Begin typing your search above and press return to search.

తెలంగాణ ఎన్నికలు.. కోట్లాది రూపాయలు, బంగారం స్వాధీనం!

ఎన్నికల వేళ, ఎలాంటి లెక్కలు, పత్రాలు లేకుండా డబ్బు, బంగారం తరలించేవారు దొరికిపోతున్నారు.

By:  Tupaki Desk   |   12 Oct 2023 9:47 AM GMT
తెలంగాణ ఎన్నికలు.. కోట్లాది రూపాయలు, బంగారం స్వాధీనం!
X

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు తెరలేచిన సంగతి తెలిసిందే. నవంబర్‌ 30న ఎన్నికలకు, డిసెంబర్‌ 3న ఎన్నికల ఫలితాలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణవ్యాప్తంగా పోలీసులు విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. లెక్కచూపని, సరైన పత్రాలు, ఆధారాలు లేని డబ్బును, బంగారాన్ని స్వాధీనం చేసుకుంటున్నారు

ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడంతో ప్రత్యేకంగా చెక్‌ పోస్టులు ఏర్పాటు చేసి పోలీసులు విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. ఈ తనిఖీల్లో్ల లెక్కలేనంత కోట్లలో డబ్బు, కిలోల్లో బంగారం బయటపడుతోంది. ఎన్నికల వేళ, ఎలాంటి లెక్కలు, పత్రాలు లేకుండా డబ్బు, బంగారం తరలించేవారు దొరికిపోతున్నారు.

ఈ క్రమంలో అక్టోబర్‌ 11న ఒక్కరోజే రూ.2,47,30,500తో పాటు కిలో 600 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. వీటిని తీసుకెళ్తున్న సంబంధిత వ్యక్తులు ఎలాంటి ఆధారాలు చూపకపోవడంతో ఆయా నగదును, బంగారాన్ని పోలీసులు సీజ్‌ చేశారు. వీటిని ఆదాయపు పన్ను శాఖ అధికారులకు అప్పగిస్తామని వెల్లడించారు.

రంగారెడ్డి జిల్లా మంచాల పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఆగాపల్లి వద్ద మంచాల మండలం లోయపల్లికి చెందిన కె.శ్రీనివాస్‌ కారులో రూ.20 లక్షలు, కూకట్‌పల్లికి చెందిన సీహెచ్‌ రాజశేఖర్‌ రెడ్డి కారులో రూ.2లక్షలు స్వాధీనం చేసుకున్నారు.

అలాగే నిర్మల్‌ జిల్లా బైంసా ప్రాంతానికి చెందిన శ్రీధర్‌ తన కారులో కిలో బంగారం తీసుకువెళ్తుండగా గాంధీనగర్‌ స్టేషన్‌ పరిధిలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రూ.58 లక్షల విలువైన ఆ బంగారానికి సంబంధించి సరైన పత్రాలు చూపిస్తే అందజేస్తామని లేకపోతే ఆదాయ పన్ను శాఖ అధికారులకు అప్పగిస్తామని పోలీసులు తెలిపారు.

అలాగే హిమాయత్‌ నగర్‌ వై జంక్షన్‌ లో దోమలగూడ పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో వెంకటరమణ అనే ద్విచక్రవాహనదారుడు నుంచి రూ.1,75,000 స్వాధీనం చేసుకున్నారు.

అలాగే చైతన్యపురిలో బైక్‌ లపై వెళ్తున్న దిల్‌సుఖ్‌ నగర్‌ వీవీనగర్‌ కు చెందిన బిరాదార్‌ సిద్ధేశ్వర్, సరూర్‌ నగర్‌ ఇంద్రహిల్స్‌కు చెందిన బి.శంకర్‌ రెడ్డి నుంచి రూ.60 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సరూర్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధి కొత్తపేట చౌరస్తాలో గోషామహల్‌ కు చెందిన ప్రైవేటు ఉద్యోగి సునీల్‌ జహంగీర్‌ నుంచి రూ. 7 లక్షలు సీజ్‌ చేశారు.

సూర్యాపేట జిల్లా చిలుకూరులో బ్యాంక్‌ ఉద్యోగి చీర్యాల సాయికుమార్‌ కారులో రూ. 45 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా సూర్యాపేట జిల్లా అనంతగిరి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని తమ్మరబండపాలెం వద్ద ధాన్యం వ్యాపారి చింతకుంట్ల కోటేశ్వరరావుకు చెందిన కారులో రూ.7లక్షల 30వేలను పోలీసులు సీజ్‌ చేశారు.

అదేవిధంగా నల్లగొండ జిల్లా తిప్పర్తి వద్ద నెల్లూరు జిల్లాకు చెందిన కుంచాల సుధాకర్‌ కారులో పోలీసులు రూ.8 లక్షల 50 వేల నగదును సీజ్‌ చేశారు.

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ధర్మసాగర్‌ చెక్‌ పోస్టు వద్ద పోలీసుల తనిఖీల్లో రూ.18,39,500, అంతారం స్టేజీ సమీపంలో నిర్వహించిన తనిఖీల్లో రూ.7.40 లక్షలు, కొత్తూరు బైపాస్‌ (వై జంక్షన్‌)వద్ద రూ.8.85 లక్షల నగదు, అబ్దుల్లాపూర్‌ మెట్‌ పరిధిలో రూ. 5.11 లక్షలను పోలీసులు సీజ్‌ చేశారు.

గోల్కొండ టోలిచౌకీలోని అప్సర్‌ కాలనీకి చెందిన మహ్మద్‌ అశ్వాక్‌ ద్విచక్రవాహనంలో రూ.6 లక్షలు సీజ్‌ చేశారు. కుల్సుంపురా పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని పురానాపూల్‌ చౌరస్తాలో నార్సింగికు చెందిన ఆనంద్‌ నుంచి సుమారు 30 లక్షల విలువచేసే 600 గ్రాముల బంగారాన్ని సీజ్‌ చేశారు.

అదేవిధంగా నిజామాబాద్‌ జిల్లా ఇందల్వాయి వద్ద కామారెడ్డి నుంచి నిజామాబాద్‌ కు కారులో వస్తున్న ఓ వ్యక్తి నుంచి రూ. 50 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.

ఇలా గడిచిన 3 రోజుల్లో హైదరాబాద్‌ పోలీసులు 5.1 కోట్ల రూపాయల విలువ చేసే నగదు, 4.2 కోట్ల రూపాయల విలువ చేసే 7.7 కిలోల బంగారం, 8 లక్షల రూపాయలకు పైగా విలువ చేసే 11.7 కిలోల వెండిని పోలీసులు సీజ్‌ చేశారు.