Begin typing your search above and press return to search.

సీపీఐ నారాయణ సీరియస్... రామ్మోహన్ నాయుడికి లేఖ!

విమానయాన టిక్కెట్ల ధరలు ప్రజలకు అనుకూలంగా ఉండాలని.. కార్పొరేట్ వ్యక్తులే కాదు సామాన్య మధ్య తరగతి ప్రజలు కూడా విమానాల్లో ప్రయాణిస్తున్నారని వెల్లడించారు.

By:  Tupaki Desk   |   29 Oct 2024 9:19 AM GMT
సీపీఐ నారాయణ సీరియస్... రామ్మోహన్  నాయుడికి లేఖ!
X

పండగ సీజన్స్ లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఏ స్థాయిలో రేట్లు పెంచుతాయనేది తెలిసిన విషయమే. అదే దూరం, అదే మార్గం, అదే ఇందనం, అదే జనం.. అయినా కూడా కాలెండర్ లో ఎర్ర రంగులో తేదీ అంకె కనిపించగానే.. ప్రైవేట్ ట్రావెల్స్ ధరలు విపరీతంగా పెంచేస్తుంటాయి! అడిగే నాదుడే కరువయ్యాడనే కామెంట్లు ప్రజల నుంచి వినిపిస్తుంటాయి!

అయితే వాటికి ఏమాత్రం తీసిపోకుండా విమానయాన సంస్థలు కూడా ప్రయాణికులను అడ్డగోలుగా దోచుకుంటున్నాయనే చర్చ ఇటీవల కాలంలో బలంగా వినిపిస్తుంటుంది. ఒక ప్రాంతానికి నాన్ స్టాప్ ఫ్లైట్ లో వెళ్లేప్పుడు ఒక ధర, వచ్చేప్పుడు మరో ధర ఉంటుంటాయని.. ఒకే రోజులో ఒకే మార్గంలో రకరకాల ధరలు ఉంటుంటాయని చాలా మంది చెబుతుంటారు.

ఈ సమయంలో... విమాన ప్రయాణికులను విమానయాన సంస్థలు అడ్డగోలుగా దోచుకుంటున్నాయని.. వాటి టిక్కెట్ ధరలపై నియంత్రణ ఉండాలని.. విమానయాన సంస్థలు టిక్కెట్ల ధరలతో ప్రజలను లూటీ చేస్తున్నాయని అంటూ సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సీరియస్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడికి లేఖ రాశారు.

అవును... విమాన ప్రయణికులను విమానయాన సంస్థలు అడ్డగోలుగా దోచుకుంటున్నాయని.. మౌలిక సదుపాయాలేమో ప్రభుత్వం కల్పిస్తే.. ప్రీవేటు విమానయాన సంస్థలేమో అడ్డగోలుగా టిక్కెట్ ధరలు పెంచేస్తున్నాయని సీపీఐ నారాయణ మండిపడ్డారు. ప్రయాణ దూరం మారనప్పుడు టిక్కెట్ ధరలు ఎలా పెంచుతారని ప్రశ్నించారు.

విమానయాన టిక్కెట్ల ధరలు ప్రజలకు అనుకూలంగా ఉండాలని.. కార్పొరేట్ వ్యక్తులే కాదు సామాన్య మధ్య తరగతి ప్రజలు కూడా విమానాల్లో ప్రయాణిస్తున్నారని వెల్లడించారు. భారతదేశ నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకొని విమాన టిక్కెట్ ధరలు నిర్ణయించాలని.. వీటి రేట్లపై నియంత్రణ ఉండాలని సూచించారు.

ఇక గత రెండు వారాలుగా భారత విమానయాన సంస్థలకు బాంబు బెదిరింపులు వస్తుంటే ఇంటెలిజెన్స్ విభాగం ఏం చేస్తుందని ప్రశ్నించిన నారాయణ.. ప్రజలను సైకలాజికల్ టెర్రర్ కు గురిచేస్తున్నారని అన్నారు. రైళ్లలో సైతం వందే భారత్ పేరిట టిక్కెట్ ధరలు పెంచారని నారాయణ మండిపడ్డారు!