Begin typing your search above and press return to search.

హెచ్-1బి వీసా అబ్బాయ్.. కోహ్లి, రోహిత్ ను పడగొట్టాడు

మరి ఇలాంటివారిని ఒకటే మ్యాచ్ లో ఔట్ చేయడం అంటే మాటలా? ఈ స్థాయి ప్రదర్శన చేశాడు ఓ బౌలర్

By:  Tupaki Desk   |   13 Jun 2024 7:55 AM GMT
హెచ్-1బి వీసా అబ్బాయ్.. కోహ్లి, రోహిత్ ను పడగొట్టాడు
X

ప్రస్తుతం ప్రపంచంలో మూడు ఫార్మాట్లలోనూ అత్యుత్తమ బ్యాట్స్ మెన్ ఎవరంటే..? పోనీ టి20ల్లో సూపర్ బ్యాటర్లు ఎవరంటే..? తడుముకోకుండా వచ్చే సమాధానం భారత బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ. ప్రపంచంలోని ఎలాంటి పిచ్ పైనైనా వీరిద్దరూ ప్రమాదకర బ్యాటర్లు. టెక్నిక్, దూకుడు కలగలిసిన ఆటగాళ్లు. మరి ఇలాంటివారిని ఒకటే మ్యాచ్ లో ఔట్ చేయడం అంటే మాటలా? ఈ స్థాయి ప్రదర్శన చేశాడు ఓ బౌలర్.

సౌరభ్ నేత్రవాల్కర్.. ప్రస్తుతం జరుగుతున్న టి20 ప్రపంచ కప్ లో బాగా వినిపిస్తున్న పేరు. అమెరికా జట్టు ప్రధాన పేసర్ అయిన ఇతడు పాకిస్థాన్ తో మ్యాచ్ లో అద్భుత ప్రదర్శన చేశాడు. సూపర్ ఓవర్ లోనూ ఆ జట్టును కట్టడి చేసి అమెరికా చరిత్రాత్మక గెలుపులో భాగమయ్యాడు. దీంతోనే సౌరభ్ గురించి చర్చ జరుగుతోంది. ఇంతకూ ఎవరితడు? అనే వెదుకులాట మొదలైంది.

దెబ్బకొట్టేవాడే..

బుధవారం మ్యాచ్ లో కోహ్లి, రోహిత్ లను వెంటవెంటనే ఔట్ చేశాడు సౌరభ నేత్రవాల్కర్. అసలే బౌలర్లకు సహకరిస్తున్న పిచ్ పై అతడి బౌలింగ్ తీరు చూసి.. మ్యాచ్ చేజారుతుందేమో? అనిపించింది. కోహ్లిలాంటి బ్యాటర్ ను గోల్డెన్ డక్ గా పెవిలియన్ పంపడం అంటే మాటలు కాదు.. ఇక రోహిత్ కు మొదట ఆఫ్ స్టంప్ బయటకు కొన్ని బంతులేసి, అనూహ్యంగా మరో బంతిని లోపలకు వేసి ఔట్ చేశాడు. 130 కిలోమీటర్లకు మించని వేగంతోనే నేత్రవాల్కర్ రాణిస్తున్నాడు.

ముంబైలో పుట్టి 2010 అండర్-19 టి20 ప్రపంచ కప్ లో భారత్ కు ప్రాతినిధ్య వహించాడు సౌరభ్ నేత్రవాల్కర్. అప్పటి జట్టులోని ఇతడి సహచరులైన కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, సందీప్ శర్మ తదితరులు టీమిండియాకు ప్రాతినిధ్యం వహించారు. కానీ, నేత్రవాల్కర్ మాత్రం తన భవిష్యత్ తెలిసి.. అమెరికా వెళ్లిపోయాడు. కార్నెల్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ పీజీ చేశాడు. ఒరాకిల్ లో సీనియర్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తూనే క్రికెట్ లో కొనసాగాడు. ఫలితంగా అమెరికా జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు.

ఐసీసీ నిబంధనల ప్రకారం ఒక క్రికెటర్ వేరొక దేశం తరఫున ఆడాలంటే ఆ దేశంలో ఏడేళ్లు నివసించి ఉండాలనే నిబంధనను కాస్త సడలించారు. దీంతో నేత్రవాల్కర్ కు అమెరికా తరఫున ఆడే చాన్స్ దొరికింది.

ఒకప్పుడు రోహిత్ ఆడి?

నేత్రవాల్కర్ ముంబైకు చెందినవాడు. ఈ లెక్కన చూస్తే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో ఏదో ఒక దశలో కలిసి ఆడి ఉంటాడు. కోహ్లిని కూడా ఎదుర్కొని ఉంటాడు. కాగా, నేత్రవాల్కర్ ను బుధవారం మ్యాచ్ కు ముందు కామెంటేటర్లు హర్భజన్ సింగ్, నవజ్యోత్ సిద్ధూ ఇంటర్వ్యూ చేశారు. పుట్టిన గడ్డ భారత్ పై ఎప్పటికీ మమకారం ఉంటుందని అతడు చెప్పడం ఈ సందర్భంగా గమనార్హం.