Begin typing your search above and press return to search.

అదానీ వ్యవహారం... కూటమికి పెద్ద పనే పెట్టిన ఎర్రన్నలు!

అదానీ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ పాత్ర కీలకంగా ఉందనే చర్చ వేళ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కీలక డిమాండ్ చేశారు.

By:  Tupaki Desk   |   22 Nov 2024 4:05 AM GMT
అదానీ వ్యవహారం... కూటమికి పెద్ద పనే పెట్టిన ఎర్రన్నలు!
X

అదానీపై అమెరికాలో కేసు వ్యవహారం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో.. ఏపీలో భారీ సౌరవిద్యుత్ ప్రాజెక్టులను కట్టబెట్టేందుకు అదానీ సంస్థల నుంచి రూ.1,750 కోట్ల లంచం అందిందనే చర్చ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో కమ్యునిస్టులు.. కూటమి ప్రభుత్వానికి పలు డిమాండ్లు చేశారు.

అవును.. అదానీ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ పాత్ర కీలకంగా ఉందనే చర్చ వేళ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కీలక డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా... వైసీపీ హయాంలో అదానీ కంపెనీతో చేసుకున్న అన్ని ఒప్పందాలనూ రద్దు చేయాలని.. ఈ వ్యవహారంపై సిటింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

ఇదే సమయంలో... వైసీపీ ప్రభుత్వంలో అదానీ కంపెనీలతో జరిగిన విద్యుత్ ఒప్పందాల్లోనూ భారీగా అవినీతి జరిగిందని.. దీనిపై అక్టోబర్ 24న న్యూయార్క్ లోని ఓ కోర్టులో కేసు నమొదైందని చెబుతూ.. ఈ కేసులో అదానీ సంస్థ పెద్ద ఎత్తున లంచాలు ముట్టజెప్పి, నాటి ప్రభుత్వ పెద్దలకు రూ.1,750 కోట్లు లంచాలుగా ముట్టప్పినట్లు ఆరోపించారు.

ఇదే క్రమంలో... నాటి జగన్ ప్రభుత్వం అదానీ సంస్థకు రాష్ట్రంలో వేల ఎకరాలు ధారాదత్తం చేసిందని.. ఇందులో భాగంగా అల్లూరి జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా 1,800 ఎకరాలు కట్టబెట్టిందని ఆరోపించారు. అదానీ సంస్థతో జగన్ సర్కార్ చేసుకున్న ఒప్పందాలను కూటమి ప్రభుత్వం రద్దుచేసి, చిత్తశుద్ధి నిరూపించుకోవాలని కోరారు.

మరోపక్క ఎన్డీయే ప్రభుత్వ పెద్దలతో అదానీకున్నది అవిభక్తక కవలల సంబంధం అన్న స్థాయిలో విమర్శలు చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. ఈ విషయంపై ఇప్పటికే ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందిస్తూ... అదానీకి ఏమీ కాకుండా ప్రధాని మోడీ కాపాడుకుంటారని చెప్పారు. ఈ సమయంలో ‘ఇండియా’ కూటమిలో భాగమైన ఎర్రన్నలు ఈ డిమాండ్ తెరపైకి తెచ్చారు.

మరి ఈ వ్యవహారంపై కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుంది..? ప్రధానంగా ఏపీపైనా భారీ ఆరోపణలు వస్తోన్న వేళ ఇక్కడున్న ఎన్డీయే ‘కూటమి’ ప్రభుత్వం ఏ మేరకు పైన పేర్కొన్న డిమాండ్ల విషయంలో స్పందిస్తుంది.. యాక్షన్ కు దిగుతుంది..? అనేది వేచి చూడాలి! కచ్చితంగా ఇది కూటమి ప్రభుత్వానికి కీలక విషయమనే చెప్పాలి!