సీపీఎంను ఎవరైనా నమ్ముతారా ?
‘సీపీఎం పోటీచేయని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులకు మద్దతిస్తాం’ ఇది తాజాగా సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారం ఏచూరి చేసిన ప్రకటన.
By: Tupaki Desk | 27 Nov 2023 12:30 PM GMT‘సీపీఎం పోటీచేయని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులకు మద్దతిస్తాం’ ఇది తాజాగా సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారం ఏచూరి చేసిన ప్రకటన. వాస్తవంగా అయితే సీతారం చేసిన ప్రకటనకే ఎవరైనా ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే ఏచూరి జాతీయ ప్రదాన కార్యదర్శి కాబట్టి. కానీ ఇప్పుడు సీతారామ్ చేసిన ప్రకటనను చాలామంది జనాలు నమ్మటంలేదు. ఎందుకంటే లోకల్ లీడర్ల డబల్ స్టాండర్డ్ విధానాల కారణంగానే.
నిజానికి కాంగ్రెస్ తో జట్టుకట్టి సీపీఐ, సీపీఎంలు పోటీచేయాల్సుంది. అయితే నియోజకవర్గాల కేటాయింపులో కాంగ్రెస్-సీపీఎం మధ్య ముదిరిన విభేదాల వల్ల పొత్తు కుదరలేదు. సీపీఎం అడిగినన్ని సీట్లు, అడిగిన నియోజకవర్గాలను కాంగ్రెస్ కుదరదని చెప్పింది. ఇదే సమయంలో సీపీఐ మాత్రం కాంగ్రెస్ ప్రతిపాదనకు అంగీకరించటంతో పొత్తు కుదిరింది. ఇపుడు కాంగ్రెస్+సీపీఐ పొత్తులో కలిసి పోటీచేస్తుంటే సీపీఎం మాత్రం ఒంటరిగా 17 నియోజకవర్గాల్లో పోటీచేస్తోంది. సరే ఎవరి పార్టీ వాళ్ళిష్టం అనుకుంటే సీపీఎం నిర్ణయంలో తప్పేమీలేదు.
అయితే నామినేషన్లు వేసి ప్రచారం కూడా మొదలైపోయిన తర్వాత సడెన్ గా బీఆర్ఎస్ కీలక నేత, మంత్రి హరీష్ రావు సీపీఎం నేతలను కలిశారు. మెదక్ జిల్లాలో కొన్ని సీట్లలో తమకు మద్దతు ఇవ్వమని అడిగారు. దాంతో అందరికీ సీపీఎం వైఖరిపై అనుమానాలు మొదలయ్యాయి. ఒకవైపు ఒంటరిగా పోటీచేస్తామని చెబుతునే మళ్ళీ హరీష్ తో సీపీఎం చర్చలేంటి అని ఆశ్చర్యపోయారు. అయితే వాళ్ళ చర్చలు ఏమయ్యాయో ? ఏమి నిర్ణయం తీసుకున్నారో తెలీదు.
ఇపుడు సీతారామ్ మాత్రం సడెన్ గా తాము పోటీచేయని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కే మద్దతని ప్రకటించారు. ఈ ప్రకటన ఇంతవరకు సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నుండి మాత్రం రాలేదు. ఇలాంటి ప్రతిపాదన ఒకటి పార్టీలో చర్చల్లో ఉన్నట్లు కూడా ఎవరికీ తెలీదు. అలాంటిది ఒకేసారి కాంగ్రెస్ కే మద్దతని సీతారామ్ ప్రకటించగానే జనాల్లో సీపీఎంను నమ్మచ్చా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. మరి కాంగ్రెస్ అభ్యర్ధులకు మద్దతుగా టీడీపీ నేతల్లాగ సీపీఎం నేతలు కూడా ప్రచారం చేస్తారా ? అనే విషయంలో క్లారిటిలేదు.