అదిరే ఆవిష్కరణ: నేరం జరిగిన చోట గాల్లో నేరస్తుడి డీఎన్ఏ!
తాజాగా వారు కనిపెట్టిన టెక్నాలజీ గురించి తెలిస్తే నేరస్తుల గుండెల్లో రైళ్లు పరిగెత్తటం ఖాయం.
By: Tupaki Desk | 4 April 2024 9:30 AM GMTఏదైనా నేరం జరిగినంతనే.. అక్కడికి వచ్చే పోలీసులు.. దర్యాప్తు అధికారులు ఆధారాలు చెడిపోకుండా ఉండటానికి జాగ్రత్తలు తీసుకుంటారు. ఎక్కువ మందిని అక్కడకు రాకుండా నిరోధించి వేలిముద్రల్ని జాగ్రత్తగా రికార్డు చేయటం తెలిసిందే. ఇదంతా పాత టెక్నాలజీ. డిజటల్ యుగంలో ఇప్పటి రోజులకు తగ్గట్లు సరికొత్త సాంకేతికతను కనిపెట్టారు ఆస్ట్రేలియాకు చెందిన పరిశోధకులు. తాజాగా వారు కనిపెట్టిన టెక్నాలజీ గురించి తెలిస్తే నేరస్తుల గుండెల్లో రైళ్లు పరిగెత్తటం ఖాయం.
నేరం చేసిన చోట వేలిముద్రలు పడకుండా జాగ్రత్తలు తీసుకునే జాదూగాళ్లకు దిమ్మ తిరిగిపోయేలా ఆస్ట్రేలియాకు చెందిన ఫ్లిండర్స్ విశ్వవిద్యాలయ పరిశోధకులు సరికొత్త విధానాన్ని గుర్తించారు. నేరం జరిగిన ప్రదేశంలో సదరు వ్యక్తి డీఎన్ఏను గుర్తించటమే సరికొత్త ఆవిష్కరణ. అదెలా అంటే.. మనుషులు మాట్లాడినప్పుడు.. వారు శ్వాసపీల్చినప్పుడు వారి డీఎన్ఏ ఆనవాళ్లు వాతావరణంలోకి విడుదలవుతుంటాయి. అక్కడి వాతావరణం నుంచి వీటిని గుర్తించటమే సరికొత్త సాంకేతికగా చెబుతున్నారు.
ఇక.. నేరం జరిగిన చోట ఏసీ ఉంటే.. పని మరింత సులువుగా చెబుతున్నారు. ఎందుకంటే వాయు ప్రసరణ జరుగుతున్నప్పుడు డీఎన్ఏ ఆనవాళ్లు అక్కడి ఘన.. ద్రవ ఉపరితలాలపై ఉంటాయని.. అక్కడి గాల్లోనూ తిరుగుతుంటాయని చెబుతున్నారు. దీంతో.. నేరస్తుల్ని గుర్తించటం సులువు అని చెబుతున్నారు. తాజా టెక్నాలజీతో పర్యావరణ డీఎన్ఏను సేకరించి.. జాగ్రత్తగా విశ్లేషిస్తే.. నేరస్తుడ్ని గుర్తించటం సులువైన పనిగా చెబుతున్నారు. ఈ విధానం అమల్లోకి వస్తే.. నేరస్తులు తప్పించుకోవటం ఒక పట్టాన సాధ్యం కాదనే చెప్పాలి.