పొత్తు లేదు 17 సీట్లలో సీపీఎం పోటీ.. పాలేరులో ఆయనే
తెలంగాణలో సీపీఎం ఒంటరి పోరుకు సిద్ధమైంది.
By: Tupaki Desk | 5 Nov 2023 6:58 AM GMTఎడతెగని ఎదురుచూపులు.. ఫలించని చర్చలు.. కొలిక్కిరాని సంప్రదింపులు.. తమ దారి తాము చూసుకుంటామన్న బెదిరింపుల అనంతరం తెలంగాణలో సీపీఎం ఒంటరి పోరుకు సిద్ధమైంది. 119 నియోజకవర్గాలకు గాను బలం ఉన్న చోట పోటీకి సిద్ధమైంది. తొలుత అధికార బీఆర్ఎస్ తలుపులు తట్టి.. అనంతరం కాంగ్రెస్ తో పొత్తుకు శతథా ప్రయత్నించిన వామపక్ష పెద్దన్న తన దారి తాను చూసుకుంది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల తొలి జాబితాను ఆదివారం ప్రకటించింది.
మొత్తం 17.. ఇప్పుడు 14
తెలంగాణలో మొత్తం 17 స్థానాల్లో బరిలో దిగాలని సీపీఎం నిర్ణయించింది. అందులో భాగంగా 14 స్థానాలకు అభ్యర్థుల పేర్లను వెల్లడించింది. వాస్తవానికి కాంగ్రెస్ తో కలిసి వెళ్లేందుకు చాలా సమయం వేచి చూసిన సీపీఎం.. మిర్యాలగూడ, వైరా సీట్లను కోరింది. తమ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సొంత నియోజకవర్గం పాలేరునూ వదులుకునేందుకు సిద్ధమైంది. ఒకప్పుడు తాము గెలిచిన మిర్యాలగూడ, కొత్తగా వైరా స్థానాలను ఇవ్వాలని కాంగ్రెస్ ను కోరింది. ఆ పార్టీ నుంచి సానుకూలత రాకపోవడంతో ఒంటరిగానే వెళ్లనుంది. ఆదివారం సాయంత్రానికి మిగతా మూడు నియోజకవర్గాలకూ అభ్యర్థులను వెల్లడించనున్నట్లు తెలుస్తోంది.
పాలేరులో ఆయనే..
సీపీఎం విడుదల చేసిన తొలి జాబితా ప్రకారం.. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఖమ్మం జిల్లా పాలేరు నుంచి బరిలో దిగనున్నారు. చిత్రం ఏమంటే.. ఈ నియోజకవర్గానికి పొరుగున ఉన్న, తమ్మినేని 2004-09 మధ్య ప్రాతినిధ్యం వహించిన ఖమ్మంలోనూ సీపీఎం పోటీకి దిగుతోంది. ఇక్కడనుంచి కాంగ్రెస్ తరఫున మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో అమీతుమీ అంటున్న సంగతి తెలిసిందే.
సీపీఎం పోటీ చేసే స్థానాలు ఇవే..
భద్రాచలం (ఎస్టీ)- కారం పుల్లయ్య, అశ్వారావుపేట (ఎస్టీ)- పిట్టల అర్జున్, పాలేరు - తమ్మినేని వీరభద్రం, మధిర (ఎస్సీ) - పాలడుగు భాస్కర్, వైరా (ఎస్టీ) - భూక్యా వీరభద్రం, ఖమ్మం - ఎర్ర శ్రీకాంత్‌సత్తుపల్లి (ఎస్సీ) - మాచర్ల భారతి, మిర్యాలగూడ - జూలకంటి రంగారెడ్డి, నకిరేకల్ (ఎస్సీ) – చినవెంకులు, భువనగిరి - కొండమడుగు నర్సింహ, జనగాం - మోకు కనకారెడ్డి, ఇబ్రహీంపట్నం - పగడాల యాదయ్య, పటాన్‌చెరు - జె. మల్లికార్జున్, ముషీరాబాద్ - ఎం. దశరథ్
మొత్తమ్మీద మూడు గిరిజన రిజర్వుడ్, మూడు ఎస్సీ రిజర్వుడ్ స్థానాల్లొ సీపీఎం పోటీ చేస్తోంది. ఇవి కాక తొలి జాబితాలోని మిగతా 11 జనరల్ స్థానాలు. ప్రకటించనున్న మూడింటిలో ఏమైనా రిజర్వుడ్ నియోజకవర్గాలు ఉంటాయా? లేదా? అనేది చూడాలి. అంతేకాక తొలి జాబితాలో హైదరాబాద్ లో ఒక్క అభ్యర్థినీ నిలపలేదు. మలి జాబితాలో అయినా నగరంలో పోటీ చేసే అభ్యర్థిని ప్రకటిస్తారేమోనని భావిస్తున్నారు.