అంబటి రాయుడు పొలిటికల్ ఇన్నింగ్స్ : ఆ పార్టీ నుంచే...?
రాజకీయాల్లోకి రావాలనుంది అంటూ యువ క్రికెటర్ అంబటి రాయుడు తన మనసులో మాటను రాజమండ్రి వేదికగా తాజాగా మీడియా ముందు పంచుకున్నారు.
By: Tupaki Desk | 4 Nov 2023 3:54 AM GMTరాజకీయాల్లోకి రావాలనుంది అంటూ యువ క్రికెటర్ అంబటి రాయుడు తన మనసులో మాటను రాజమండ్రి వేదికగా తాజాగా మీడియా ముందు పంచుకున్నారు. తాను ప్రస్తుతం రాజకీయాల గురించే ఆలోచిస్తున్నాను అని అంటున్నారు. అందుకే రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్నాను అని ఆయన చెబుతున్నారు.
ఇక జగన్ పరిపాలన బాగుందని అంబటి రాయుడు కితాబు ఇచ్చారు. యువ రాజకీయ నేతలకు జగన్ స్పూర్తి అని కూడా అంటున్నారు. ఇదిలా ఉంటే కొన్నాళ్ళ క్రితం అంబటి రాయుడు జగన్ని కలిసి వచ్చారు. అప్పట్లో ఆయన వైసీపీలో చేరుతారు అని ప్రచారం పెద్ద ఎత్తున సాగింది. ఎందువల్లనో అది ఆగింది.
ఇపుడు మళ్లీ అంబటి రాయుడు రాజకీయాల గురించి మనసు విప్పారు. అది కూడా వైసీపీ యువ ఎంపీ మార్గాని భరత్ చేపట్టిన ఒక అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొంటూ ఆయన పొలిటికల్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తాను అని అంటున్నారు.
అంబటి రాయుడు రాజకీయాల్లోకి వస్తే ఎక్కడ నుంచి పోటీ అంటే ఆయన గుంటూరు ఎంపీగా వైసీపీ తరఫున రంగంలో ఉంటారని అంటున్నారు. బలమైన సామాజికవర్గానికి చెందిన అంబటి రాయుడు వైసీపీని మురిపించి ఊరిస్తున్న గుంటూరు ఎంపీ సీటుని ఈసారి అయినా గెలిపించి తీసుకుని వస్తారా అన్నదే చర్చగా ఉంది.
అంబటి రాయుడుకు సొంత ఇమేజ్ ఉంది. యూత్ లో క్రేజ్ ఉంది. క్రికెటర్ గా కూడా మంచి ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన వెనక బలమైన సామాజికవర్గం ఉంది. ఇవన్నీ ప్లస్ పాయింట్లే అంటున్నారు. ఇక అంబటి రాయుడు రాష్ట్రవ్యాప్తంగా పర్యటన చేస్తున్నాను అని అంటున్నారు.
మరి ఆయన ప్రజలతో మాట్లాడినపుడు వైసీపీ కచ్చితంగా గెలిచి తీరుతుందని ఏమైనా అంచనాలు అందాయా అన్నది చూడాలి. కొన్ని నెలల క్రితం మాట్లాడినపుడూ ఆయన వైసీపీకి ఫేవర్ గా మాట్లాడారు, ఇపుడు కూడా జగన్ ఈజ్ గ్రేట్ అంటున్నారు. అంటే ఏపీలో ఎప్పటికపుడు రాజకీయ పరిణామాలు మారుతున్నా అంబటి వాయిస్ లో మాత్రం ఎక్కడా తేడా రావడంలేదు.
పైగా ఆయన వైసీపీ పాలన బాగుంది అని అంటున్నారు. తెలుగుదేశం జనసేన కూటమి కట్టాయి. చంద్రబాబు అరెస్ట్ తరువాత బాబుకు పెద్ద ఎత్తున సానుభూతి వచ్చిందని కూడా ప్రచారం సాగుతొంది. మరి ఇవన్నీ అంబటి రాయుడు దృష్టిలోకి రావడంలేదా అన్నది కూడా ప్రశ్నలుగా ఉన్నాయి.
పోటీ చేస్తే వైసీపీ నుంచే చేయాలి. ఎంపీగా చేయాలి అని అంబటి రాయుడు ఫిక్స్ అయిపోయారా లేక ఏపీలో గెలుపు గుర్రంగా వైసీపీ ఉందని ఆయన భావిస్తున్నారా అన్న దాని మీద చర్చ అయితే సాగుతోంది. మొత్తానికి అంబటి బ్యాట్ ఈసారి పొలిటికల్ రూట్ ని తీసుకుంటోంది అని చెప్పవచ్చు.