Begin typing your search above and press return to search.

షర్మిలమ్మా జాగ్రత్తగా ఉండు.. నారాయణ సంచలన వ్యాఖ్యలు!

వైఎస్సార్‌ జయంతిని పురస్కరించుకుని కాంగ్రెస్‌ పార్టీ గుంటూరు జిల్లా మంగళగిరిలో ఘనంగా వేడుకలను నిర్వహించిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   9 July 2024 6:55 AM GMT
షర్మిలమ్మా జాగ్రత్తగా ఉండు.. నారాయణ సంచలన వ్యాఖ్యలు!
X

వైఎస్సార్‌ జయంతిని పురస్కరించుకుని కాంగ్రెస్‌ పార్టీ గుంటూరు జిల్లా మంగళగిరిలో ఘనంగా వేడుకలను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్‌ జీవించి ఉంటే తెలంగాణ వచ్చేది కాదన్నారు.

కమ్యూనిస్టులపై వైఎస్‌కు మంచి అభిప్రాయం ఉండేదని నారాయణ గుర్తు చేసుకున్నారు. దాన్ని ఆయన నిరూపించుకున్నారన్నారు. కొందరు నేతలు మనం బాగుంటే పలకరిస్తారని.. లేకపోతే పక్కకు పోతారన్నారు. కానీ, వైఎస్‌ అలాంటి వ్యక్తి కాదన్నారు. ఎవరైనా కలిస్తే.. పరిస్థితి ఏంటి? అని ఆరా తీసి.. సహాయం చేసేవారని గుర్తు చేసుకున్నారు.

వైఎస్సార్‌ ఉండిఉంటే.. రాష్ట్ర విభజన జరిగి ఉండేది కాదని నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ తెలంగాణ ఏర్పడినా.. టీఆర్‌ఎస్‌ మాత్రం ఉండేది కాదన్నారు.

రాజకీయాల్లో వైఎస్సార్‌ జెమ్‌ పర్సనాలిటీ అని నారాయణ తెలిపారు. రాజకీయాల్లో ఆయన ఒక విలక్షణ వ్యక్తి అని కొనియాడారు. ఆయనకు ఈ గుర్తింపు ఊరకే రాలేదన్నారు. కాంగ్రెస్‌ పార్టీలోనూ వైఎస్సార్‌ ను చాలామంది ఇబ్బంది పెట్టారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ముఖ్యమంత్రి అయ్యాక కూడా వైఎస్సార్‌ కు ఇబ్బందులు తప్పలేదన్నారు. సొంత పార్టీ వ్యక్తుల నుంచే కాకుండా బయటి పార్టీల నుంచి కూడా వైఎస్సార్‌ ఇబ్బందులు ఎదుర్కొన్నారని నారాయణ గుర్తు చేశారు. అయినప్పటికీ ఆ కష్టాలన్నింటిని ఎదుర్కొని నిలబడ్డారు కాబట్టే వైఎస్సార్‌ రాజకీయాల్లో జెమ్‌ పర్సనాలిటీ అయ్యారని కొనియాడారు.

రాజకీయ నాయకులు పూటకో పార్టీలో ఉంటున్నారని నారాయణ మండిపడ్డారు. కానీ, వైఎస్సార్‌ కు కాంగ్రెస్‌ పార్టీలోనే అనేక ఇబ్బందులు వచ్చినా అందులోనే ఉన్నారని గుర్తు చేశారు. అందుకే రాజకీయాల్లో వైఎస్సార్‌ ఒక విలక్షణ వ్యక్తి అని తెలిపారు.

ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిలపైనా నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. షర్మిలమ్మకి ఇంకా అన్ని కష్టాలు రాలేదన్నారు. ఒకవేళ షర్మిలకు ఏమైనా కష్టాలు వస్తే.. అవి ఆమె సొంత పార్టీ నుండే వస్తాయని హాట్‌ కామెంట్స్‌ చేశారు. కాబట్టి ‘షర్మిలమ్మా.. జాగ్రత్తగా ఉండు..’ అంటూ నారాయణ ఆమెకు హితబోధ చేశారు.

రాష్ట్రంలో, కేంద్రంలో ఉన్న డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ పై మరింత పోరాటం చేయాలని నారాయణ పిలుపునిచ్చారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు వల్లే నష్టం జరుగుతుందన్నారు. ప్రమాదకరమైన బీజేపీతో చంద్రబాబు అంటకాగుతున్నారని ధ్వజమెత్తారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్‌ పార్టీతో కలిసి ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో నారాయణ వ్యాఖ్యలు హాట్‌ టాపిక్‌ గా మారాయి.