Begin typing your search above and press return to search.

దేశంలోనే తొలిసారి: ‘క్రై ఆఫ్ ది అవర్’ పేరుతో బాధితురాలి విగ్రహం

దీనిపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయం వ్యక్తమవుతోంది.

By:  Tupaki Desk   |   4 Oct 2024 4:31 AM GMT
దేశంలోనే తొలిసారి: ‘క్రై ఆఫ్ ది అవర్’ పేరుతో బాధితురాలి విగ్రహం
X

ఎక్కడైతే దారుణ అత్యాచారం జరిగిందో.. ఎక్కడైతే ఆమె బంగారు భవిత బద్దలైందో.. అక్కడే.. ఆమెకు జరిగిన దారుణాన్ని ఎప్పటికి గుర్తుకు వచ్చేలా విగ్రహాన్ని ఏర్పాటు చేసిన వైనం ఇప్పుడు చర్చగా మారింది. దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన కోల్ కతా ఆర్జీకర్ ఆసుపత్రిలో 31 ఏళ్ల ట్రైనీ వైద్యురాలిపై జరిగిన అమానవీయమైన అత్యాచారానికి గుర్తుగా ఆమె వేదనతో ఉండే ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

ఈ కేసులో బాధితురాలికి న్యాయం చేయాలంటూ ఇప్పటికి ఆర్జీకర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ వద్ద వైద్యులు నిరసనలు.. ఆందోళనలు చేస్తున్నారు. ఈ దారుణ ఘటన జరిగి రెండు నెలలు జరుగుతున్నా.. ఈ కేసు విచారణ ఒక కొలిక్కి రాలేదు. నిందితుడు ఎవరన్న దానిపై స్పష్టత నెలకొంది లేదు. ఈ క్రమంలో కాలేజీ ఆసుపత్రి ప్రాంగణంలో బాధితురాలికి నివాళిగా విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ‘క్రై ఆఫ్ ది అవర్’ పేరుతో తీవ్రమైన వేదనతో పెద్ద ఎత్తున ఆక్రందన చేస్తున్నట్లుగా సదరు విగ్రహం ఉంది.

దీనిపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయం వ్యక్తమవుతోంది. అత్యాచారానికి గురైన సమయంలో బాధితురాలు అనుభవించిన క్షోభను కళ్లకు కట్టేలా ఈ విగ్రహాన్ని రూపొందించారు. ఆసిత్ సైన్ అనే శిల్పి ఈ విగ్రహాన్ని రూపొందించటమే కాదు ‘ఆక్రందన గంట’ అన్న క్యాప్షన్ ను పెట్టారు. ఇది బాధితురాలి విగ్రహం కాదని.. ఆమె పడిన బాధ.. అనుభవించిన హింసకు ప్రతీకగా దీన్ని ఏర్పాటు చేసినట్లుగా శిల్పి పేర్కొన్నారు. అయితే.. దేశంలో మరెక్కడైనా అత్యాచార బాధితురాలికి విగ్రహాన్ని ఏర్పాటు చేయటం జరిగిందా? అని ప్రశ్నిస్తున్నారు. ఆమె ఉనికిని చాటేలా దీన్ని ఏర్పాటు చేశారని.. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు సరిపోయేలా లేదనన వాదన వినిపిస్తుంది. అయితే.. ఇదే అంశంపై దీనికి భిన్నమైన వాదనను వినిపిస్తున్నారు. బాధితురాలికి ఆక్రందన మనిషిని తట్టి లేపేలా ఉండాలని.. ఇలాంటివి పశువాంఛకు చెంప పెట్టులాంటివని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ విగ్రహం తాలుకూ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.