కోర్టుకు రండి.. కేసీఆర్, హరీష్‌రావులకు నోటీసులు.. ఏం జరిగింది?
వీరంతా వచ్చే నెల 5వ తేదీన కోర్టుకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అధికారుల్లో స్మిత సబర్వాల్, రజత్ కుమార్ ఉన్నారు.
By: Tupaki Desk | 6 Aug 2024 4:08 AM GMTబీఆర్ ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్‌రావులు చిక్కుల్లో పడ్డారు. కోర్టుకు వచ్చి వివరణ ఇవ్వాలని సూచిస్తూ.. భూపాలపల్లి ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు తాజాగా నోటీసులు జారీ చేసింది. కేసీఆర్ తో పాటు మరి కొందరు అధికారులకు కూడా ఈ నోటీసులు జారీ చేసింది. వీరంతా వచ్చే నెల 5వ తేదీన కోర్టుకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అధికారుల్లో స్మిత సబర్వాల్, రజత్ కుమార్ ఉన్నారు.
ఏంటి విషయం?
గత ఏడాది అక్టోబరులో మేడిగడ్డ రిజర్వాయర్ కుంగిన విషయం తెలిసిందే. ఇది అప్పట్లో రాజకీయంగా కూడా పెను దుమారం రేపింది. తర్వాత జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. ఇక, కాంగ్రెస్ హయాం వచ్చిన తర్వాత కూడా.. ఈ వ్యవహారం ముదిరింది. ఈ క్రమంలో రాజలింగమూర్తి అనే సామాజిక కార్యకర్త.. మేడిగడ్డ కుంగిన నేపథ్యంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ సహా.. మంత్రులపై చర్యలు తీసుకోవాలని.. అదేవిధంగా అధికారులపైనా చర్యలు తీసుకోవాలని కోరుతు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అయితే.. ఆయన ఫిర్యాదును పోలీసులు తీసుకోలేదు. దీంతో ఫస్ట్ క్లాస్ ప్రిన్సిపల్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ వేశారు. అక్కడ కూడా ఆయనకు ఊరట లభించలేదు. దీంతో నేరుగా హైకోర్టు తలుపు తట్టారు. దీనిని పరిశీలించిన హైకోర్టు.. జిల్లా కోర్టులో రివిజన్ పిటిషన్ దాఖలు చేయాలని సూచించింది. దీంతో రాజలింగమూర్తి తాజాగా రివిజన్ పిటిషన్ వేశారు.
ఈ నేపథ్యంలో సదరు పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు.. సెప్టెంబరు 5న విచారణ చేపడతామని.. ఆ సమయానికి ప్రతివాదులుగా ఉన్న కేసీఆర్, హరీష్‌రావు, అధికారులు స్మిత సభర్వాల్ తదితరులు కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది. మరి కేసీఆర్, హరీష్‌రావులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు సహా.. విద్యుత్ ప్రాజెక్టుల విషయంలో కేసీఆర్ ఇరుకున పడిన విషయం తెలిసిందే. ఇప్పుడు మేడిగడ్డ విషయం కూడా ఆయనకు చుట్టుకోవడంతో ఎలా స్పందిస్తారో చూడాలి.