ఏపీ ఎన్నికల్లో ఓటమి ఎవరిదో చెప్పిన నారాయణ... కారణాలివేనట!
ఈ క్రమంలో తాజాగా ఏపీ ఎన్నికల ఫలితాలపైనా నారాయణ స్పందించారు.
By: Tupaki Desk | 1 Jun 2024 4:12 AM GMTగత రెండు మూడు రోజులుగా తనదైన శైలిలో ఎన్నికల ఫలితాలపై రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాదంటారు.. ఎన్డీయే కూటమిలోని టీడీపీ, కేంద్రంలో కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వడం తప్పదని తెలిపారు. మరి అది ఆయన సంపాదించిన రాజకీయ అనుభవం వల్ల చెబుతున్న మాటలా.. లేక, మరో అవగాహనతో చేస్తున్న వ్యాఖ్యలా అనేవి తెలియాల్సి ఉంది.
ఈ క్రమంలో తాజాగా ఏపీ ఎన్నికల ఫలితాలపైనా నారాయణ స్పందించారు. ఇందులో భాగంగా... ఏపీలో వైసీపీ గెలిచే అవకాశాలు లేవని ఆయన తేల్చేశారు. ఈ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయే పరిస్థితులో ఉందన్న నారాయణ.. అధికారులను నమ్మించేందుకే విశాఖలో ప్రమాణస్వీకారం అంటూ హడావిడి చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ఇక విశాఖలో హోటల్స్ గదులు అన్నీ అడ్వాన్స్ బుకింగ్ తో నిండిపోయాయంటూ వస్తున్న వార్తాల్లోనూ నిజం లేదని తెలిపారు.
ఈ సందర్భంగా... కౌంటింగ్ గురించి వైసీపీ నేతలు రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారని.. విశాఖలో జగన్ ప్రమాణస్వీకారం అంటూ హడావిడి చేస్తున్నారని.. ఇవన్నీ చూస్తుంటే వైసీపీ ఓడిపోతోందని తెలుస్తోందని తెలిపారు. ఇదే సమయంలో... జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు పెద్దఎత్తున ఓటేశారని ఆయన అభిప్రాయపడ్డారు.
ఎన్డీయేకు నుంచి బయటికి వచ్చే మొదటి వ్యక్తి చంద్రబాబే!:
ఇదే క్రమంలో... కేంద్రంలో మోడీ సర్కార్ అధికారంలోకి రాదని చెప్పిన సీపీఐ నారాయణ... ఇండియా కూటమికి చంద్రబాబు మద్దతు ఇవ్వక తప్పదని అన్నారు. కేంద్రంలో బీజేపీకి 400 స్థానాలు రావని, ఎన్డీయేకు తగిన మద్దతు రానిపక్షంలో ఆ కూటమి నుంచి బయటికి వచ్చే మొదటి వ్యక్తి చంద్రబాబేనని జోస్యం చెప్పారు. అప్పుడైనా చంద్రబాబు తప్పు తెలుసుకొని లౌకికవాద పార్టీలకు మద్దతు ఇవ్వాల్సిందే అన్నారు.
ఇదే సమయంలో... ప్రధాని నరేంద్రమోడీ కన్యాకుమారిలో ధ్యానం చేయడం అంటే అక్కడి ప్రాంతాన్ని కలుషితం చేయడమేనని.. చేసిన పాపాలను కడుక్కోవడానికే ఆయన అక్కడికి వెళ్లినట్లు ఉందని నారాయాణ ఘాటుగా విమర్శించారు.
దీంతో... ఏపీలో చంద్రబాబు అధికారంలోకి రావాలి.. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలి, ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు ఆ బంధాన్ని తెంచుకుని ఇండియా కూటమికి మద్దతు ఇవ్వాలని నారాయణ కోరుకుంటున్నట్లున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి!