జాక్ పాట్ కొట్టారని చెప్పి రూ.వెయ్యి చేతిలో పెట్టిన క్రెడ్
ఫ్రైడే జాక్ పాట్ లో మ్యాక్ బుక్.. ఐపాడ్.. ఎయిర్ పాడ్స్.. మ్యాక్స్.. టూమి బ్యాగ్ లాంటి విలువైన వస్తువులు ఉన్నాయి.
By: Tupaki Desk | 10 Sep 2024 4:41 AM GMT'క్రెడ్' గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ మొబైల్ అప్లికేషన్ ఫోన్ లో డౌన్ లోడ్ చేసి పెట్టుకోవటం.. దీని ద్వారా క్రెడిట్ కార్డు బిల్లుల్ని పే చేయటం ద్వారా.. బోలెడన్ని రివార్డు పాయింట్లు వస్తాయని చెప్పటం.. ఈ అప్లికేషన్ ఉన్న ఫోన్లకు క్రెడిట్ కార్డు బిల్లుల బకాయిలకు సంబంధించిన అలెర్టు ఇవ్వటం తెలిసిందే. అన్ని వర్గాల వారు వినియోగిస్తారన్న పేరున్న క్రెడ్ చేసిన ఒక కక్కుర్తి పని గురించి ఒక నెటిజన్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆయనకు ఎదురైన చేదు అనుభవం గురించి విన్న తర్వాత.. క్రెడ్ మీద మంచి అభిప్రాయం పోవటం ఖాయమని చెబుతున్నారు.
ఇంతకూఅసలేం జరిగిందన్న విషయంలోకి వెళితే.. అవిరల్ సంగల్ అనే వ్యక్తి ఎక్స్ లో పెట్టిన పోస్టు ప్రకారం అతనను 'క్రెడ్ ఫ్రైడే జాక్ పాట్'కు ఎంపికైనట్లుగా సమాచారం అందింది. దీంతో విపరీతమైన ఆనందానికి గురయ్యారు. కారణం.. ఈ జాక్ పాట్ కొట్టిన వారికి రూ.3.25 లక్షలు విలువైన బహుమతుల్ని అందిస్తారు. కానీ.. సాంకేతిక కారణాలతో జాక్ పాట్ ను రద్దు చేశామని.. కేవలం రూ.వెయ్యి మాత్రమే క్యాష్ బ్యాక్ ఇస్తామని కంపెనీ ఆఫర్ చేసినట్లుగా పేర్కొన్నారు.
ఫ్రైడే జాక్ పాట్ లో మ్యాక్ బుక్.. ఐపాడ్.. ఎయిర్ పాడ్స్.. మ్యాక్స్.. టూమి బ్యాగ్ లాంటి విలువైన వస్తువులు ఉన్నాయి. బహుమతులు అందుకోవటానికి పత్రాన్నినింపాలని కోరగా.. తాను అవన్నీపూర్తి చేశానని చెప్పారు. టీడీఎస్ చెల్లింపు కోసమని తన పాన్ వివరాల్నితీసుకున్నట్లు చెప్పిన అతను.. ఫారమ్ పోస్టు చేసిన తనకు కాసేపటికి క్రెడ్ ప్రతినిధులు ఫోన్ చేసినట్లు వెల్లడించారు.
సాంకేతిక కారణాలతో జాక్ పాట్ ను రద్దు చేయాల్సి వచ్చిందని.. గుడ్ విల్ కింద రూ.వెయ్యి క్యాష్ బాక్ ఇవ్వనున్నట్లు చెప్పారన్నారు. తనకు ఎదురైన అనుభవం గురించి వెల్లడించిన పోస్టుకు పలువురు స్పందించారు. క్రెడ్ తీరును తప్పు పట్టారు. జాక్ పాట్ అని చెప్పి టెక్నికల్ ఇష్యూ కారణంగా రూ.వెయ్యి ఇస్తామని చెప్పటం ఏమిటంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ పోస్టు తాజాగా వైరల్ అవుతోంది.మరి.. క్రెడ్ స్పందిస్తుందా? లేదా? అన్నది చూడాలి.