశ్యపూర్వకంగా తనపై బురద జల్లారని.. తన ఇమేజ్ కు భంగం కలిగించాలనే లక్ష్యంతోనే తనపై అలాంటి వ్యాఖ్యలు చేశారని కేటీఆర్ లీగల్ నోటీసుల్లో పేర్కొన్నారు. ఓ మహిళ అయ్యి ఉండి సాటి మహిళ పేరును వాడుకొని వ్యక్తిత్వ హననానికి పాల్పడటం దురదృష్టకరమని అన్నారు.

మరోపక్క కేటీఆర్ పై చేస్తున్న రాజకీయ విమర్శల్లో భాగంగా నాగార్జున, నాగచైతన్య, సమంతల పేర్లను ప్రస్థావించారు మంత్రి సురేఖ. దీంతో... నాంపల్లి కోర్టులో నాగార్జున క్రిమినల్ పరువు నష్టం దావా వేశారు. తమ కుటుంబ గౌరవాన్ని, ప్రతిష్టను దెబ్బతీసేలా ఆమె నిరాధార వ్యాఖ్యలు చేశారని, ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పిటిషన్ లో కోరారు!