ఐటీ ఉద్యోగులపై అసెంబ్లీలో చర్చ... తెరపైకి "బొండు మల్లెలు" కథ!
ఈ సమయంలో... తాజాగా తెలంగాణ అసెంబ్లీలో ఐటీ ఉద్యోగుల కష్టాలు, సమస్యల ప్రస్థావన వచ్చింది. ఈ మేరకు ఈ రంగంపై నియంత్రణ కోరుతూ సీపీఐ ఎమ్మెల్యే కీలక విషయాలు ప్రస్థావించారు.
By: Tupaki Desk | 30 July 2024 5:16 AM GMTఈ సమాజంలో ఐటీ ఉద్యోగులను చాలా మంది ప్రత్యేకంగా చూస్తారని అంటారు. వారి సంపాదన, లైఫ్ స్టైల్, ఇతర సానుకూల అంశాలతో పాటు విదేశాలకు వెళ్లే అవకాశాలు కూడా ఉండటంతో.. ఐటీ ఉద్యోగులకు సమాజంలో ప్రత్యేక గౌరవం ఉందని అంటుంటారు. ఐతే ఈ ప్రొఫెషన్ లో బయట నుంచి చూసేవారికి ఒకలా ఉంటే.. వారికి మాత్రం తమ పరిస్థితి మరోలా ఉంటుందని చెబుతున్నారు.
దూరపు కొండలు నునుపు.. అద్దాల గదుల్లో, అందమైన వాతావరణం మధ్య ఏసీ కింద కుర్చీలో కుర్చుని పని చేసుకుంటున్నట్లే కనిపిస్తుంది కానీ... వారికి కూడా లెక్కలేనన్ని పోరాటాలు, ప్రతికూలతలూ ఉన్నాయని అంటారు. అది అనుభవించే వారికి మాత్రమే తెలుస్తుంది తప్ప.. ఐడీ కార్డులు, పే స్లిప్ లు చూసి వావ్ అనే వారికి ఏమాత్రం తెలియదని.. బయటవారికి ఇదో స్వర్గదామంగా అనిపిస్తుంటుందని చెబుతుంటారు.
ఒక్క మాటలో చెప్పాలంటే... వీరి పరిస్థితి చాగంటి సోమయాజులు (చాసో) రాసిన "బొండు మల్లెలు" కథలోని పొట్ట వెన్నుకంటుకుపోయిన తాత పరిస్థితికి అప్ డేటెడ్ వెర్షన్ అనేవారూ లేకపోలేదు. ఈ సమయంలో... తాజాగా తెలంగాణ అసెంబ్లీలో ఐటీ ఉద్యోగుల కష్టాలు, సమస్యల ప్రస్థావన వచ్చింది. ఈ మేరకు ఈ రంగంపై నియంత్రణ కోరుతూ సీపీఐ ఎమ్మెల్యే కీలక విషయాలు ప్రస్థావించారు.
అవును... తెలంగాణ అసెంబ్లీలో సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఐటీ ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడుతూ... సాఫ్ట్ వేర్ ఉద్యోగులు అదృష్టవంతులు అని తరచూ అంచనా వేస్తారు కానీ... వారు రోజుకి సరాసరిన 14 నుంచి 16 గంటలు ఒకే చోట కూర్చుని పనిచేస్తారని తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ఐటీ కంపెనీలపై ప్రభుత్వ నియంత్రణ అవసరమని తెలిపారు.
ఉద్యోగులు తమ ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటూ అపరిమితంగా అన్నేసి గంటలు పనిచేస్తున్నందువల్ల ఈ కంపెనీలపై నియంత్రణ ఉండాలని... ఈ కంపెనీలు పెద్ద మొత్తంలో సంపాదిస్తున్నప్పటికీ.. పనిభారంతో ఉద్యోగుల వెన్ను విరుగుతుందని సాంబశివరావు అన్నారు! అందువల్ల ఐటీ కంపెనీలు, ఉద్యోగుల పనితీరును క్రమబద్ధీకరించాలని ఎమ్మెల్యే కూనంనేని.. ప్రభుత్వాన్ని కోరారు.