బీసీ వర్సెస్ ఓసీ: బాబుకు సంకటంగా కీలక నియోజకవర్గం!
ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్అందరితోనూ కలివిడిగా ఉంటూ.. ముందుకు సాగుతున్నారు.
By: Tupaki Desk | 29 Jan 2024 12:30 AM GMTఉమ్మడి కృష్ణాజిల్లాలోని పెనమలూరు నియోజకవర్గం టీడీపీకి సంకటంగా మారింది. ఈ సీటుపై పార్టీ అధినేత చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే చర్చ జోరుగా సాగుతూనే ఉంది. అదేసమయం లో టికెట్ విషయం డోలాయమానంలో పడేసరికి.. టీడీపీ కీలక నాయకులు సైలెంట్ అయిపోయారు. టీడీపీకి కంచుకోట వంటిఈ నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో గెలుపు ఖాయమని పార్టీ నాయకులు నిర్ణయించుకున్నారు. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్అందరితోనూ కలివిడిగా ఉంటూ.. ముందుకు సాగుతున్నారు. ఈయన ఓసీ సామాజిక వర్గం నేత.
అయితే.. వైసీపీ ఇక్కడ బీసీ నేతను దింపేసింది. ఫైర్ బ్రాండ్ మంత్రి, బీసీ నేత జోగి రమేష్ గౌడ్‌కు వైసీపీ పెనమలూరు టికెట్ ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ ఇప్పుడు ఏం చేయాలనే విషయంపై తర్జన భర్జన పడుతోంది. ప్రత్యర్తి పార్టీ బీసీ కి ఇచ్చిన దరిమిలా.. తాము కూడా బీసీకే ఇవ్వాలని అనుకున్నా.. పార్టీ కోసం నిలబడ్డ.. బోడే ప్రసాద్‌ను కాదనలేని పరిస్థితి. పైగా.. ఆయన ఇటీవల కాలంలో ప్రతి గడపకు వెళ్తున్నారు. ప్రతి సామాజిక వర్గాన్నీ కలుసుకుని.. తనవైపు తిప్పుకొంటున్నారు. టీడీపి మినీ మేనిఫెస్టో సహా.. వైసీపీ ప్రభుత్వ లోపాలను ఆయన వివరిస్తున్నారు.
ఈ నేపథ్యంలో పెనమలూరులో టీడీపీ టికెట్ విషయం ఆసక్తిగామారింది. మరోవైపు.. వైసీపీ అసమ్మతి నాయకుడు, సిట్టింగు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి టీడీపీలోకి వస్తుండడం దాదాపు ఖరారైంది. ఈయన బీసీ సామాజిక వర్గం నాయకుడే. యాదవ వర్గంలోనూ ఆయనకు మంచి పేరుంది. ఈయన కూడా.. పెనమలూరు టికెట్ కోసమే పార్టీలోకి వస్తున్నట్టు సంకేతాలు పంపించారు. కానీ, ఈ టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు. మరోవైపు.. టికెట్ తనదేనని అనుకున్న బోడే ప్రసాద్ వేచిచూస్తున్నారు.
టికెట్ తనకు ఇవ్వాలంటూ.. ఇప్పటికే ఆయన నారా లోకేష్ కు కబురు పెట్టారు. అయితే. పార్టీ మాత్రం ఆచి తూచి వ్యవహరిస్తోంది. నియోజకవర్గంలో బీసీలు ఎక్కువగా ఉండడంతో వారితో ఓరల్, ఐవీఆర్ సర్వేల ద్వారా సమాచారం సేకరించే పనిలో పడినట్టు తెలుస్తోంది. దీని ఆధారంగా టికెట్ నిర్ణయించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరి ఏం చేస్తారో చూడాలి. మొత్తానికి ఓసీ వర్సెస్ బీసీగా మారిపోయిన.. ఈ టికెట్ వ్యవహారం చంద్రబాబుకు సంకటంగానే మారిందని చెప్పాలి.