ఆ విమర్శ మోడీకి సింపతీ పెంచేస్తోంది...!
అయితే ఇది విమర్శ కాదు ఆయన మీద రాళ్ళు వేయబోయి పూలను జల్లుతున్నామని లాలూ వంటి వారు తెలుసుకోలేకపోతున్నారు.
By: Tupaki Desk | 5 March 2024 2:30 AM GMTఈ దేశంలో రాజకీయ నేతల మీద జనాలకు ఒక అభిప్రాయం ఉంది. అత్యధిక శాతం అవినీతిపరులు అన్న భావన ఉంది. అంతే కాదు తమ కోసం తమ కుటుంబాల కోసం తమ వారి కోసమే పనిచేస్తారు అని కూడా సగటు జనం అనుకుంటారు. రాజకీయాల్లో ఎక్కువ మంది ఇలాగే ఉంటారు అని వారి అభిప్రాయం
అయితే రాజకీయాల్లో చూస్తే ఒంటరిగా ఉంటూ కుటుంబ బంధాలకు దూరంగా ఉన్న వారు ఏడున్నర దశాబ్దాల దేశ చరిత్రలో ఎవరూ లేరు ప్రధాని వంటి ఉన్నత పదవిని అందుకున్న వారిలో ఇద్దరే ఇద్దరు అలా ఉన్నారు. వారిలో ఒకరు బ్రహ్మచారి అటల్ బిహారీ వాజ్ పేయ్ అయితే రెండవవారు నరేంద్ర మోడీ. ఇద్దరూ బీజేపీకి చెందిన వారే.
ఇక వాజ్ పేయ్ పెళ్ళి చేసుకోకపోయినా ఒక కుమార్తెని పెంచుకున్నారు. ఆమె భర్త అంటే వాజ్ పేయ్ అల్లుడు ఆయన ప్రధానిగా ఉన్న కాలంలో ఎంతో కొంత పలుకుబడి చూపించారు అన్న ప్రచారం అయితే ఉంది. అవినీతి ఆరోపణలు అయితే లేవు కానీ అది ఒక ప్రచారంగా వచ్చింది. వాజ్ పేయ్ బ్రహ్మచారి అయినా కొన్ని బంధాలకు కట్టుబడ్డారు.
కానీ పదిహేడవ ఏట వివాహం జరిగినా వద్దనుకుని దేశం కోసం నిలబడిన వారిగా బీజేపీలో ఆరెస్సెస్ లో హిందూత్వ వాదులలో నరేంద్ర మోడీకి ఎంతో గౌరవం ఉంది. ఆయన గత అరవై ఏళ్లుగా దేశం కోసమే పనిచేస్తున్నారు అని వారంతా గాఢంగా నమ్ముతారు. ఏ బాదరా బంధీ లేకుండా తాను ఒక్కడినే అంటూ పదేళ్ల పాటు ప్రధాని హోదాలో మోడీ దేశానికి కనిపించారు.
ఇదే ఆయనకు అతి పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పాలి. కుటుంబం ఉంటే సహజంగానే స్వార్ధం ఉంటుంది. తనకు కుటుంబం లేదని ప్రజలే కుటుంబం అని తెలంగాణాలోని ఆదిలాబాద్ లో జరిగిన బహిరంగ సభలో మోడీ భావోద్వేగంగా చెప్పారు. తాను దేశం కోసమే ఇంటిని వదిలి బయల్దేరాను అని ఆయన అన్నారు. ఇది దేశంలోని కోట్లాది మందిని తాకే మాట.
ఎక్కడ ఏ మాట వాడి నెగ్గాలో మోడీకి మాత్రమే తెలుసు. ఆయన తెలంగాణా పర్యటనకు వచ్చే ముందు బీహార్ మాజీ సీఎం ఆర్జేడీ అధినేత అయిన లాలూ ప్రసాద్ యాదవ్ ఒక ఘాటు వ్యాఖ్య మోడీ మీద చేశారు. ఆయనకు కుటుంబం లేదు కాబట్టే తరచూ వారసత్వ రాజకీయాలు మీద విమర్శిస్తారు అని. ఈ విమర్శ ఎవరు చేసినా మోడీకి అది వరమే అవుతుంది. ఆయన మీద రెట్టింపు గౌరవం పెరుగుతుంది. అంతే కాదు సింపతీ కూడా వస్తుంది.
పెళ్ళిళ్ళు చేసుకుని పిల్లలను కని వారిని తమ వారసులుగా రాజకీయల్లోకి తీసుకుని రావడమే దేశంలోని అనేక ప్రాంతీయ పార్టీలలో జరుగుతున్న తంతు. దానినే ప్రధాని మోడీ కుటుంబ రాజకీయాలు అని దెప్పి పొడుస్తూ ఉంటారు. వారసత్వ రాజకీయాలు వద్దు అని ఆయన ప్రజలకు పిలుపు ఇస్తారు. దానికి ధీటు అయిన జవాబు విపక్షాలు ఇవ్వలేక కుటుంబం లేని వారు మోడీ అంటున్నాయి,.
అయితే ఇది విమర్శ కాదు ఆయన మీద రాళ్ళు వేయబోయి పూలను జల్లుతున్నామని లాలూ వంటి వారు తెలుసుకోలేకపోతున్నారు. దీని కంటే ముందు ఏపీ మాజీ సీఎం చంద్రబాబు కూడా 2019 ఎన్నికల వేళ ఇలాగే మోడీకి కుటుంబం లేదు అని తీవ్ర విమర్శలు చేశారు. దాని ఫలితం ఆయన ఓటమి నాడు ఖాయమైంది.
మోడీని విమర్శించాలంటే ఆయన పాలన మీద చేయవచ్చు. పదేళ్లలో బీజేపీ ఏలుబడిలో ఎన్నో వైఫల్యాలు ఉన్నాయి. వాటిని గట్టిగా చెప్పవచ్చు. కానీ మోడీని వ్యక్తిగతంగా టచ్ చేస్తే మాత్రం అది విపక్షాలకు రివర్స్ లో కొడుతుంది. ఎందుకంటే ఈ దేశ ప్రజానీకం ఆ విషయంలో మోడీనే సమర్ధిస్తారు.
ఆయనకు కుటుంబం లేకపోవడం వల్లనే అవినీతి సొంతంగా ఆయన చేయలేదు, చేయబోడు అన్న గట్టి నమ్మికతోనే మోడీ ఇమేజ్ ప్రతీ ఎన్నికలోనూ గెలిపిస్తోంది. ఏది ఏమైనా కుటుంబం అంటే ఎపుడూ సమాజమే. ఇక ప్రతీ వారి కుటుంబం ఆ సమాజంలోని భాగమే. కాస్తా విశాలంగా ఆలోచిస్తే మోడీ కుటుంబం దేశమే అని బీజేపీ నేతలు అంటున్నారు. ఇక్కడే పప్పులో కాలు వేసి విపక్షాలు మోడీకి సింపతీ పెంచుతున్నాయి.