Begin typing your search above and press return to search.

పుష్ప ఇష్యూలో ఎర్రన్న ఎంట్రీ... సర్కార్ పై ఫైర్!

'పుష్ప-2' బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన వ్యవహారం, తదనంతర పరిణామాలు తీవ్రస్థాయిలో రాజకీయ రంగు పులుముకున్నాయని అంటున్న వేళ సీపీఐ నేత నారాయణ స్పందించారు.

By:  Tupaki Desk   |   22 Dec 2024 9:49 AM GMT
పుష్ప ఇష్యూలో ఎర్రన్న ఎంట్రీ... సర్కార్ పై ఫైర్!
X

"పుష్ప-2" సినిమా బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటన వ్యవహారం ఇప్పుడు పెను ప్రకంపనలు సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో అల్లు అర్జున్ అరెస్ట్, విడుదల అనంతరం వ్యవహారం కాస్త చల్లబడింది అనిపించిందనే కామెంట్లు వినిపించిన నేపథ్యంలో... శనివారం సాయంత్రం తర్వాత లెక్క ఒక్కసారిగా మారిపోయిందని అంటున్నారు.

శనివారం తెలంగాణ అసెంబ్లీ అక్బరుద్దీన్ విషయాన్ని లేవనెత్తుతూ తీవ్ర వ్యాఖ్యలు చేయడం.. అనంతరం రేవంత్ రెడ్డి తనదైన శైలిలో విషయాన్ని సవివరంగా వివరిస్తూ కీలక వ్యాఖ్యలు చేయడం.. అనంతరం అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేయడం జరిగిపోయాయి. ఈ నేపథ్యంలో సీపీఐ నారాయణ స్పందించారు.

అవును... 'పుష్ప-2' బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన వ్యవహారం, తదనంతర పరిణామాలు తీవ్రస్థాయిలో రాజకీయ రంగు పులుముకున్నాయని అంటున్న వేళ సీపీఐ నేత నారాయణ స్పందించారు. ఇందులో భాగంగా... పుష్ప-2 బినిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటన చాలా ఘోరమని నారాయణ అన్నారు.

ఈ సందర్భంగా తొక్కిసలాటలో రేవంతి అనే మహిళ చనిపోవడం పట్ల ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నామని.. తీవ్రంగా గాయపడిన ఆమె కుమారుడు శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంపై నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇందులో భాగంగా... పుష్ప సినిమా ఎర్ర చందనం స్మగ్లిం గ్ చేసుకోవాలని సందేశం ఇస్తోందా..? అని ప్రశ్నించిన నారాయణ.. స్మగ్లింగ్ తో పాటు అసభ్యకరమైన పాటలు అందులో పెట్టారని.. ప్రభుత్వానికి సిగ్గులేకుండా టిక్కెట్లు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చిందని.. అదేమన్నా సమాజానికి ఉపయోగపడే సినిమానా..? అని నిలదీశారు!

అసలు ఇలాంటి వాటికి ప్రభుత్వం ఎందుకు అనుమతి ఇస్తుందని ప్రశ్నిస్తూ.. ఇలాంటి ఘటనలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని.. భవిష్యత్తులో ఇలా జరగకుండా ఉండేందుకు సినిమా వర్గాలు, రాజకీయ నేతలు చర్యలు చేపట్టాలని అన్నారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని నారాయణ సూచించారు.

కాగా.. పుష్ప-2 ఘటనపై ఇప్పటికే ప్రభుత్వం నుంచి ఆగ్రహం, ఆవేదన కలగలిపిన కామెంట్లు వినిపిస్తున్నాయని అంటున్న నేపథ్యంలో... నారాయణ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయని అంటున్నారు.