స్కిల్ స్కాం కేసులో ఉండవల్లి పిటిషన్... కోర్టు కీలక ఆదేశాలు!
మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ హైకోర్టులో రిట్ పిటీషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసును సీబీఐకి అప్పగించాలని ఈ పిటిషన్ లో ఉండవల్లి కోరారు.
By: Tupaki Desk | 13 Oct 2023 10:11 AM GMTప్రస్తుతం ఏపీలో హాట్ టాపిక్ ఏదైనా ఉందంటే... అది ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్టు, సుమారు 34 రోజులుగా రిమాండు, తదనంతర పరిణామాలే.. అని చెప్పినా అతిశయోక్తి కాదు. ఏసీబీ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టులలో చిన్నా పెద్ద అంతా కలిసి సుమారు 58 మంది లాయర్లు బాబు పిటిషన్లపై వాదనలు వినిపిస్తున్నారని అంటున్నారు! దీన్ని బట్టి ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లోనే కాదు.. కోర్టుల్లో కూడా ఇదే హాట్ టాపిక్ అయ్యి ఉండొచ్చు!
ఈ సమయంలో స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అనేక కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్న తరుణంలో... మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ హైకోర్టులో రిట్ పిటీషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసును సీబీఐకి అప్పగించాలని ఈ పిటిషన్ లో ఉండవల్లి కోరారు. ఈ కేసులో మరింత లోతైన విచారణ అవసరమని కోరారు. ఇందులో... ఈడీ, సీబీఐ, ఏపీ ప్రభుత్వంతోపాటు స్కిల్ స్కాం నిందితులందరినీ తన పిటీషనల్ లో ప్రతివాదులుగా పేర్కొన్నారు ఉండవల్లి!
దీంతో ఈ రోజు ఈ పిటిషన్ పై వాదనలు జరిగాయి. ఇందులో భాగంగా ఈ కేసులో ప్రభుత్వం తరపున ఏజీ శ్రీరాం వాదనలు వినిపించారు. ఇప్పటికే ఈ కేసు విచారణ ప్రత్యేక విచారణ టీంను ఏర్పాటు చేసామని ఆయన కోర్టుకు నివేదించారు. ఇదే సమయంలో... ఈ కేసుకు సంబంధించి సీబీఐకు కూడా ప్రభుత్వం సమాచారం ఇచ్చిందని.. ఈ కేసు సీబీఐ విచారణకు ఇవ్వడానికి తమకు అభ్యంతర లేదని ఏజీ శ్రీరాం కోర్టుకు తెలిపారు.
దీంతో ఈ కేసును నాలుగు వారాలపాటు కోర్టు వాయిదా వేసింది. అనంతరం... ఈ కేసులో 44 మంది ప్రతివాదులకు నోటీసులు జారీ చేయాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో... చంద్రబాబు, అచ్చెన్నాయుడు సహా 44 మందికి ఈ కేసులో నోటీసులు జారీ చేయనున్నారు.
మరోపక్క స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో వాదనలు నడుస్తున్నాయి. ఇందులో భాగంగా ప్రభుత్వం తరుపున వాదనలు వినిపిస్తున్న ముకుల్ రోహద్గీ... ఐదేళ్ల కిందట జరిగిన నేరానికి కూడా.. ఇప్పుడు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయొచ్చని, అందుకు చట్టం అనుమతిస్తుందని తెలిపారు. ఇదే సమయంలో ఎఫ్‌ఐఆర్ ఎప్పుడు నమోదు చేశారనేది ముఖ్యం కాదని స్పష్టం చేశారు! ప్రస్తుతం సుప్రీంలో వాడీవేడీ వాదనలు సాగుతున్నాయి.