భారీ స్థాయిలో లంచాలు తీసుకున్నందుకు మరణశిక్ష విధించిన కోర్టు!
లంచం తీసుకోవడంలో ఒక బ్యాంకర్ పీక్స్ కి చేరిపోయాడు! ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడని చెప్పినా అతిశయోక్తి కాదేమో.
By: Tupaki Desk | 29 May 2024 9:26 AM GMTలంచం తీసుకోవడంలో ఒక బ్యాంకర్ పీక్స్ కి చేరిపోయాడు! ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడని చెప్పినా అతిశయోక్తి కాదేమో. విషయం తెలుసుకున్న ఎవరైనా షాకయ్యే స్థాయిలో సదరు బ్యాంకర్ లంచాలు తీసుకోగా... ఈ వ్యవహారంపై కోర్టు కూడా షాకింగ్ శిక్ష విధించింది. ఇప్పుడు ఈ విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
అవును... 1.1 బిలియన్ యువాన్ల (రూ.12,64,12,73,722) కంటే ఎక్కువ విలువైన లంచాలు తీసుకున్నారు చైనా హువారోంగ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ మాజీ జనరల్ మేనేజర్ బాయి తియాన్హై! దీంతో వ్యవహారం కోర్టుకి వెళ్లడంతో... తూర్పు చైనాలోని కోర్టు ఇతనికి మరణశిక్ష విధించింది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ఈ విషయాన్ని నివేదించింది.
మాజీ బ్యాంకర్ తీసుకున్న లంచాలు సమాజంపై అతని నేరాల ప్రభావం తీవ్రమైన నష్టాలను కలిగిస్తుందని కోర్టు పేర్కొంది. ఇతను చేసిన అవినీతి పనులన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే.. ఇతడు తేలికైన శిక్షకు అర్హుడు కాదని కోర్టు అభిప్రాయపడింది. అనంతరం... మరణశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. అతడి ఆస్తులన్నింటినీ జప్తు చేయాలని కోర్టు ఆదేశించింది.
అయితే ఈ భారీ శిక్షపై తియాన్హై పై కోర్టులో అప్పీలు చేస్తారో లేదో ఇంకా తెలియరాలేదు. ఈ విషయంపై బీజింగ్ కు చెందిన ఒక క్రిమినల్ లాయర్ మాట్లాడుతూ... ఇలాంటి నేరాలకు నిందితులకు తక్కువ శిక్షలు విధించిన కేసులను ఉటంకిస్తూ, బాయి అప్పీల్ చేస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు.
కాగా... తియాన్హై కంటే ముందు అతని మాజీ బాస్ కూడా అవినీతి విషయంలోనే మరణశిక్షను ఎదుర్కొన్నాడు. జనవరి 2021లో అదే న్యాయస్థానం 1.79 బిలియన్ యువాన్లు (247 మిలియన్ డాలర్లు) లంచాలు తీసుకోవడం తో పాటు 25.13 మిలియన్ యువాన్లు (3.46 మిలియన్ డాలర్లు) కంటే ఎక్కువ విలువైన పబ్లిక్ ఆస్తులను అపహరించడంలో దోషిగా నిర్ధారించిన తర్వాత లై షియోమిన్ కు శిక్ష విధించింది.