మరో బీఆర్ఎస్ నేతకు షాక్.. కేసు పెట్టమన్న కోర్టు
ఎన్నికల అఫిడవిట్ ట్యాంపరింగ్ వివాదం లో శ్రీనివాస్‌గౌడ్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టు పోలీసుల ను ఆదేశించింది.
By: Tupaki Desk | 1 Aug 2023 10:05 AM GMTఎన్నికల ఏడాది లో వివిధ వర్గాలకు చెందిన ప్రజల కు హామీలు, ఉద్యోగుల కు వరాలు ఇస్తూ విజయం కోసం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కసరత్తులు చేస్తున్నారు. మరోవైపు ఆ పార్టీలోని ప్రజాప్రతినిధుల పై అనర్హత కేసులు మాత్రం ఆందోళన కు గురి చేస్తున్నాయని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.
ఇప్పటికే కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదని హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై కేసు పెట్టాల ని పోలీసుల ను కోర్టు ఆదేశించడం సంచలనంగా మారింది.
2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో వనమా వెంకటేశ్వరరావు తప్పుడు వివరాలతో అఫిడవిట్ దాఖలు చేశాడని, ఆయన ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ జలగం వెంగల్రావు వేసిన పిటిషన్ పై ఇటీవల హైకోర్టు తీర్పు వెల్లడించింది. వనమాను అనర్హుడిగా పేర్కొంటూ రెండో స్థానం లో నిలిచిన వెంగల్రావే అప్పటి నుంచి ఎమ్మెల్యే అని చెప్పింది. ఇప్పుడు మంత్రి శ్రీనివాస్ గౌడ్ విషయంలోనూ ఎన్నికల అఫిడవిట్ ను ట్యాంపరింగ్ చేశారనే ఆరోపణ పై ప్రజాప్రతినిధుల కోర్టు తీర్పు వెల్లడించింది.
ఎన్నికల అఫిడవిట్ ట్యాంపరింగ్ వివాదం లో శ్రీనివాస్‌గౌడ్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టు పోలీసుల ను ఆదేశించింది. ఓ ప్రైవేటు పిటిషన్ ను విచారించి ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు 2018 ఎన్నికల్లో సమర్పించిన అఫిడవిట్ ను వెనక్కి తీసుకుని సవరించి మళ్లీ ఇచ్చారని, ఇది విరుద్ధమంటూ మంత్రి పై దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు విచారిస్తోంది.
ఈ పిటిషన్ను కొట్టేయాల ని మంత్రి దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే. మరి ఈ కేసు లో విచారణ ముగిసి తప్పు చేశారని తేలితే శ్రీనివాస్‌గౌడ్ పైనా వేటు పడే అవకాశముంది.