అమెరికా, యూకే..అక్రమ వలసలపై ఇండియా వేట కూడా మొదలు..మరి హైదరాబాద్ లో?
తమ దేశంలోకి వివిధ మార్గాల్లో అక్రమంగా వచ్చిన 600 మందిని అదుపులోకి తీసుకుంది.
By: Tupaki Desk | 10 Feb 2025 4:38 PM GMTఅక్రమ వలసలదారుల ఏరివేత.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏ క్షణాన మొదలుపెట్టారో కానీ.. ప్రపంచం అంతటా ఇప్పుడిదే హాట్ టాపిక్ అయింది.. ట్రంప్ సంకెళ్లు వేసి మరీ అమెరికా నుంచి పంపించి వేస్తున్నట్లుగా కథనాలు వస్తుంటే.. యూకే కూడా అరెస్టులు చేసి అక్రమ వలసదారులను వెళ్లగొట్టే ప్రయత్నం సాగిస్తోంది. గత నెల 20న ట్రంప్ అధ్యక్షుడు అయిన తర్వాత అక్రమ వలసదారుల వేట మొదలపెట్టారు. ఆ నెలలోనే యూకే (యునైటెడ్ కింగ్ డమ్) కూడా దీనిని అందిపుచ్చుకుంది. తమ దేశంలోకి వివిధ మార్గాల్లో అక్రమంగా వచ్చిన 600 మందిని అదుపులోకి తీసుకుంది.
2024 జూలైలో కీర్ స్టార్మర్ బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన తర్వాత లేబర్ పార్టీ ప్రభుత్వం భద్రతపై ప్రత్యేక దృష్టిసారించింది. ఆ క్రమంలోనే జనవరిలో ఇమ్మిగ్రేషన్ విభాగం.. సరైన అనుమతుల్లేకుండా యూకేలో అడుగుపెట్టి.. బార్లు, రెస్టారెంట్లు, కార్ వాషింగ్ కేంద్రాలు, స్టోర్లలో పనిచేస్తున్న వందలాది అక్రమ పనివారిని అరెస్టు చేసింది.
ఇక ట్రంప్ సర్కారు సైతం గత కొన్ని రోజుల నుంచి అక్రమ వలసదారుల ఏరివేతను టాప్ ప్రయారిటీగా చేపట్టింది. వీరిలో 200 మంది పైగా భారతీయులను స్వదేశానికి పంపే ప్రయత్నం చేస్తోంది. కొందరు ఇప్పటికే తిరిగి వచ్చేశారు కూడా.
ఢిల్లీలో వేట షురూ..
దేశ రాజధాని ఢిల్లీలో ప్రభుత్వం మారిన వెంటనే పరిస్థితులు కూడా మారుతున్నాయి. వాస్తవానికి గత నెలలోనే ఢిల్లీలో అక్రమ వలసదారుల ఏరివేతకు ముమ్మర సోదాలు జరిగాయి. తాజాగా రాజధానిలో అక్రమంగా మకాం వేసిన 16 మంది విదేశీయులను వెనక్కి పంపించేంది కేంద్ర ప్రభుత్వం. వీరిలో పొరుగునున్న బంగ్లాదేశ్ కు చెందిన ఐదుగురు, నైజీరియా వారు తొమ్మిది మంది, గినియా, ఉబ్జెకిస్థాన్ కు చెందినవారు ఒకరు చొప్పున ఉన్నట్లు తేలింది.
మరి మన హైదరాబాద్ లో..?
సగటు మనిషి జీవనానికి దేశ రాజధాని ఢిల్లీ ఎంత ఫేమస్సో.. హైదరాబాద్ కూడా అంతే.. ఈ కమ్రంలోనే తెలంగాణ రాజధానికి వందలాది మంది అక్రమంగా వచ్చారు. వీరిలో బంగ్లాదేశీలూ ఉన్నట్లు గతంలో తేలింది. కొందరు ఆఫ్రికన్ దేశాల వారు కూడా చదువు కోసం వచ్చి వీసా గడువు ముగిశాక కూడా హైదరాబాద్ లోనే ఉండిపోయారు. ఇప్పుడు ఢిల్లీ తరహాలోనే మన దగ్గరా ఏరివేత మొదలుపెట్టాల్సి ఉంది.