ట్రంప్ కు ఆసక్తికరంగా మద్దతు... ఇవాంక ఎమోషనల్ పోస్ట్!
పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్ తో అక్రమ సంబంధం కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దోషిగా తేలారు.
By: Tupaki Desk | 31 May 2024 9:30 AM GMTపోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్ తో అక్రమ సంబంధం కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దోషిగా తేలారు. ఈ మేరకు ఆయనపై నమోదైన అన్ని ఆరోపణలు రుజువైనట్లు న్యూయార్క్ కోర్టు తేల్చింది. దీంతో ఈ వ్యవహారం అగ్రారాజ్యంలోనే కాకుండా అంతర్జాతీయంగానూ తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. ఈ వ్యవహారంపై భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి.
ఈ సమయంలో కొన్ని వర్గాల నుంచి ఈ అమెరికా మాజీ అధ్యక్షుడికి సంపూర్ణ మద్దతు తెరపైకి వస్తుంది. ఇది పూర్తిగా రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగం అని అభివర్ణిస్తూ పోస్టులు పెడుతున్నారు పలువురు నేటిజన్లు, నేతలు. ఇందులో భాగంగా... ఇండో - అమెరికన్ నేత వివేక్ రామస్వామి, ఇండో అమెరికన్ రాజకీయ వేత్త, లుసియానా మాజీ గవర్నర్ బాబీ జిందల్ ల రియాక్షన్ వైరల్ గా మారింది.
అవును... పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్ తో అక్రమ సంబంధం కేసులో ట్రంప్ ను దోషిగా తేల్చుతూ తీర్పు వెలువడిన అంశంపై ఇండో-అమెరికన్ నేత వివేక్ రామస్వామి స్పందించారు. ఇందులో భాగంగా... ట్రంప్ కు మద్దతుగా ఆయన గళం విప్పారు. ట్రంప్ ను దోషిగా పేర్కొంటూ కోర్టు తీసుకొన్న నిర్ణయం కచ్చితంగా బెడిసి కొడుతుందని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఎక్స్ లో తన అభిప్రాయాన్ని తెలిపారు.
ఇందులో భాగంగా... "ప్రాసిక్యూటర్ ఓ రాజకీయ నాయకుడు. ట్రంప్ ను దెబ్బతీస్తానని అతడు వాగ్దానం చేశాడు. ఇక జడ్జి గారి కూమార్తె డెమొక్రటిక్ పార్టీ ఆపరేటివ్. ఆమె తండ్రి అధ్యక్షతన ఆ పార్టీ కోసం గతంలో నిధులను కూడా సేకరించింది. దీనికి తోడు శిక్షవిధించే సమయంలో నిందితుడి నేరాంగీకారంతో పనిలేదని జ్యూరీ పేర్కొంది. ఇవన్నీ కచ్చితంగా బెడిసి కొడతాయి" అని రామస్వామి తన పోస్టులో పేర్కొన్నారు.
ఇదే సమయంలో ఇండో అమెరికన్ రాజకీయ వేత్త, లుసియానా మాజీ గవర్నర్ బాబీ జిందల్ కూడా ఈ వ్యవహారంపై స్పందించారు. ఇందులో భాగంగా తనదైన వెటకారాన్ని చూపించారు. ఈ క్రమంలోనే... "ముందుగానే శిక్షను ప్రకటించేసి.. ఆ తర్వాత విచారణ చేపట్టి, డెమొక్రాట్లు చాలా సమయాన్ని ఆదా చేశారు" అని వెటకారంగా రియాక్ట్ అయ్యారు.
ఇవాంక ట్రంప్ ఎమోషనల్..!:
డొనాల్డ్ ట్రంప్ ను కోర్టు దోషిగా తేల్చిన కొద్దిసేపటికే ఆయన కుమార్తె ఇవాంక ట్రంప్ రియాక్ట్ అయ్యారు. ఇందులో భాగంగా... తండ్రితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకొంటూ ఓ ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. దీనికి "ఐ లవ్ యూ డాడీ" అనే క్యాప్షన్, హార్ట్ ఎమోజనీ జత చేశారు.