Begin typing your search above and press return to search.

సీపీఐ అనూహ్య నిర్ణయం ?

సీపీఐ అనూహ్య నిర్ణయం తీసుకున్నట్లే ఉంది. కొత్తగా ఏర్పాటవబోతున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో సీపీఐ కూడా భాగస్వామిగా చేరే అవకాశముంది.

By:  Tupaki Desk   |   6 Dec 2023 6:14 AM GMT
సీపీఐ అనూహ్య నిర్ణయం ?
X

సీపీఐ అనూహ్య నిర్ణయం తీసుకున్నట్లే ఉంది. కొత్తగా ఏర్పాటవబోతున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో సీపీఐ కూడా భాగస్వామిగా చేరే అవకాశముంది. ఇదే విషయాన్ని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడుతు ఆఫర్ వస్తే ఆలోచిస్తామన్నారు. మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్, సీపీఐ మిత్రపక్షాలుగా కలిసి పోటీచేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ మిత్రపక్షంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో సీపీఐ అభ్యర్ధిగా పోటీచేసిన కూనంనేని సాంబశివరావు గెలిచారు. సుమారు 27 వేల మెజారిటితో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్ధి జలగం వెంకటరావు మీద గెలిచారు.

గురువారం ఉదయం ముఖ్యమంత్రిగా రేవంత్ ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. రేవంత్ తో పాటు మరికొందరు మంత్రులుగా ప్రమాణం చేయబోతున్నారు. ఇదే సమయంలో తమను మంత్రివర్గంలో చేరమని కాంగ్రెస్ నుండి ప్రతిపాదన వస్తే చేరే విషయాన్ని ఆలోచిస్తామని నారాయణ చెప్పారు. నారాయణ చెప్పిందాని ప్రకారం చూస్తే మంత్రివర్గంలో సీపీఐ చేరేట్లుగానే ఉంది. మంత్రివర్గంలో చేరే ఉద్దేశ్యంలేకపోతే నారాయణ ఈమాట చెప్పరు. సీపీఐ తరపున పోటీచేసింది, గెలిచింది ఏకైక నేత కూనంనేనే కాబట్టి ఆయనే మంత్రయ్యే అవకాశాలున్నాయి.

అయితే కాంగ్రెస్ లోనే మంత్రివర్గంలో చేరేందుకు ఆశావహులు చాలా ఎక్కువమందున్నారు. టెక్నికల్ గా చూస్తే కూనంనేని భద్రాద్రి కొత్తగూడెం జిల్లానే. అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గెలిచిన వాళ్ళల్లో తుమ్మల నాగేశ్వరరావు, భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసులరెడ్డి తదితరులున్నారు. ఈ ముగ్గురు ఖమ్మం జిల్లా పరిధిలోకి వస్తారు, కూనంనేని మాత్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోకి వస్తారు.

ఏదేమైనా మంత్రివర్గంలో సీపీఐ చేరే ఆలోచన చేయటం మాత్రం అనూహ్యమనే చెప్పాలి. ఎందుకంటే ఎక్కడ మాట్లడినా ? ఏమి మాట్లాడినా కాంగ్రెస్ పార్టీని సీపీఐ బూర్జువా పార్టీగా అభివర్ణిస్తుంటుంది. ఇపుడు అదే బూర్జువా పార్టీతో చేతులు కలిపి పోటీచేయటమే కాకుండా ప్రభుత్వంలో చేరే ఆలోచన చేస్తోందంటే మామూలు విషయం కాదు. గతంలో చాలాసార్లు పొత్తు పెట్టుకుని పోటీచేసింది. అయితే ఎప్పుడు కూడా మంత్రవర్గంలో చేరే ఆలోచన మాత్రం చేయలేదు. బహుశా ఇపుడా ముచ్చట కూడా తీరిపోతుందేమో.