Begin typing your search above and press return to search.

ఉత్తరాఖండ్ టు తమిళనాడు ఆపై తిరుమలకు ఆవునెయ్యి

దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన తిరుమల తిరుపతి దేవస్థానానికి సప్లై చేసిన ఆవునెయ్యి కల్తీ అంశంపై జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు.

By:  Tupaki Desk   |   5 Oct 2024 6:31 AM GMT
ఉత్తరాఖండ్ టు తమిళనాడు ఆపై తిరుమలకు ఆవునెయ్యి
X

దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన తిరుమల తిరుపతి దేవస్థానానికి సప్లై చేసిన ఆవునెయ్యి కల్తీ అంశంపై జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. ఈ నెయ్యిని తమిళనాడుకు చెందిన ఏఆర్ డెయిరీ సప్లై చేసిన సంగతి తెలిసిందే. అయితే.. ఆవునెయ్యి అంశంపై అధికారులు ఇప్పుడు లోతుల్లోకి వెళుతున్న కొద్దీ షాకింగ్ నిజాలు వెలుగు చూశాయి. టీటీడీ నిబంధనల ప్రకారం ఆవునెయ్యిని సప్లై చేసే సంస్థలు ఏవైనా.. తిరుమలకు 800కిలోమీటర్ల పరిధిలో ఉన్న డెయిరీల నుంచి మాత్రమే నెయ్యిని కొనుగోలు చేయాలన్నది నిబంధన. ఆ రూల్ ను 1500కి.మీ. మేరకు పెంచింది పాలక మండలి. దీంతో.. తిరుపతికి 500కి.మీ. దూరంలో ఉన్న ఏఆర్ డెయిరీ నుంచి నెయ్యి వచ్చినట్లు రికార్డుల్లో కనిపిస్తున్నా.. ఆ నెయ్యి వచ్చింది మాత్రం తిరుమలకు2300కి.మీ. దూరంలోని ఉత్తరాఖండ్ రూర్కీ నుంచి. దీని మతలబు ఏమిటి? అన్నది ప్రశ్న.

మరో ఆసక్తికరమైన అంశం ఏమంటే తిరుమల శ్రీవారి లడ్డూకు వినియోగించే ఆవునెయ్యి ట్యాంకర్లు తమిళనాడుకు చెందిన ఏఆర్ డెయిరీ నుంచి వస్తున్నట్లుగా చెబుతున్నప్పటికీ.. ఆ కంపెనీకి అంత సామర్థ్యంతో ఆవునెయ్యిని ఉత్పత్తి చేసే సెటప్ లేదు. దీంతో.. ఆవునెయ్యి ఈ సంస్థకు ఎక్కడి నుంచి వస్తుందన్న అంశంపై ఫోకస్ చేస్తే షాకింగ్ నిజాలు బయటకు వచ్చాయి. ఉత్తరాఖండ్ లోని భోలేబాబా డెయిరీ నుంచి వైష్ణవి డెయిరీకి వచ్చే ఆవునెయ్యి టాంకర్లు.. ఆ తర్వాత ఏఆర్ డెయిరీకి చేరుతాయి. వాటిని తిరుమలకు పంపిన వైనం వెలుగు చూసింది.

అంతేకాదు.. భోలేబాబా డెయిరీ నుంచి వైష్ణవి డెయిరీ సగటున కేజీ ఆవునెయ్యి రూ.355 కొనుగోలుచేస్తే.. ఆ నెయ్యిని వైష్ణవి డెయిరీ నుంచి ఏఆర్ డెయిరాకి సగటున కిలో రూ.318.57కు అమ్మింది. దాన్ని రూపాయి లాభం వేసుకొని టీటీడీకి సప్లై చేసినట్లుగా రికార్డులు చెబుతున్నాయి. ఇక్కడ పాయింట్ ఏమంటే.. తిరుమల స్వామి వారి లడ్డూ ప్రసాదానికి వినియోగించే ఆవునెయ్యి కాంటాక్టు ఒకవేళ వైష్ణవి చేతికి వచ్చి ఉంటే.. స్వామి వారి మీద ఉన్న భక్తితో నష్టానికి సప్లై చేశారని భావించొచ్చు. అందుకు భిన్నంగా వైష్ణవి డెయిరీ ఎఆర్ డెయిరీకి నష్టానికి ఎందుకు అమ్ముతున్నట్లు? అన్నది ప్రశ్న.

అంతేకాదు.. వైష్ణవి సంస్థ దాదాపు కొనుగోలు చేసిన ఆవునెయ్యి ఏఆర్ డెయిరీకి పంపి.. వారి నుంచి తిరుమలకు చేరుకునేసరికి ప్రయాణించే దూరం దగ్గర దగ్గర 3300కి.మీ. ఇంత భారీ దూరం ప్రయాణించిన తర్వాత ఆ రవాణా ఖర్చుల మాటేంటి? వాటిని కలుపుకోకుండా కేజీకి సగటున రూ.36 వరకు నష్టానికి టీటీడీకి ఎందుకు సప్లై చేస్తున్నట్లు? అన్నది మరో ప్రశ్న. భోలేబాబా డెయిరీలో డైరెక్టర్లుగా ఉన్న విపిన్ జైన్.. పొమిల్ జైన్ లు వైష్ణవి డెయిరీ స్పెషాలిటీస్ లోనూ డైరెక్టర్లుగా ఉండటం ఆసక్తికరంగా మారింది. మొత్తంగా చూస్తే ఆవునెయ్యి కేజీ రూ.330 వస్తుందంటేనే దాని నాణ్యత మీద ఉండే అనుమానాలు బోలెడు. ఇప్పుడు ఉత్తరాఖండ్ నుంచి 3300కిలోమీటర్ల దూరం ప్రయాణించి మరీ నష్టానికి టీటీడీకి సప్లై చేయటం అది కూడా 10 లక్షల కేజీల ఆవునెయ్యిని సరఫరా చేయటం వెనుకున్న మర్మమేంటి? అన్నది అసలుసిసలు ప్రశ్న. అర్థమవుతోందా...?