'రష్మిక చెప్పకనే చెప్పింది'... సీపీఐ నారాయణ కామెంట్స్!
అవును... సంధ్య థియేటర్ ఘటన అటు ఇండస్ట్రీని, ఇటు రాజకీయల్ని కుదిపేస్తున్న వేళ సీపీఐ నారాయణ ఘాటుగా స్పందించారు.
By: Tupaki Desk | 26 Dec 2024 8:31 AM GMT"పుష్ప-2" బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాట ఘటన తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ ఘటన అటు ఇండస్ట్రీలోనూ, ఇటు రాజకీయాల్లోనూ పెను సంచలనాలకు దారి తీస్తుందని అంటున్నారు. ఈ సమయంలో ఈ ఘటనపై స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు సీపీఐ నారాయణ!
అవును... సంధ్య థియేటర్ ఘటన అటు ఇండస్ట్రీని, ఇటు రాజకీయల్ని కుదిపేస్తున్న వేళ సీపీఐ నారాయణ ఘాటుగా స్పందించారు. ఇందులో భాగంగా.. ఎర్రచంద్రనం స్మగ్లర్ ను హీరోగా చూపించే ప్రయత్నం డైరెక్టర్ చేశాడని.. ఇలాంటి వాటికి బెనిఫిట్ షోలు, టిక్కెట్ ధరలు పెంచుకోమని ప్రభుత్వం అనుమతి ఇచ్చి మరింత తప్పు చేసిందని అన్నారు!
ఈ సందర్భంగా... చనిపోయిన రేవతి కుటుంబానికి రెండు కాదు ఐదు కోట్లు ఇచ్చినా ఆమెను తిరిగి ఇవ్వలేరని అన్నారు. ఈ ఘటనలో అందరి తప్పూ ఉందని.. వేల కోట్లు పెట్టి సినిమాలు తీస్తుంటే ప్రభుత్వం టిక్కెట్ ధరలు పెంచుకునే వెసులుబాటు ఇవ్వడం అంటే బ్లాక్ మార్కెట్ ని ప్రోత్సహిస్తున్నట్లే నని అన్నారు.
ఇదే క్రమంలో... పనికొచ్చే సినిమాలు, సందేశాత్మక, వినోదాత్మక సినిమాలకు ప్రభుత్వం బెనిఫిట్ షోలకు అనుమతి, పన్ను రాయితీలు ఇవ్వాలి తప్ప ఇలాంటి స్మగ్లింగ్ స్టోరీలతో తీసే సినిమాలకు టికెట్ ధరలు పెంచుకోమని అనుమతివ్వడం వల్లే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని అన్నారు.
ఈ నేపథ్యంలోనే... ఇలాంటి సినిమాలు తీసి స్మగ్లర్లను హీరోలుగా చూపిస్తున్నారని చెబుతూ... "రష్మిక చెప్పకనే చెప్పింది బాధపడుతూ.. నాకు ఇష్టం లేదు 'ఫీలింగ్స్' పాటకు డ్యాన్స్ చేయడానికి అని. కానీ తప్పనిసరిగా నిర్మాత ప్రోత్సహించడంతో చేయాల్సి వచ్చిందని చెప్పింది.. అలాంటి మహిళలంతా ఆత్మాభిమానం చంపుకుని ఆ కళాపోషణలో ఉన్నారని” అన్నారు.
దీనికి ఉదాహరణ రష్మిక ఇచ్చిన స్టేట్ మెంట్ అని ఎర్రన్న అన్నారు. దీంతో... సీపీఐ నారాయణ చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనంగా మారాయి.