Begin typing your search above and press return to search.

ఆ నాని కాదు.. ఈ నాని వేరు

ఈ అగ్ని ప్రమాదానికి వాసుపల్లి నాని, అతడి మామ సత్యం కారణమని, వీళ్లిద్దరినీ అరెస్టు చేశామని సీపీ ప్రకటించారు.

By:  Tupaki Desk   |   26 Nov 2023 9:04 AM GMT
ఆ నాని కాదు.. ఈ నాని వేరు
X

విశాఖ ఫిషింగ్ హార్బర్లో జరిగిన భారీ అగ్ని ప్రమాదం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘోర అగ్నిప్రమాదంలో 30 బోట్లు పూర్తిగా కాలిపోవడం సంచలనంగా మారింది. ఈ అగ్ని ప్రమాదానికి కారకులు ఎవరనేది చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో యూట్యూబర్ లోకల్ బాయ్ నానిని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కానీ బయటకు వచ్చిన ఆయన.. పోలీసులు తనను కొట్టారని, తానే బోట్లు తగలబెట్టానని చాలా మంది అనుకుంటున్నారని, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ అగ్రి ప్రమాదానికి కారణమైంది వాసుపల్లి నాని అని, లోకల్ బాయ్ నాని కాదని పోలీసులు వెల్లడించడంతో కథ మలుపు తిరిగింది.

ఈ అగ్ని ప్రమాదానికి వాసుపల్లి నాని, అతడి మామ సత్యం కారణమని, వీళ్లిద్దరినీ అరెస్టు చేశామని సీపీ ప్రకటించారు. "వాసుపల్లి నాని, అతడి మామ సత్యం బోటులో కూర్చుని మద్యం సేవించారు. సిగరెట్లు కూడా తాగారు. ఆ తాగేసిన సిగరెట్లను పక్కబోటులోకి విసిరేశారు. దీంతో అక్కడున్న నైలాన్ వలకు నిప్పు అంటుకుని పొగ వ్యాపించింది. ఆ మంటలు బోటుకు వ్యాపించాయి. మిగతా బోట్లలోనూ డీజిల్, గ్యాస్ ఉండటం వల్ల ప్రమాద తీవ్రత పెరిగింది. దీంతో అక్కడి నుంచి నాని, సత్యం భయపడి పారిపోయారు. విచారణలో నాని పేరు తెరపైకి వచ్చింది. అందుకే యూట్యూబర్ నానితో పాటు మరో వాసుపల్లి నానిని కూడా విచారించాం. వీళ్లిద్దరు కాకుండా మరో వాసుపల్లి నాని ఈ ప్రమాదానికి కారణమని తెలుసుకుని.. వీళ్లిద్దరినీ వదిలేశాం. ఘటనకు కారమైన నానిని అరెస్టు చేశాం" అని సీపీ తెలిపారు.

అయితే ఈ ప్రమాద ఘటనలో భాగంగా లోకల్ బాయ్ నానిని విచారించిన తీరు పట్ల విమర్శలు వస్తున్నాయి. తనకు ప్రాణ హాని ఉందని బయటకు వచ్చిన తర్వాత నాని చెప్పారు. తన కుటుంబాన్ని కూడా వదిలిపెట్టమని బెదిరించారని కూడా తెలిపారు. కానీ ఇప్పుడు అసలు నిందితుడు వాసుపల్లి నాని అని పోలీసులు బయటపెట్టడంతో యూట్యూబర్ నానికి టెన్షన్ తప్పింది.