ఏపీ సీఎం ప్రతినెలా పెన్షన్ పంచడం అవసరమా ?
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 9 నెలలు కావస్తోంది.
By: Tupaki Desk | 1 March 2025 2:30 PM GMTఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 9 నెలలు కావస్తోంది. గత ఏడాది జూన్ 4న కూటమి ప్రభుత్వం గెలుపొందగా, ఆయన సీఎంగా అదేనెల 12న ప్రమాణ స్వీకారం చేశారు. ఇక బాధ్యతలు చేపట్టిన తొలి రోజే ఐదు ఫైళ్లపై తొలి సంతకాలు చేశారు. అందులో ప్రధానమైనది పింఛన్ల పెంపు. అప్పటివరకు రెండు వేల రూపాయలు ఉన్న సామాజిక భద్రతా పింఛన్ ను ఒకేసారి రూ.4 వేలు చేశారు.
ఇక అంతకుముందు రెండు నెలల నుంచే పెంపు వర్తించేలా చర్యలు తీసుకుని జులైలో ఒకేసారి రూ.7 వేలు చొప్పున అందజేశారు. అలా ఆ నెల నుంచి పింఛన్ల పంపిణీకి స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరవుతున్నారు. అయితే ముఖ్యమంత్రి నెలవారీ పర్యటనలపై నెట్టింట విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రతిష్టాత్మకంగా భావించిన పింఛన్ల పెంపుపై చంద్రబాబు మాట నిలబెట్టుకున్నారు. ఈ ఘనతను చాటుకునేందుకు ఆయన స్వయంగా వెళ్లడాన్ని తప్పుపట్టడం లేదు. కానీ, అదే పేరుతో తొమ్మిది నెలలుగా ప్రతినెలా జిల్లాల పర్యటలకు వెళ్లడంపైనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రతినెలా రొటీన్ గా జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి స్థాయి నేత వెళ్లడం ఎందుకని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పింఛన్లను పెంచిందనే విషయం అందరికీ తెలిసిన తర్వాత ముఖ్యమంత్రి కొత్తగా చెప్పే విషయం ఏం ఉంటుందంటూ నిలదీస్తున్నారు. పింఛన్ల పంపిణీ పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయ లబ్ధి కోసమే ప్రయత్నిస్తున్నారు తప్ప, ఆయా జిల్లాల పర్యటనల్లో స్థానిక సమస్యలపై కనీస సమీక్ష కూడా జరగడం లేదని ప్రతిపక్షాలు కూడా విమర్శిస్తున్నాయి.
9 నెలలుగా రొటీన్ కార్యక్రమంగా జరుగుతున్న పింఛన్ల పంపిణీపై టీడీపీ కూటమిలోనూ కొంత నిరాసక్తి కనిపిస్తోందని అంటున్నారు. కొత్తలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా చాటుకున్నా, ఇప్పుడు 9 నెలల తర్వాతా ఇంకా ఏమి చెబుతామంటూ క్యాడర్ సైతం ఆసక్తి చూపడం లేదంటున్నారు. కానీ, సీఎం మాత్రం ఎలాంటి బోరు ఫీలవ్వకుండా ప్రతి నెలా ఠంచనుగా వెళ్లడంపై టీడీపీ శ్రేణులే ఆశ్యర్యం వ్యక్తం చేస్తున్నాయి.
అయితే ముఖ్యమంత్రి పర్యటనలపై పొలిటికల్ సర్కిల్స్ లో అనేక రకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు ఎప్పుడూ ఏదో ఒక కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటారని చెబుతున్నారు. ఆయన తొలినాళ్ల పాలనలో అంటే 1995లో ప్రజల వద్దకు పాలన, జన్మభూమి వంటి కార్యక్రమాలను హైలెట్ చేసేవారు. ఆయా కార్యక్రమాల ద్వారా ప్రజలను కలుసుకునేవారు. ఇక 2014లో అధికారంలోకి వచ్చాక పోలవరం సోమవారం అంటూ ప్రతివారం పోలవరం వెళ్లేవారు. అదే సమయంలో జలహారతి, జన్మభూమి కార్యక్రమాలతో జిల్లాల్లో పర్యటించేవారు. అయితే ప్రస్తుతం ఇలాంటి పథకాలు ఏవీ లేకపోవడంతో ముఖ్యమంత్రి నెలనెల పింఛన్ల పంపిణీకి పరిమితమవుతున్నారంటున్నారు.
సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు 9 నెలల పాలనలో పింఛన్లు కాకుండా మరే కొత్త పథకాన్ని తీసుకురాలేదనే విషయాన్ని రాజకీయ పరిశీలకులు ఎత్తిచూపుతున్నారు. ఒకటి రెండు నెలలకే పరిమితం కావాల్సిన కార్యక్రమాన్ని ప్రతి నెలా కొనసాగించడం వల్ల ఏం ఉపయోగమని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే టీడీపీ అధిష్టానం వరకు ఈ విమర్శలు వెళుతున్నాయా? లేదా? అనేది తెలియడం లేదు.