Begin typing your search above and press return to search.

ఒక హత్య.. ఒక హత్యాయత్నం.. కెనడా-ఇండియా-అమెరికా రగడ

పైగా ఖలిస్థానీ హర్దీప్ సింగ్ నిజ్జర్‌ హత్య కేసులో దర్యాప్తునకు భారత్‌ సహకరించాలని కోరింది.

By:  Tupaki Desk   |   16 Oct 2024 10:19 AM GMT
ఒక హత్య.. ఒక హత్యాయత్నం.. కెనడా-ఇండియా-అమెరికా రగడ
X

ఖలిస్థానీ సానుభూతిపరుల హత్యలు, వారిపై దాడులు.. కెనడా-భారత్ మధ్య చరిత్రలో ఎన్నడూ లేనంత రగడకు కారణమైన సంగతి తెలిసిందే. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచంలో ఏ దేశమూ చేయని సాహసానికి కెనడా ఒడిగట్టింది. అయితే, ఈ విషయంలో కెనడాకు పూర్తిగా అండగా నిలుస్తోంది దాని పొరుగు దేశం అమెరికా. కెనడా ప్రధాని ట్రూడో భారత్ పై చేసిన ఆరోపణలను అత్యంత తీవ్రమైనవిగా పేర్కొంది. పైగా ఖలిస్థానీ హర్దీప్ సింగ్ నిజ్జర్‌ హత్య కేసులో దర్యాప్తునకు భారత్‌ సహకరించాలని కోరింది.

కెనడా మాటే అమెరికా బాట

తమ పొరుగునే ఉండే అత్యంత ఆప్త మిత్ర దేశమైన కెనడా మాటను అమెరికా ఎలా ఖండిస్తుంది..? అందుకే ఇండియాను ఆడిపోసుకుంటోంది. తాజా పరిణామాలపై అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్‌ మాటలు దీనినే స్పష్టం చేస్తున్నాయి. వివిధ వ్యవహారాలపై రోజువారీ బ్రీఫింగ్ సందర్భంగా. కెనడా ఆరోపణలను ఆయన పూర్తిగా సమర్థించారు. వాటిని అత్యంత తీవ్రమైనవిగా అభివర్ణించారు. కాబట్టి భారత్‌ వాటిని తీవ్రంగా పరిగణించి కెనడాతో దర్యాప్తునకు సహకరించాలని కూడా ఉచిత సలహా ఇచ్చారు. ఇదే సమయంలో భారత్ ను తప్పుబట్టారు. కెనడా-భారత్ బయటకు చెప్పినదానికి అదనంగా మరేమీ వ్యాఖ్యానించంటూనే తమ వైఖరి ఏమిటో బయటపెట్టారు. భారత్ తమకు శక్తిమంతమైన భాగస్వామి అని.. ఇరు దేశాల మధ్య దౌత్య బంధం చాలా బలంగా ఉందని వ్యాఖ్యానించారు.

అటు నిజ్జర్.. ఇటు పన్నూ..

నిరుడు జరిగిన హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసు కెనడా గట్టిగా పట్టుకుంటే.. తనను హత్య చేసేందుకు కుట్ర పన్నారంటూ మరో వేర్పాటువాది గుర్‌ పత్వంత్‌ సింగ్‌ పన్నూ వేసిన కేసు తెరపైకి వచ్చింది. ఈ మేరకు అతడు వేసిన దావాపై అమెరికా కోర్టు భారత్‌ కు సమన్లు పంపింది. దీంతో భారత అధికారులు అమెరికా విదేశాంగ, న్యాయ శాఖ అధికారులతో సమావేశం అయ్యారు. పన్నూ హత్యకు కుట్ర పన్నారంటూ చేసిన ఆరోపణలను తీవ్రంగా పరిగణిస్తామని తేల్చిచెప్పారు. అమెరికా విదేశాంగ మంత్రి మాథ్యూ మిల్లర్‌ ఇదే విషయాన్ని మీడియాకు తెలిపారు.

ఎవరీ పన్నూ..?

గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూ ఖలిస్థానీ మద్దతుదారు. గత నవంబరులో న్యూయార్క్‌ లో అతడిపై జరిగిన హత్యా ప్రయత్నాలను భగ్నం చేసినట్లు అమెరికా తెలిపింది. దీనిపైనే అమెరికా కోర్టు భారత ప్రభుత్వానికి సమన్లు జారీ చేసింది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్‌, రా మాజీ చీఫ్‌ సమంత్‌ గోయల్‌, రా ఏజెంట్‌ విక్రమ్‌యాదవ్‌, భారతీయ వ్యాపారవేత్త నిఖిల్‌ గుప్తా పేర్లు ఈ సమన్లలో ఉన్నాయి. భారత ప్రభుత్వ ఉద్యోగితో కలిసి పన్నూను హత్య చేసేందుకు భారతీయుడు నిఖిల్‌ సుపారీ ఇచ్చారని అమెరికా న్యాయవాదులు అభియోగాలు మోపారు. కాగా, గుప్తాను చెక్ రిపబ్లిక్ పోలీసులు అరెస్టు చేశారు. అమెరికా సూచనల మేరకే ఇలా చేసినట్లు వారు వెల్లడించారు. పన్నూ హత్యకు కుట్రపై అమెరికా ఆరోపణలను భారత్‌ ఖండించింది. దీనిపై దర్యాప్తు బృందాన్ని సైతం ఏర్పాటుచేసింది.