Begin typing your search above and press return to search.

ఎర్రన్నల పొత్తు తకరారు...లాభం కారుకేనా...?

అయితే కామ్రేడ్స్ ఒంటరిగా పోటీ చేయడం వల్ల ఎవరికి లాభం అంటే అది కచ్చితంగా కారు పార్టీకే అని అంటున్నారు. అలాగే బీయారెస్ కే ఇదంతా రాజకీయ లబ్దిని కలిగిస్తుంది అని అంటున్నారు.

By:  Tupaki Desk   |   2 Nov 2023 3:59 PM GMT
ఎర్రన్నల పొత్తు తకరారు...లాభం కారుకేనా...?
X

కాంగ్రెస్ తో పొత్తు పెటాకులు అయిందని కామ్రేడ్స్ కన్నెర్ర చేస్తున్నారు. అందులో ముందుగా బయటపడిన సీపీఎం ఏకంగా పదిహేడు మంది అభ్యర్ధులతో జాబితా ప్రకటించింది. ఇది తొలి జాబితా అని అంటోంది. అంటే మలి జాబితా కూడా ఉందా ఇంకా ఎంతమందిని నిలబెడతారు అన్నది చూడాల్సి ఉంది.

ఇక సీపీఎం పొత్తులో భాగంగా మూడు సీట్లు అడిగితే కాంగ్రెస్ రెండు సీట్లు ఇస్తామని అందని, అది కూడా తాము కోరుకున్న సీట్లు కావని పైగా పొత్తులు వారికి ఇష్టం లేదని అన్నట్లుగా వ్యవహార శైలి ఉందని కూడా కామ్రేడ్స్ అంటున్నారు. ఈ నేపధ్యంలో ఒంటరి పోరు కంటే శరణ్యం వేరేది లేదని కూడా అంటూ సీపీఎం తెలంగాణా రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పదిహేడు మంది అభ్యర్ధులతో జాబితా రిలీజ్ చేశారు.

మరో వైపు చూస్తే తమకు బలం ఉన్న చోట సీట్లు పొత్తులో ఇవ్వలేదని కాంగ్రెస్ మీద ఆరోపణలు గుప్పిస్తున్న సీపీఎం ఇపుడు ఏకంగా పదిహేడు చోట్ల పోటీ అంటే బలం ఎలా వచ్చింది అని కూడా డౌట్లు వస్తున్నాయి. అంటే సీపీఎం పోటీ ఒంటరిగా చేసి ఎవరి ఓట్లకు చేటు తెస్తుంది అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఇక సీపీఐ కూడా ఇదే తీరున ఉందని వార్తలు వస్తున్నాయి. నిజానికి ఈ రెండు పార్టీలు మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా కారెక్కారు. ఆ పార్టీతో పొత్తులకు సిద్ధపడ్డారు. అయితే బీయారెస్ ఒక్కొక్క సీటు రెండు పార్టీలకు ఇస్తామని చెప్పడంతో అక్కడ చెరి రెండు సీట్లకు బేరమాడి బయటకు వచ్చారని టాక్.

ఇక కాంగ్రెస్ తో పొత్తు ఒప్పందాన్ని చూస్తే చెరి మూడేసి సీట్లు అడిగినట్లుగా ప్రచారం సాగింది. అలా బేరం ఇక్కడ పెంచుకున్నారు. ఆ తరువాత సీట్ల కోసం కూడా తాము కోరినవి ఇవ్వాలని బలమున్నవి ఇవ్వాలని అడిగారని అంటున్నారు. ఇలా పొత్తు బేరంలో చివరికి ఏమి జరిగిందో తెలియదు కానీ ఒంటరి పోరుకు ఎర్రన్నకు తయారు అయ్యారని అంటున్నారు.

అయితే కామ్రేడ్స్ ఒంటరిగా పోటీ చేయడం వల్ల ఎవరికి లాభం అంటే అది కచ్చితంగా కారు పార్టీకే అని అంటున్నారు. అలాగే బీయారెస్ కే ఇదంతా రాజకీయ లబ్దిని కలిగిస్తుంది అని అంటున్నారు. కామ్రేడ్స్ కి పడే ఏ ఒక్క ఓటు అయినా కాంగ్రెస్ కి పడేదే అవుతుంది అని అంటున్నారు. అలా ఓట్లు చీల్చిన మీదట ఏమి సాధిస్తారు అన్నది కూడా చర్చకు వస్తోంది.

అంటే మరోమారు కేసీయార్ ని గద్దెనెక్కించాలన్న ఆలోచన ఉందా అన్నదే ఇక్కడ కీలకమైన ప్రశ్న. మరి ఒకసారి బీయారెస్ మరోసారి కాంగ్రెస్ ఇక రెండింటా చెడిన తరువాత సొంతంగా పోటీ ఇలా పొత్తుల విషయంలో రాజకీయాలే తప్ప సిద్ధాంతాలు ఏమైనా ఉండవా అన్నదే జనాలలో కలుగుతున్న సందేహం.

నిజానికి కామ్రేడ్స్ అంటే పోరాటాలకు పెట్టింది పేరు. ప్రజా సమస్యల మీద వారే ఎక్కువగా పోరు చేస్తారు. అలాంటిది బూర్జువా పార్టీలతో పొత్తులు పెట్టుకుంటూ తమను తాము తగ్గించుకున్నారు. ఇపుడు అటూ ఇటూ తిరుగుతూ ఎటూ కాకుండా వెళ్తున్నారు అన్నది అంతా అనుకుంటున్న మాట. అంతే కాదు ఒక సిద్ధాంతం ఉండాలి కదా అన్నది సూటి ప్రశ్న.

రాష్ట్రంలో కచ్చితంగా బీయారెస్ అధికారంలోకి రాకూడదు అంటే కాంగ్రెస్ కే మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ అలా కాకుండా కేవలం సీట్లూ రాజకీయ లాభాలూ చూసుకుంటే మిగిలిన పార్టీలకి కామ్రేడ్స్ కి మధ్య తేడా ఏంటి అన్న సందేహాలు వస్తున్నాయి. ఇపుడు ఒంటరి పోరు చేస్తూ సీపీఎం అంటున్న మాట ఏంటి అంటే బీజేపీని అధికారంలోకి రానీయకుండా చూస్తామని చెప్పడం.

అసలు తెలంగాణాలో బీజేపీ అధికారంలోకి వచ్చే పరిస్థితి ఇపుడు ఉందా. బీయారెస్ ని అధికారంలోకి రానీయకుండా అని చెప్పాలి. అది చెప్పడం కంటే సిద్ధాంతబద్ధంగా చేసి చూపించాలి. అదే ఇపుడు కామ్రేడ్స్ లో లోపించింది అని అంటున్నారు. చూడాలి మరి కామ్రేడ్స్ ఒంటరి పోరు కధ ఎంతవరకూ వెళ్తుందో.