Begin typing your search above and press return to search.

మైనర్ ను ఇద్దరు పిల్లల తల్లిని చేసి..వీడి ముదురు తెలివికి షాక్ తినాల్సిందే

తాను తప్పించి.. ఇంకెవరూ అక్కర్లేదన్నట్లుగా ఉండే వీడి మైండ్ సెట్ చూసినప్పుడు.. ఇలాంటి తేడాగాళ్లు సినిమాల్లోని విలన్లకు మించినట్లుగా ఉంటారు.

By:  Tupaki Desk   |   25 Feb 2025 9:30 AM GMT
మైనర్ ను ఇద్దరు పిల్లల తల్లిని చేసి..వీడి ముదురు తెలివికి షాక్ తినాల్సిందే
X

ఒక సాదాసీదా వ్యక్తికి క్రిమినల్ మైండ్ సెట్ ఉంటే ఎలా ఉంటుందన్న దానికి నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తాడు వీడు. తప్పు మీద తప్పు చేస్తూ.. చేయకూడని దారుణాలకు పాల్పడుతూ.. తాను మాత్రం మంచోడి మాదిరి.. బాధితుడిగా బిల్డప్ ఇచ్చే ఇతగాడి తీరుకు షాక్ తినాల్సిందే. తాను తప్పించి.. ఇంకెవరూ అక్కర్లేదన్నట్లుగా ఉండే వీడి మైండ్ సెట్ చూసినప్పుడు.. ఇలాంటి తేడాగాళ్లు సినిమాల్లోని విలన్లకు మించినట్లుగా ఉంటారు. ఇంతకూ వీడెవడు? ఎక్కడివాడు? వీడు చేసిన అరాచకాలేంటి? అన్న వివరాల్లోకి వెళితే..

పల్నాడు జిల్లా రొంపిచర్లకు చెందిన 31 ఏళ్ల నాగరాజుకు భార్య.. ఇద్దరు పిల్లలు. 2017లో తన ఇంటికి దగ్గర్లో ఉండే 13 ఏళ్ల బాలిక మీద వీడి కన్ను పడింది. ఆమెకు మాయమాటలు చెప్పి లోబర్చుకున్నాడు. ఇద్దరు పిల్లలకు తల్లిని చేశాడు. ఆర్థిక పరిస్థితి బాగోలేదని చెప్పి వారిని దత్తత పేరుతో అమ్ముకొని వదిలించుకున్నాడు. నంద్యాల లోని ఒక రైల్వే కాంట్రాక్టర్ వద్ద కూలీగా పని చేస్తూ.. తప్పుడు పనుల్ని ఒకటి తర్వాత ఒకటి చొప్పున చేసుకుంటూ పోయేటోడు.

అయితే.. తన కుమార్తె కనిపించటం లేదంటూ రొంపిచర్ల పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు పెట్టింది మైనర్ బాలిక తల్లి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సదరు బాలిక నంద్యాలలో ఉన్నట్లుగా గుర్తించారు. ఆమెకు కౌన్సెలింగ్ ఇవ్వగా.. ఎక్కడ తనపై కేసు పెడతారన్న భయంతో బాలికను పెళ్లి చేసుకుంటుననట్లుగా చెప్పి మెడలో తాళి కట్టాడు. అయితే.. నాగరాజుకు గతంలోనే పెళ్లై.. ఇద్దరు పిల్లలు ఉన్న విషయం ఆలస్యంగా తెలుసకున్న బాలిక.. ఊరి పెద్దల ముందు పంచాయితీ పెట్టింది. నాగరాజుకు దూరంగా తల్లి వద్ద ఉంటోంది.

అప్పటికైనా తాను చేసిన తప్పుల్ని గుర్తించి.. చెంపలేసుకొని బతికితే మరోలా ఉండేది. కానీ.. ఇతగాడు అలా చేయలేదు సరికదా.. బాలికను తన దగ్గరకు రప్పించుకోవటానికి ఒక దుర్మార్గమైన ప్లాన్ వేసాడు. బాలిక మీదా.. ఆమె కుటుంబం మీదా తప్పుడు ప్రచారం చేయటం మొదలుపెట్టాడు. రైల్లో బోగీలపై ఆమె ఫోన్ నెంబరు రాసి..అమ్మాయిలు కావాలంటే సంప్రదించాల్సిందిగా రాశాడు. ఇంకోవైపు తన పిల్లల్ని బాలిక తల్లిదండ్రులు వేరే వారికి అమ్మినట్లుగా మచిలీపట్నం పోలీస్ స్టేషన్ తో పాటు శిశుసంక్షేమ శాఖలో తప్పుడు కంప్లైంట్ ఇచ్చాడు.

గతంలో ఒక శిశువును మచిలీపట్నంలో అమ్మిన నాగరాజు.. తెలివిగా అక్కడే కేసు పెట్టాడు. ఈ వ్యవహరాలన్ని పోలీసుల ముందుకు వెళ్లటంతో అతడి దుర్మార్గాలన్నీ బయటకు వచ్చాయి. తాజాగా అతడి మీద రెండు కేసుల్ని నమోదు చేసారు. మరోవైపు నాగరాజు మీద కఠిన చర్యలు తీసుకోవాలంటూ బాధితురాలు సీడబ్ల్యూసీ సభ్యులకు ఫిర్యాదు చేసింది. దీంతో.. కేసును విజయవాడ మహిళా పోలీస స్టేషన్ కు బదిలీ చేశారు. నాగరాజు ప్రదర్శించిన ముదురు తెలివి పోలీసుల్ని సైతం విస్మయానికి గురి చేసింది.