చారనా కూరకు బారనా మసాలా అవసరమా?
ముఖ్యంగా సీపీఐ కార్యదర్శి రామకృష్ణ తరచూ ఈ మేరకు ప్రకటనలు చేశారు. వైఎస్ జగన్ ను గద్దె దించుతామని.. ఆయనను దించడం తమ వల్లే అవుతుందని కూడా చెప్పారు.
By: Tupaki Desk | 5 April 2024 6:30 AM GMTఆంధ్రప్రదేశ్ లో ఉభయ కమ్యూనిస్టు పార్టీలు.. సీపీఐ, సీపీఎంలకు ఒకప్పుడు మంచి పేరుండేది. రైతు అనుకూల ఉద్యమాలు, ప్రజా ఉద్యమాలు, ఉద్యోగులు, కార్మికుల అనుకూల ఉద్యమాలు నిర్వహిస్తూ ఎప్పుడూ ప్రజల్లోనే ఉండేవి. సీపీఐ, సీపీఎంలకు పుచ్చలపల్లి సుందరయ్య, తరిమెల నాగిరెడ్డి, చండ్ర రాజేశ్వరరావు ఇలా ఎంతోమంది గొప్ప నాయకులు ఉండేవారు. సిద్ధాంతపరంగా అంకిత భావంతో పనిచేస్తారని కమ్యూనిస్టు నేతలకు, కార్యకర్తలకు పేరుండేది.
అయితే కమ్యూనిస్టు పార్టీల్లో గొప్ప నేతలు మరణించాక ఈ పార్టీల ప్రస్థానం కూడా అంతకంతకూ పడిపోతూ వచ్చింది. గతంలో బలంగా ఉన్న స్థానాల్లోనూ ఈ పార్టీల పరిస్థితి కునారిల్లింది. ప్రతి ఎన్నికల్లోనూ ఏదో ఒక ప్రధాన పార్టీతో పొత్తు పెట్టుకుని ఏవో కొన్ని సీట్లలో పోటీ చేయడమే తప్ప సొంతంగా రాణించింది లేదు.
వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీతో, ఆ తర్వాత 2009లో చంద్రబాబుతో మహా కూటమిలో, 2019లో పవన్ కళ్యాణ్ తో కమ్యూనిస్టు పార్టీలు కొన్ని సీట్లలో పోటీ చేశాయి. తెలంగాణలో కూడా ఈ పార్టీలది ఇదే పరిస్థితి. కాంగ్రెస్ లేదా బీఆర్‌ఎస్ తో కలిసి వారు ఇచ్చిన సీట్లలోనే పోటీ చేయాల్సిన పరిస్థితి.
2023లో తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని సింగిల్ డిజిట్ స్థానాల్లోనే సీపీఐ పోటీ చేసింది. పొత్తులో భాగంగా కొత్తగూడెం స్థానాన్ని గెలుచుకుంది. అక్కడి నుంచి కూనంనేని సాంబశివరావు గెలుపొందారు.
ఇక ఆంధ్రప్రదేశ్ లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలన్నీ కమ్యూనిస్టు పార్టీలను వదిలేశాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తున్నాయి. వాస్తవానికి టీడీపీ, జనసేనలతో కలసి కమ్యూనిస్టు పార్టీలు పోటీ చేయాలని భావించాయి. ముఖ్యంగా సీపీఐ కార్యదర్శి రామకృష్ణ తరచూ ఈ మేరకు ప్రకటనలు చేశారు. వైఎస్ జగన్ ను గద్దె దించుతామని.. ఆయనను దించడం తమ వల్లే అవుతుందని కూడా చెప్పారు.
అయితే సీపీఐని టీడీపీ, జనసేన పార్టీలు లైట్ తీసుకున్నాయి. బీజేపీ అడిగినన్ని సీట్లు ఇచ్చి దానితో పొత్తు కుదుర్చుకున్నాయి. మరోవైపు వైసీపీ ఒంటరిగా బరిలోకి దిగుతుండటంతో ఇక సీపీఐకి కాంగ్రెస్ పార్టీ ఆశాకిరణంలా కనిపించింది. దీంతో ఆ పార్టీతో పొత్తు పెట్టుకుని సీపీఐ ఎన్నికల బరిలోకి దిగుతోంది. ఈ నేపథ్యంలో ఒక లోక్ సభా స్థానంతోపాటు 8 అసెంబ్లీ స్థానాల్లో సీపీఐ పోటీ చేస్తుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రకటించారు.
వాస్తవానికి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి బేస్ లేదు. 2014, 2019 ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్క సీటు కూడా ఆ పార్టీకి రాలేదు. ఇంకా గట్టిగా చెప్పాలంటే 1 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. అలాంటి పార్టీని కూడా సీపీఐ డిమాండ్ చేయలేకపోయిందని సెటైర్లు పడుతున్నాయి. కేవలం ఒకే ఒక్క లోక్ సభా స్థానంతో పాటు 8 అసెంబ్లీ స్థానాల్లోనే పోటీ చేస్తుండటం సీపీఐ పతనావస్థకు నిదర్శనం అంటున్నారు. ఈ నేపథ్యంలో మరో కమ్యూనిస్టు పార్టీ అయిన సీపీఎం ఎన్ని సీట్లలో పోటీ చేస్తుందో తేలాల్సి ఉంది. సొంతంగా బరిలోకి దిగని పార్టీలు ఇలా ఎప్పటికయినా ప్రధాన పార్టీలకు తోకపార్టీలుగా మిగిలిపోవాల్సిందేనని టాక్ నడుస్తోంది.