పవన్‌పై క్రిమినల్ కేసు.. ఏపీ సర్కారు దూకుడు.. ఏం జరిగింది?
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై ఏపీ ప్రభుత్వం క్రిమినల్ కేసు నమోదు చేసింది. వలంటీర్ల విషయంలో ఆయన గతంలో చేసిన వ్యాఖ్యలపై ఈ కేసు నమోదు చేసినట్టు తెలిసింది.
By: Tupaki Desk | 18 Feb 2024 6:43 AM GMTజనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై ఏపీ ప్రభుత్వం క్రిమినల్ కేసు నమోదు చేసింది. వలంటీర్ల విషయంలో ఆయన గతంలో చేసిన వ్యాఖ్యలపై ఈ కేసు నమోదు చేసినట్టు తెలిసింది. ప్రభుత్వం కీలకంగా భావిస్తున్న వలంటీర్లపై పవన్ కల్యాణ్ గత ఏడాది జరిగిన సభలో అనుచితంగా మాట్లాడారంటూ పేర్కొంది. వలంటీర్లను కించపరిచేలా, వారి మానసిక ధైర్యాన్ని దెబ్బతీసేలా అనుచిత వ్యాఖ్యలు చేశారని, ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించారనే ఆరోపణలతో గుంటూరు న్యాయస్థానంలో క్రిమినల్ కేసు దాఖలు చేసింది.
దీనిని జిల్లా ప్రధాన న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. ఐపీసీ సెక్షన్లు 499, 500 కింద పవన్‌పై క్రిమినల్ కేసు నమోదు చేసి నాలుగో అదనపు జిల్లా కోర్టుకు బదిలీ చేసింది. ఈ మేరకు మార్చి 25న పవన్ కల్యాణ్ విచారణకు హాజరుకావాలని నాలుగో అదనపు జిల్లా కోర్టు న్యాయాధికారి శరత్‌బాబు నోటీసులిచ్చారు. దీనిపై జనసేన నాయకులు స్పందించాల్సి ఉంది.
ఏం జరిగింది?
గత ఏడాది జులై 9న ఏలూరులో పవన్ కల్యాణ్ వారాహి యాత్రలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో సుమారు 29వేల నుంచి 30వేల మంది అమ్మాయిలు అదృశ్యమ య్యారని ఆరోపించారు. కేంద్ర నిఘా వర్గాల ద్వారా తనకు సమాచారం తెలిసిందన్నారు. రాష్ట్రంలో అదృశ్యమైన మహిళల్లో 14 వేల మంది తిరిగి వచ్చారని పోలీసులు చెబుతున్నారని, మిగిలినవారి గురించి ముఖ్యమంత్రి ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. మహిళల అదృశ్యం గురించి డీజీపీ సైతం సమీక్షించలేదని విమర్శించారు. వలంటీర్లు ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరి సమాచారం సేకరించి ఒంటరి మహిళలను గుర్తించి కొంత మంది సంఘ విద్రోహ శక్తులకు చేరవేస్తున్నారని, వారి ద్వారా వల వేసి అపహరిస్తున్నారని ఆరోపించారు. ఇందులో వైసీపీ ప్రభుత్వంలోని కొందరు పెద్దల హస్తమున్నట్లు కేంద్ర నిఘా వర్గాలు తనకు చెప్పినట్లు పవన్ అప్పట్లో వెల్లడించారు.
కేసులో ఏముంది?
ప్రభుత్వ పథకాల అమలులో వలంటీర్లు కీలకంగా పనిచేస్తున్నారని, వారి మనోధైర్యాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా పవన్ వ్యాఖ్యలున్నాయని ప్రభుత్వం ఫిర్యాదులో పేర్కొంది. ప్రభుత్వంపై కావాలనే బురదజల్లే లా పవన్ మాట్లాడారని ఆయనపై చర్యలు తీసుకోవాలని న్యాయస్థానంలో ఫిర్యాదు చేసింది. అంతకు ముందు జులై 20న పవన్‌పై ప్రభుత్వం చర్యలు చేపట్టేందుకు 20న ఉత్తర్వులిచ్చింది. తాడికొండ మండలం కంతేరుకు చెందిన వలంటీరు బి.పవన్‌కుమార్‌తోపాటు మరికొంతమంది ఇచ్చిన వాంగ్మూలం మేరకు పవన్‌పై కేసు దాఖలు చేస్తున్నట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
తాజాగా పవన్ వివరణ ఇదీ..
రెండు రోజుల కిందట పవన్ కళ్యాణ్ దీనిపై వివరణ ఇచ్చారు. తాను వలంటీర్లను ఏమీ అనలేదన్నారు. గత ఏడాది తాను వలంటీర్లను ఉద్దేశించి ఎలాంటి విమర్శలు చేయలేదన్నారు. కేవలం వారు సేకరిస్తున్న డేటా హైదరాబాద్‌లోని ఓ సంస్థకు చేరుతోందని.. అక్కడ నుంచి విద్రోహ శక్తులకు చేరుతోందని అన్నట్టు చెప్పారు. తనకు వలంటీర్లపై అభిమానం ఉందని..వారు మంచిగా ప్రజలకు చేరువ అవుతున్నారని వ్యాఖ్యానించారు. అయితే.. ఒకరిద్దరు వలంటీర్లు మాత్రం పార్టీలకు అంటకాగుతున్నారని చెప్పారు. ఇది జరిగిన రెండు రోజులకే పవన్‌పై కేసు పెట్టడం గమనార్హం.