పెద్దల సభకు వెళ్లేటోళ్ల పైనా అన్నేసి క్రిమినల్ కేసులా?
కొందరు ఇప్పటికే ఎన్నిక కాగా.. మరికొందరి సభ్యుల విషయంలో మాత్రం పోలింగ్ అనివార్యమవుతున్న పరిస్థితి.
By: Tupaki Desk | 25 Feb 2024 4:39 AM GMTరాజకీయ నేతలకు నేరాలకు అనుబంధం అంతా ఇంతా కాదన్నట్లుగా ఉంటుందన్న విషయం ఎన్నికల వేళలో మరోసారి నిరూపితమవుతూ ఉంటుంది. తాజాగా పెద్దల సభ (రాజ్యసభ)కు జరుగుతున్న ఎన్నికల గురించి తెలిసిందే. మరో రెండు రోజుల్లో (మంగళవారం) రాజ్యసభకు పోలింగ్ జరగనుంది. మొత్తం 15 రాష్ట్రాల్లోని 59 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. కొందరు ఇప్పటికే ఎన్నిక కాగా.. మరికొందరి సభ్యుల విషయంలో మాత్రం పోలింగ్ అనివార్యమవుతున్న పరిస్థితి.
ఇదిలా ఉంటే.. మొత్తం 59 మంది అభ్యర్థుల్లో ఒకరు మినహాయిస్తే.. మిగిలిన 58 మంది అభ్యర్థుల అఫిడవిట్లను పరిశీలిస్తే ఒక విషయం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. మిగిలిన సభలకు సరే.. పెద్దల సభకు జరిగే ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులకు కూడా నేర చరిత ఉండటం గమనార్హం. మొత్తం58 మందిలో 21 మందిపైన క్రిమినల్ కేసులు ఉన్నాయి. అంటే.. బరిలో ఉన్న అభ్యర్థుల్లో 36 శాతం నేరచరిత ఉన్న వారేనన్న మాట.
క్రిమినల్ కేసులు ఉన్న 21 మందిలో పది మంది మీద మరింత తీవ్రమైన నేరారోపణల్ని ఎదుర్కొంటున్నారు. పార్టీల పరంగా చూస్తే.. నేర చరిత ఉన్న అభ్యర్థులు ఎక్కువ మంది బీజేపీలో ఉన్నప్పటికీ ఇక్కడో విషయాన్ని ప్రస్తావించాలి. మందిలో ఎక్కువ మంది బీజేపీ వారు ఉన్నా.. వారు బరిలో నిలుపుతున్న అభ్యర్థుల సంఖ్యతో పోల్చి చూస్తే మాత్రం వారి శాతం తక్కువగా ఉండటం కనిపిస్తుంది.
బీజేపీ మొత్తంగా 30 మంది అభ్యర్థుల్ని బరిలో ఉంచితే వారిలో 8 మంది మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి. అంటే.. 40 శాతం అభ్యర్థుల మీద క్రిమినల్ కేసులు ఉన్నట్లు. అదే సమయంలో కాంగ్రెస్ బరిలో నిలిపిన 9 మంది అభ్యర్థుల్లో 6గురు మీద క్రిమినల్ కేసులు ఉండటం గమనార్హం. అంటే.. మూడింట రెండింతలుగా చెప్పాలి. అంటే.. 67 శాతంగా చెప్పాలి. ఇక.. వైసీపీ బరిలో నిలిపిన ముగ్గురు అభ్యర్థుల్లో ఒకరిపై క్రిమినల్ కేసులు ఉంటే.. తెలంగాణ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ కు చెందిన ఒకే ఒక్క అభ్యర్థి బరిలో ఉన్నారు. ఆయనపైనా క్రిమినల్ కేసులు ఉన్నట్లుగా ఏడీఆర్.. నేషనల్ ఎలక్షన్ వాచ్ సంస్థలు వెల్లడించాయి.