పుంగనూరు ఎఫెక్ట్: పెద్దిరెడ్డి కుమారుడికి సీఆర్ పీఎఫ్ సెక్యూరిటీ
దీనిని సాక్ష్యంగా భావించిన కేంద్రం ఎంపీ విజ్ఞప్తి మేరకు సీఆర్పీఎఫ్ భద్రత కల్పించింది.
By: Tupaki Desk | 9 Aug 2024 9:30 PM GMTవైసీపీ ముఖ్య నాయకుడు, మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి కేంద్ర ప్రభుత్వం సీఆర్ పీఎఫ్ భద్రతను కల్పించింది. ఏపీలో సీఆర్ పీఎఫ్ భద్రత పొందుతున్న ఏకైక ఎంపీగా మిథున్‌రెడ్డి నిలిచారు. అయితే.. ఇక్కడ చిత్రమైన సంగతి ఏంటంటే.. గతంలో ఆదిలాబాద్ ఎంపీ కూడా కేంద్రాన్ని భద్రత కోరారు. అప్పట్లో ఇవ్వని కేంద్రం ఇప్పుడు వైసీపీకి చెందిన మిథున్ రెడ్డి కోరగానే మంజూరు చేయడం విశేషం.
ఎందుకిలా?
ప్రస్తుతం రాజంపేట ఎంపీగా ఉన్న మిథున్ రెడ్డికి ఇద్దరు గన్‌మెన్‌లు ఉన్నారు. గతంలోనూ ఇద్దరే ఉన్నా రు. అయితే.. వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత పుంగనూరులో అల్లర్లు పెరగడం తెలిసిందే. ఎవరు చేశారన్నది పక్కన పెడితే.. ఎంపీ మిథున్ రెడ్డి కేంద్రంగా మాత్రం ఈ దాడులు జరిగాయన్నది వాస్తవం. ఆయన బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కూడా దుండగులు ధ్వంసం చేశారు. దీనిపై అప్పట్లోనే రాష్ట్రంలో పెద్ద ఎత్తున దుమారం రేగింది. అధికార పార్టీ వర్సెస్ వైసీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగింది.
అనంతరం.. ఈవిషయంపై మిథున్ రెడ్డి పార్లమెంటులోనే ప్రస్తావించారు. పుంగనూరులో తనను తిరగ నివ్వకుండా అధికార పార్టీ కార్యకర్తలు, కొందరు నాయకులు అడ్డు తగులుతున్నారని కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా పుంగనూరులో జరిగిన ఘటనలు, తన వాహనం ధ్వంసం చేయడం వంటివాటికి సంబంధించిన వీడియోలను పార్లమెంటుకు సమర్పించారు. దీనిని సాక్ష్యంగా భావించిన కేంద్రం ఎంపీ విజ్ఞప్తి మేరకు సీఆర్పీఎఫ్ భద్రత కల్పించింది.
పుంగనూరులో ఇప్పటికీ..
ఎన్నికలు జరిగి, ఫలితం కూడా వచ్చేసి రెండు మాసాలకు పైగా అయినప్పటికీ.. పుంగనూరులో మాత్రం ఇప్పటికీ హైటెన్షన్ కొనసాగుతోంది. ఎక్కడ ఎప్పుడు ఎలాంటి దాడులు జరుగుతాయోనన్న ఆందోళన లతోనే ప్రజలు కాలం వెళ్లదీస్తున్నారు. మరోవైపు కీలక ప్రాంతాల్లో పోలీసులు పికెట్లు ఏర్పాటు చేశారు. ఇదిలావుంటే.. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వస్తే దిగ్బంధిస్తామంటూ బీసీవై నాయకుడు బోడే రామచంద్రయాదవ్ పిలుపునిచ్చారు. దీంతో పెద్దిరెడ్డి అసలు తన సొంత నియోజకవర్గం వైపే కన్నెత్తి చూడడం లేదని తెలుస్తోంది.