Begin typing your search above and press return to search.

ఒకే వేదిక.. 4 పెళ్లిళ్లు.. స్టార్ క్రికెటర్ వివాహంలో విచిత్రం

ఒక వేదికపై సహజంగా ఒకటే పెళ్లి జరుగుతుంది.. కొన్ని సందర్భాల్లో మహా అంటే రెండో వివాహం కూడా చేస్తుంటారు.. అక్కడే మూడో జంటకు పెళ్లి అంటే మాత్రం కాస్త విచిత్రమే..

By:  Tupaki Desk   |   4 Oct 2024 12:30 PM GMT
ఒకే వేదిక.. 4 పెళ్లిళ్లు.. స్టార్ క్రికెటర్ వివాహంలో విచిత్రం
X

ఒక వేదికపై సహజంగా ఒకటే పెళ్లి జరుగుతుంది.. కొన్ని సందర్భాల్లో మహా అంటే రెండో వివాహం కూడా చేస్తుంటారు.. అక్కడే మూడో జంటకు పెళ్లి అంటే మాత్రం కాస్త విచిత్రమే.. అయితే, ఇక్కడ నాలుగో జంటకూ పెళ్లి జరిగింది.. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. మరింతగా చెప్పుకోవాలంటే అదో స్టార్ క్రికెటర్ ఇంట వివాహం.. జరిగింది మన దేశంలో కాదు.. విదేశంలో.

వార్న్ తర్వాత అతడే అద్భుతం

ప్రపంచ క్రికెట్ లో దాదాపు అంతం అయిందనుకున్న లెగ్ స్పిన్ కు ప్రాణం పోశాడు ఆస్ట్రేలియా క్రికెటర్ షేన్ వార్న్. మరి అతడి రిటైర్మెంట్ తర్వాత ఎవరా? అని చూస్తుండగా దూసుకొచ్చాడు రషీద్ ఖాన్. అఫ్ఘానిస్థాన్ వంటి కల్లోలిత దేశం నుంచి.. నిత్యం బాంబుల మోత మోగే దేశం నుంచి ఇంతటి ప్రతిభావంతుడు దొరుకుతాడని ఎవరూ అనుకోలేదు. కేవలం 16-17 ఏళ్ల వయసుకే అంతర్జాతీయ క్రికెట్ లోకి వచ్చిన రషీద్.. ఇప్పటివరకు 5 టెస్టులు, 105 వన్డేలు, 93 టి20లు ఆడాడు. ఇక ప్రపంచ వ్యాప్త లీగ్ లకు అయితే లెక్కే లేదు. 20కి పైగా లీగ్ లలో అతడు ఆడుతున్నాడంటేనే అర్థం చేసుకోవచ్చు.

హైదరాబాద్ తో ప్రత్యేక అనుబంధం

అఫ్ఘాన్ క్రికెటర్ కు భారత్ ఎంతో చేసింది. ఇక రషీద్ ఖాన్ కు అయితే ఇంకా చాలా చేసింది. 17 ఏళ్ల రషీద్ ప్రతిభను గుర్తించిన ఐపీఎల్ జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్ అతడిని దక్కించుకుంది. 2016 సీజన్ నుంచి 2021 వరకు హైదరాబాద్ ఆడిన రషీద్ తన ప్రతిభతో ఎన్నో మ్యాచ్ లను గెలిపించాడు. దీంతోనే అతడు హైదరాబాదీలకు దగ్గరయ్యాడు. కాగా, రెండు వారాల కిందటే 26వ ఏట అడుగుపెట్టిన రషీద్ ఇప్పుడు ఓ ఇంటి వాడయ్యాడు.

అతడితో పాటు సోదరులూ..

గురువారం రాత్రి జరిగిన రషీద్‌ ఖాన్‌ వివాహం ఫొటోలు వైరల్‌ గా మారాయి. అఫ్ఘానిస్థాన్ రాజధాని కాబూల్‌ లోని ఇంపీరియల్‌ కాంటినెంటల్ హోటల్‌ లో జరిగిన ఈ వేడుకలో అఫ్గాన్‌ స్టార్‌ క్రికెటర్లు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ ఫొటోలను క్రికెటర్లు సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో బాగా వైరల్ అయ్యాయి. కాగా, రషీద్ ఎవరిని పెళ్లి చేసుకున్నదీ తెలియరాలేదు. మరోవైపు రషీద్‌ తో పాటు అతడి ముగ్గురు సోదరులు అమీర్‌ ఖలీల్‌, జకియుల్లా, రజా ఖాన్‌ కూడా గురువారం రాత్రి ఒకేసారి వివాహం చేసుకోవడం గమనార్హం. సంప్రదాయ పష్తూన్‌ ఆచారాల ప్రకారం వీరు పెళ్లాడారు. మొన్నటివరకు భారత్ లో న్యూజిలాండ్ తో టెస్టు మ్యాచ్ కోసం పర్యటించిన.. నిన్నటివరకు దక్షిణాఫ్రికాతో సిరీస్ లో పాల్గొన్న రషీద్ ఖాన్.. ఇప్పుడు పెళ్లి కొడుకయ్యాడని తెలిసి అభిమానులందరూ ఆశ్చర్యపోయారు. తర్వాత ఆల్ ది బెస్ట్ చెబుతూ పోస్ట్ లు పెడుతున్నారు.

రషీద్‌ ఐపీఎల్ లో ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్‌ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

సోదరుల సాయంతోనే..

రషీద్.. తన సోదరుల సాయంతోనే క్రికెట్ లో రాణించాడు. నిత్యం బాంబుల మోతతో దద్దరిల్లే అఫ్ఘానిస్థాన్ వంటి సంక్షుభిత దేశం నుంచి రషీద్ ఈ స్థాయికి చేరడం వెనుక అతడి సోదరుల ప్రోత్సాహం ఉంది. ఇప్పడు వారంతా ఒకేసారి పెళ్లి కొడుకులు కావడం విశేషం.